Read more!

English | Telugu

'ఖైదీ'లో సుమ‌ల‌త చేసిన క్యారెక్ట‌ర్‌కు ఫ‌స్ట్ చాయిస్ ప్ర‌భ అని మీకు తెలుసా?

 

ప‌దిహేను సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'నీడ‌లేని ఆడ‌ది' (1974) సినిమాలో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి, నాలుగున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా న‌టిగా రాణిస్తూ, మ‌రోవైపు న‌ర్త‌కిగా అమిత పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నారు ప్ర‌భ‌. అగ్ర‌న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, చిరంజీవి, మోహ‌న్‌బాబు  స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంలో దుర్యోధ‌నునిగా న‌టించిన ఎన్టీ రామారావుతో క‌లిసి చేసిన‌ "చిత్రం భ‌ళారే విచిత్రం.." పాట ఆమె కెరీర్‌లో మ‌ర‌పురానిదిగా నిలిచిపోయింది. అయితే త‌న స‌మ‌కాలీన తార‌లైన జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, రాధిక‌ త‌ర‌హాలో ఆమె స్టార్‌డ‌మ్‌ను అందుకోలేక‌పోయారు.

కొన్ని అవ‌కాశాలు ఆమె ప్ర‌మేయం లేకుండా మిస్స‌వ‌డం వ‌ల్ల కూడా ఆ మేర‌కు ఆమె కెరీర్‌కు న‌ష్టం వాటిల్లింది. వాటిలో ముఖ్య‌మైంది చిరంజీవి 'ఖైదీ'. అవును. ఆ సినిమాలో సుమ‌ల‌త చేసిన డాక్ట‌ర్ సుజాత పాత్ర‌ను మొద‌ట ఆఫ‌ర్ చేసింది ప్ర‌భ‌కే. ఆ సినిమా యూనిట్ మెంబ‌ర్ ఒక‌త‌ను ఆ సినిమాలో ప్ర‌భ‌కు ఆఫ‌ర్ చేసిన క్యారెక్ట‌ర్‌కు ఒక‌రోజు షూటింగే ఉంటుంద‌నీ, క‌థ‌లో ఇంపార్టెన్స్ ఉండ‌ద‌నీ చెప్ప‌డంతో.. అలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం ఎందుక‌ని దాన్ని వ‌దిలేసుకున్నారు ప్ర‌భ‌.

"కానీ ఆ త‌ర్వాతే తెలిసింది.. అది సెకండ్ హీరోయిన్ క్యారెక్ట‌ర్ అని. 'అది చేసుంటే..' అని ఇప్పుడు బాధ‌ప‌డ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని తెలుసు. కానీ ఒక‌రి కార‌ణంగా ఆ సినిమా మిస్స‌య‌వ‌డంతో కెరీర్‌లో చాలా న‌ష్ట‌పోయాను. అదే కేర‌క్ట‌ర్ చేసిన సుమ‌ల‌త‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. దాంతో పాటు ఆమెకు వ‌రుస‌గా చిరంజీవి స‌హా పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా అవ‌కాశాలు ల‌భించాయి. బ‌హుశా.. నేను పెద్ద సినిమాలు ఎక్కువ‌గా చెయ్య‌క‌పోవ‌డం వ‌ల్లే నా ఫ్రెండ్స్ జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, రాధిక అందుకున్న స్టార్‌డ‌మ్‌ను అందుకోలేక‌పోయానేమో." అని ఓ ఇంట‌ర్వ్యూలో అభిప్రాయ‌ప‌డ్డారు ప్ర‌భ‌.