Read more!

English | Telugu

అక్కినేనికి కమల్‌హాసన్‌ స్టెప్పులు నేర్పించిన సినిమా ఏదో తెలుసా?

భారతదేశం గర్వించదగిన నటుల్లో కమల్‌హాసన్‌ ఒకరు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న కమల్‌ మూడున్నర ఏళ్ళ వయసులోనే కెమెరా ముందుకు వచ్చి సావిత్రి, జెమినీ గణేశన్‌ వంటి ఆర్టిస్టులతో కలిసి పనిచేశాడు. 1960లో విడుదలై ‘కలత్తూర్‌ కన్నమ్మ’ చిత్రంలో బాలనటుడిగా కెరీర్‌ని స్టార్ట్‌ చేసిన కమల్‌ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 65 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యం కలగక మానదు. అరడజనుకి పైగా సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన కమల్‌ ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చాలా సినిమాలకు పనిచేశాడు. ఆ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమాకి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. 

1970లో ‘శ్రీమంతుడు’ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు కమల్‌హాసన్‌. ఆ సినిమాకి తంగప్ప డాన్స్‌మాస్టర్‌. అప్పటికే భరతనాట్యం, కథక్‌లలో మంచి శిక్షణ పొందిన కమల్‌ని అసిస్టెంట్‌గా తీసుకున్నారు తంగప్ప. ఈ సినిమాలోని కొన్ని పాటలకు ఆయన నృత్యరీతుల్ని సమకూర్చారు. వాటిని ఆర్టిస్టులకు చేసి చూపించడం, వారికి తర్ఫీదు ఇవ్వడం కమల్‌హాసన్‌ పని. అప్పటికి కమల్‌ వయసు 16 సంవత్సరాలు. ఆ వయసులో అక్కినేని నాగేశ్వరరావులాంటి టాప్‌ హీరోకి స్టెప్పులు నేర్పించడం తన అదృష్టమని ఆ తర్వాత ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు కమల్‌. ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్‌ సమయంలోనే అక్కినేనికి, కమల్‌కి మంచి అనుబంధం ఏర్పడిరది. ఎందుకంటే అక్కినేని నాస్తికుడు. అలాగే కమల్‌ కూడా నాస్తికుడే. ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంతో వారి మధ్య స్నేహబంధం ఎక్కువ కాలం కొనసాగింది. కమల్‌ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా అక్కినేనిని కలవకుండా వెళ్ళరు. అక్కినేని 90వ ఏట కూడా ఆయన్ని కలిసి ఫోటో తీయించుకున్నారు కమల్‌.