Read more!

English | Telugu

రజినీకాంత్‌ రిజెక్ట్‌ చేసిన రెండు కథలతో బ్లాక్‌బస్టర్స్‌ తీసిన శంకర్‌!

ఒక్క ఫ్లాప్‌ కూడా ఇవ్వకుండా వరసగా హిట్‌ సినిమాలు చెయ్యడం సాధ్యమేనా.. మన రాజమౌళి సాధ్యమని నిరూపించాడు. కానీ, ఎంత టాలెంటెడ్‌ డైరెక్టర్‌కైనా అది సాధ్యం కాదు.. ఈ విషయాన్ని డైరెక్టర్‌ శంకర్‌ ప్రూవ్‌ చేశాడు. ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో చలనచిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకున్న శంకర్‌ ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో టాప్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. అప్పట్లో ‘జెంటిల్‌మెన్‌’ ఒక సెన్సేషన్‌. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు జీన్స్‌, ఒకేఒక్కడు.. ఇలా వరసగా అన్నీ బ్లాక్‌బస్టర్స్‌ చేశాడు. అప్పటివరకు శంకర్‌ చేసిన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తూ వచ్చిన ఎ.ఎం.రత్నం ‘భారతీయుడు’ చిత్రాన్ని ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మించి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌, తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఒకేఒక్కడు’ చిత్రాన్ని తమిళ్‌లో శంకర్‌, మాదేష్‌ కలిసి నిర్మించారు. తెలుగులో ఎప్పటిలాగే ఎ.ఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమాని హిందీలో చేస్తే వరల్డ్‌ మార్కెట్‌ను అందుకోవచ్చనే ఆలోచన వచ్చింది రత్నంకి. వెంటనే అనిల్‌ కపూర్‌ హీరోగా ఒకే ఒక్కడు చిత్రాన్ని హిందీలో నాయక్‌ పేరుతో నిర్మించారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాతో నష్టాల్లో కొట్టుకుపోయాడు. శంకర్‌కు మొదటి ఓటమిని రుచి చూపించింది నాయక్‌. ఆ దెబ్బతో పెద్ద హీరోలెవరూ శంకర్‌తో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలోనే అందరూ కొత్త కుర్రాళ్లతో బోయ్స్‌ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ద్వారా నిర్మాత ఎ.ఎం.రత్నంని నష్టాల నుంచి బయటపడేద్దామనుకున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఇక ఏం చెయ్యాలో అర్థం కాని శంకర్‌ తన శిష్యుడు బాలాజీ శక్తివేల్‌ దర్శకత్వంలో ఒక యదార్థ ఘటన ఆధారంగా ‘కాదల్‌’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో విడుదలైంది. రెండు భాషల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ విజయం అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపుతూ ఒక కథని సిద్ధం చేసుకున్నాడు. అదే ‘అపరిచితుడు’. ఒకే వ్యక్తికి మూడు రకాల మనస్తత్వాలు ఉంటాయి. అదే మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌. ఈ రకమైన వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో మార్పు తీసుకొస్తాడు. అదే కథ. ఈ కథని తీసుకొని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ దగ్గరకు వెళ్లాడు. కథ వినిపించాడు. కానీ, రజినీకి అది నచ్చలేదు. తను చేయలేనని తిరస్కరించాడు. శంకర్‌ చెప్పిన కథను రజినీ రిజెక్ట్‌ చేయడం అది రెండోసారి. మొదట ‘ఒకే ఒక్కడు’ కథను రజినీకే వినిపించాడు. అది అతనికి అంతగా రుచించలేదు. ‘అపరిచితుడు’ కథను విక్రమ్‌కి చెప్పాడు. ఒకే వ్యక్తి మూడు రకాలుగా ప్రవర్తించడం అనేది విక్రమ్‌కి బాగా నచ్చింది. ఆ మూడు రకాల క్యారెక్టర్లకు సంబంధించి ఎంతో హోం వర్క్‌ చేశాడు విక్రమ్‌. అతని నుంచి శంకర్‌ ఏం ఆశిస్తున్నాడో గ్రహించి దానికి తగ్గ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో మొదట ఐశ్వర్యారాయ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత సిమ్రాన్‌ని కూడా అనుకున్నారు. అదీ వర్కవుట్‌ కాలేదు. ఆప్పుడా అదృష్టం సదాకి దక్కింది. ఇది భారీ బడ్జెట్‌ సినిమా అని శంకర్‌ ముందే ఎనౌన్స్‌ చేశాడు. ఎంత బడ్జెట్‌ అయినా నిర్మించేందుకు ఆస్కార్‌ రవిచంద్రన్‌ సిద్ధపడ్డాడు. 2003లో సినిమా ప్రారంభమైంది. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానని సినిమా ఓపెనింగ్‌లో చెప్పాడు శంకర్‌. కానీ, ఆరు నెలల్లో షూటింగ్‌ పార్ట్‌ కూడా పూర్తవ్వలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2005లో చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి రూ.26 కోట్లు బడ్జెట్‌ అయింది. తమిళ్‌లో ‘అన్నియన్‌’ పేరుతో, తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో, హిందీలో ‘అపరిచిత్‌’గా రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ‘నాయక్‌’, ‘బోయ్స్‌’ ఫ్లాపులతో వెనకపడిపోయిన శంకర్‌ ‘అన్నియన్‌’ ఒక్కసారిగా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు. విక్రమ్‌ తన అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో తన రేంజ్‌ని మరింత పెంచుకున్నాడు.