English | Telugu

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 14 సార్లు చూసిన శోభన్‌బాబు సినిమా ఇదే!

సినిమా నచ్చితే ఒకటికి రెండుసార్లు చూడడం సహజమే. లెక్కకు మించిన సార్లు ఒక సినిమాను చూసిన వారూ ఉన్నారు. అయితే ఒక తమిళ స్టార్‌.. తెలుగు హీరో శోభన్‌బాబు సినిమాను 14 సార్లు చూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఇది జరిగి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఆ సినిమా పేరు ‘మానవుడు దానవుడు’. 1972లో ఈ సినిమా రిలీజ్‌ అయింది. అప్పటికి బెంగళూరులో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నారు రజినీకాంత్‌. తాను ‘మానవుడు దానవుడు’ చిత్రాన్ని 14 సార్లు చూశానని ఒక సందర్భంలో స్వయంగా రజినీకాంత్‌ తెలియజేశారు. అసలు ఆ సినిమాని రజినీ అన్నిసార్లు ఎందుకు చూశారు? ఆ సినిమాలోని విశిష్టత ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

1959లో చిత్ర పరిశ్రమకు వచ్చిన శోభన్‌బాబు మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత హీరో అయినప్పటికీ ఆయనకి మొదటి కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మానవుడు దానవుడు’. పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయం తర్వాత శోభన్‌బాబు తన రెమ్యునరేషన్‌ను లక్ష రూపాయలకు పెంచారు. లక్ష రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి హీరో శోభన్‌బాబే. 

అప్పటివరకు అన్నీ సాఫ్ట్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ వచ్చిన శోభన్‌బాబు మొదటిసారి ఒక ఎగ్రెసివ్‌ క్యారెక్టర్‌ చేసి మెప్పించారు. పగలు డాక్టర్‌ వేణుగా ఎంతో డీసెంట్‌గా ఉండే క్యారెక్టర్‌లో కనిపించే శోభన్‌బాబు, రాత్రి కాగానే ప్రతీకారం తీర్చుకునే జగన్‌ పాత్రలో పూర్తి వేరియేషన్‌ చూపించారు. క్లాస్‌ పాత్రలే కాదు, మాస్‌ క్యారెక్టర్స్‌ కూడా చేసి మెప్పించగలనని ‘మానవుడు దానవుడు’ చిత్రంతో ప్రూవ్‌ చేశారు శోభన్‌బాబు. క్లాస్‌ ఇమేజ్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఆ సమయంలో జగన్‌లాంటి క్యారెక్టర్‌ చెయ్యడం నిజంగా సాహసమనే చెప్పాలి. 

ప్రస్తుతం సొసైటీలో దిశ, నిర్భయలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. 50 ఏళ్ళ క్రితమే ఇలాంటి ఓ కథావస్తువును తీసుకొని కమర్షియల్‌గా హిట్‌ సాధించిన దర్శకుడు పి.సి.రెడ్డి. ఈ సినిమాలో హీరో చిన్నతనంలో అతని అక్కకు అలాంటి అన్యాయమే జరుగుతుంది. అతను పెరిగి పెద్దయిన తర్వాత ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే రాక్షసులను వెంటాడి చంపుతుంటాడు. ఇందులో సి.నారాయణరెడ్డి రాసిన ‘ఎవరు వీరు ఎవరు వీరు..’ అనే పాట రాశారు. వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు అనుభవిస్తున్న మహిళలను ఉద్దేశించి ఆ పాటను రాశారు నారాయణరెడ్డి. రోజుకి రెండు, మూడు షాట్స్‌ చొప్పున 20 రోజులు ఈ పాటను చిత్రీకరించడం విశేషం. చెన్నయ్‌లోని ప్రసాద్‌ రికార్డింగ్‌ థియేటర్‌లో రికార్డ్‌ అయిన తొలి పాట ఇదే. ఈ పాటను ఎస్‌.పి.బాలు పాడారు. అంత మంచి పాటను తను పాడినట్టుగా కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌గా పెట్టడంతో ఫీల్‌ అయ్యారు. ఇదే సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేసినపుడు తెలుగులో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సాంగ్‌ శివాజీ గణేశన్‌ పాడినట్టు చూపించారు. కానీ, తమిళ ప్రేక్షకులకు అలా చేయడం నచ్చలేదు. 

1972లో విడుదలైన ‘మానవుడు దానవుడు’ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు 3 లక్షల 60 వేలు. సినిమా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించి మొదటి రెండు వారాల్లోనే రూ.11 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం ఈ సినిమాను అలంకార్‌ థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీని ద్వారా వచ్చిన రూ.18వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఒక బెనిఫిట్‌ షో ద్వారా అంత మొత్తం వసూలు చేసిన తొలి సినిమా ‘మానవుడు దానవుడు’.