English | Telugu
భానుమతి వర్సెస్ మౌనిక.. సాయిపల్లవి బెస్ట్ క్యారెక్టర్ ఏది?
Updated : Sep 27, 2021
అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన తారల్లో సాయిపల్లవి ఒకరు. మలయాళంలో నటించిన 'ప్రేమమ్' మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవేపుకు తిప్పుకుంది పల్లవి. తెలుగు ప్రేక్షకులకు 'ఫిదా' (2017) మూవీ ద్వారా పరిచయమై, భానుమతి పాత్రతో అందరినీ ఫిదా చేసేసింది. అయితే అదివరకే 2009లో 'ఢీ.. అల్టిమేట్ డాన్స్ షో'లో కంటెస్టెంట్‌గా ఆమె పార్టిసిపేట్ చేసిన విషయం కొంతమందికి తెలుసు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'ఫిదా' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టవడంతో టాలీవుడ్ డైరెక్టర్స్‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది పల్లవి.
'ఫిదా'లో ఆరున్నర అడుగుల వరుణ్ తేజ్ సరసన పొట్టిపిల్లగా కనిపించినప్పటికీ ఆ జోడీ ఆడియెన్స్‌ను అలరించింది. దాని తర్వాత ఆమె నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో తన అసలు పేరు పల్లవితోటే నటించి ఆకట్టుకుంది. ముద్దు పేరు మాత్రం చిన్ని. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన ద్విభాషా చిత్రం 'కణం' (తమిళంలో 'దియా')లో తులసి అనే ఛాలెంజింగ్ రోల్ చేసింది సాయిపల్లవి. పెళ్లికి ముందే గర్భందాల్చి, బలవంతంగా అబార్షన్ చేయించుకోవాల్సిన పాత్రలో పల్లవి సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే 'కణం' ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీగా నిలించిందే కానీ, జనాదరణ పొందలేదు.
శర్వానంద్ సరసన పల్లవి నటించిన 'పడిపడి లేచే మనసు' కూడా సరిగా ఆడలేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెడికో వైశాలి పాత్రను పోషించింది పల్లవి. తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది. ఇతివృత్తం, కథనం ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయలేకపోవడంతో ఆశించిన రీతిలో ఈ సినిమాని జనం ఆదరించలేదు.
మూడేళ్ల గ్యాప్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'లవ్ స్టోరి'లో చేసిన మౌనిక పాత్రతో వచ్చింది పల్లవి. పెద్దింటి కుటుంబానికి చెంది, చిన్నతనం నుంచే లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిగా, తన కాళ్లమీద తను నిలబడాలనే పట్టుదలతో ఆర్మూర్ గ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన అమ్మాయిగా పల్లవి ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేసింది. ఆమెకు తోడు హీరో రేవంత్ పాత్రలో నాగచైతన్య ఇచ్చిన పర్ఫార్మెన్స్ 'లవ్ స్టోరి'ని మెమరబుల్ మూవీగా నిలిపింది. ఈ మూవీలో పలు సందర్భాల్లో పల్లవి చేసిన డాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవనిపించింది.
టాలీవుడ్ సినిమాల వరకు చూసుకుంటే.. ఒక్క 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో చేసిన పల్లవి పాత్ర మినహాయిస్తే మిగతా సినిమాల్లో సాయిపల్లవి చేసినవన్నీ అభినయానికి ప్రాధాన్యం ఉన్న సినిమాలే కావడం, అవన్నీ కూడా సంఘర్షణతో కూడినవి కావడం గమనార్హం. వీటిలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్‌ను ఎంచడం కష్టమే కానీ ప్రేక్షకుల హృదయాలకు ఆమెను బాగా దగ్గరకు చేర్చినవి మాత్రం 'ఫిదా' చిత్రంలోని భానుమతి, 'లవ్ స్టోరి' మూవీలోని మౌనిక పాత్రలనేది నిజం.