Read more!

English | Telugu

సెన్సేష‌న‌ల్ యాక్ట్రెస్‌ దివ్య‌భార‌తి మృతి ఇప్ప‌టికీ ఒక మిస్ట‌రీ!

 

దివ్య ఓంప్ర‌కాశ్ భార‌తి అంటే ఎవ‌రా అని ఆలోచన‌లో ప‌డొచ్చు. అదే.. దివ్య‌భార‌తి అంటే ఠ‌క్కున మ‌న‌కు ‘బొబ్బిలి రాజా’, ‘అసెంబ్లీ రౌడీ’ హీరోయిన్ గుర్తుకొచ్చేస్తుంది. కేవ‌లం మూడంటే మూడు సంవ‌త్స‌రాల కెరీర్‌లో సౌత్‌, నార్త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అగ్ర తార‌గా రాణించి, జూనియ‌ర్ శ్రీ‌దేవిగా గుర్తింపు పొంది, పందొమ్మిది సంవ‌త్స‌రాల వ‌య‌సుకే.. త‌ను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి కింద‌ప‌డిపోయి ఆక‌స్మికంగా అసువులు బాసి, దేశాన్నంతా బిగ్ షాక్‌కు గురి చేసింది దివ్య‌భార‌తి. ఆ వార్త‌తో ఎంత‌మంది కుర్ర‌కారు గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయో! త‌న అందంతో, త‌న పాత్ర‌ల‌తో ఎంత‌గా మీడియా దృష్టిలో ప‌డిందో, అంత‌కంటే ఎక్కువ‌గా త‌న మ‌ర‌ణంతో ఆమె ఆ మీడియాలో నానింది.

దివ్య‌భార‌తి వ్య‌క్తిగ‌త జీవితం గురించి అప్పుడే చాలామందికి తెలిసింది. అయిన‌ప్ప‌టికీ నేటి ప్రేక్ష‌కుల్లో ఎక్కువ‌మందికి ఆమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ సాజిద్ న‌దియ‌డ్‌వాలాను వివాహం చేసుకుంద‌నే విష‌యం తెలియ‌దు.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఏమాత్రం సంబంధంలోని కుటుంబంలో 1974లో జ‌న్మించింది దివ్య‌. సినీ హీరోయిన్ కావ‌డ‌మ‌నేది ఆమెకు సుదూర క‌ల‌. కానీ టీనేజ్‌లోకి అడుగు పెట్టిన ఏడాదికే, అంటే 14 ఏళ్ల వ‌య‌సులో ఆమె నిర్మాత నందు తొలానీ దృష్టిలో ప‌డింది. ఆమెను చూసీ చూడ‌గానే, వెంట‌నే త‌న సినిమాల్లోకి ఆమెను తీసుకోవాల‌ని ఆయ‌న అనుకున్నాడు. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది కానీ ఇత‌ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డింది దివ్య‌. అదీ ఓ టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దృష్టిలో. ఆయ‌న సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌ల్లో ఒక‌రైన డి. సురేశ్‌బాబు. వెంక‌టేశ్ స‌ర‌స‌న‌ ‘బొబ్బిలి రాజా’ (1990)లో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా తెరంగేట్రం చేసింది దివ్య‌. ఆమెలో శ్రీ‌దేవిని చూసుకున్నారు జ‌నం. త‌న అపురూప సౌంద‌ర్య విలాసంతో, ముచ్చ‌టైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేసింది ప‌ద‌హారేళ్ల ప‌డుచు దివ్య‌.

ఆ త‌ర్వాత తెలుగులో చ‌క‌చ‌కా రౌడీ అల్లుడు, నా ఇల్లే నా స్వ‌ర్గం, అసెంబ్లీ రౌడీ సినిమాలు చేసింది. అప్పుడు స‌న్నీ డియోల్‌తో ‘విశ్వాత్మ’ (1992)లో హీరోయిన్‌గా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అది ఆమె తొలి హిందీ చిత్రం. అది చెప్పుకోద‌గ్గ రీతిలో ఆడ‌క‌పోయినా, అందులో చేసిన “సాత్ స‌ముంద‌ర్” సాంగ్‌తో ఆమె అక్క‌డ సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. అప్ప‌ట్లో అది హిందీ ఆడియెన్స్ అందరి ఫేవ‌రేట్ సాంగ్‌. ఇప్ప‌టికీ ఆ పాట‌ను హ‌మ్ చేసుకుంటూనే ఉంటారు. 1992లోనే ఆమె 12 సినిమాలు చేసిందంటే ఆమె గిరాకీ ఏ రేంజిలో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. వాటిలో రెండు తెలుగు సినిమాలు.. ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధ‌ర్మ‌క్షేత్రం’ ఉన్నాయి. ఆ త‌ర్వాత ఆమె అనేక సినిమాల‌కు సంత‌కం చేసింది. కేవ‌లం మూడేళ్ల కాలంలోనే ఆమె 21 సినిమాలు చేస్తే, దాదాపు మ‌రో 30 సినిమాల‌కు ఆమె సంత‌కం చేసింద‌ని స‌మాచారం!

హిందీలో దివ్యభార‌తి చేసిన రెండో సినిమా ‘షోలా ఔర్ ష‌బ్న‌మ్‌’. దాని హీరో గోవిందా. సాజిద్ న‌దియ‌డ్‌వాలా అప్పుడే ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేక‌ర్‌గా అప్పుడే త‌న బ్యాన‌ర్‌ను మొద‌లుపెట్టి, ‘జుల్మ్ కీ హుకుమ‌త్’ సినిమా నిర్మిస్తున్నాడు. అందులోనూ గోవిందానే హీరో. స‌హ‌జంగానే ఈ రెండు సినిమాల షూటింగ్‌లు క్లాష్ అయ్యాయి.
 
గోవిందాను క‌లుసుకోవ‌డానికి ఓసారి ‘షోలా ఔర్ ష‌బ్న‌మ్’ సెట్స్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు సాజిద్‌. త‌న జీవితాన్ని ఆ రోజు మార్చేస్తుంద‌ని అత‌డు ఊహించ‌లేదు. అక్క‌డ దివ్య‌భార‌తిని చూడ‌గానే క‌ళ్లు తిప్పుకోలేక‌పోయాడు సాజిద్‌. 26 సంవ‌త్స‌రాల అత‌డు తొలిచూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డిపోయాడు.
 
ఆ రోజు ప‌రిచ‌యం త‌ర్వాత‌, ఇక ప్ర‌తిరోజూ ఆమె కోసం అక్క‌డికి రావ‌డం మొద‌లుపెట్టాడు. మొద‌ట స్నేహం కుదిరింది. రోజులు గ‌డిచేకొద్దీ గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుకోవ‌డం సాధార‌ణ‌మైంది. దాంతో ఒక‌రిమీద ఒక‌రికి మ‌న‌సైంది. త‌మ మ‌ధ్య ప్రేమ కుదిరింద‌ని తెలుసుకున్నారు. కానీ దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు.

ఇద్ద‌రివీ భిన్న మ‌తాల నేప‌థ్యాలైన‌ప్ప‌టికీ, దివ్య కెరీర్ అప్పుడ‌ప్పుడే మొద‌లైన‌ప్ప‌టికీ, సాజిద్ ఇంకా పూర్తి స్థాయిలో నిల‌దొక్కుకోన‌ప్ప‌టికీ, 1992లో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. నిజానికి దివ్య మేజ‌ర్ అవ‌డం కోసం వారు ఎదురు చూశారు. ఆమెకు ప‌ద్దెనిమిదేళ్లు నిండ‌గానే మే 10న మ్యారేజ్ చేసుకున్నారు. సాజిద్ కోసం దివ్య ఇస్లాం మ‌తంలోకి మారి, త‌న పేరును స‌న న‌దియ‌డ్‌వాలాగా పేరు కూడా మార్చుకుంది.

పెళ్ల‌య్యాక కూడా వారు దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. అయితే వాళ్లు పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం మాత్రం కొన‌సాగుతూ వ‌చ్చింది. త‌ను ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో సాజిద్‌తో త‌న‌కు స‌న్నిహిత బంధం ఉంద‌ని చెప్తూనే పెళ్లయ్యింద‌నే విష‌యాన్ని చెప్ప‌కుండా దాట‌వేస్తూ వ‌చ్చింది దివ్య‌. కాక‌పోతే 1994లో ఓ బిగ్ న్యూస్ చెబుతాన‌ని మాత్రం హింట్ ఇచ్చింది.


 
కానీ ఆ బిగ్ న్యూస్‌ను అనౌన్స్ చేయ‌డానికి ఆమె బ‌తికి లేదు. ఎందుకంటే.. 1993 ఏప్రిల్ 5నే త‌న అపార్ట్‌మెంట్ నుంచి ఐదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డి తీవ్ర గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఆమె అర్ధంత‌ర మ‌ర‌ణం అనేక అనుమానాల‌కు, వివాదాల‌కు తావిచ్చింది. ఆ దుర్ఘ‌ట‌న వెనుక సాజిద్ ఉన్నాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ అవి ధ్రువీక‌ర‌ణ కాలేదు. ఇప్ప‌టికీ దివ్య‌భార‌తి మృతి ఒక మిస్ట‌రీ.

దివ్య మ‌ర‌ణంతో సాజిద్ గుండె ప‌గిలింది. అప్ప‌ట్నుంచీ త‌ను నిర్మించిన సినిమాల‌ను ఆమెకు అంకితం ఇస్తూ వ‌చ్చాడు. వార్దా ఖాన్ అనే జ‌ర్న‌లిస్ట్‌ను మ్యారేజ్ చేసుకొనే దాకా అత‌డు ఆ అల‌వాటును కొన‌సాగించాడు. ఇప్ప‌టికీ సాజిద్ వాలెట్‌లో దివ్య‌భార‌తి ఫొటో ఉంటుంద‌ని వార్దా ఖాన్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించడం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.