English | Telugu
ఎన్టీఆర్, దేవిక గురించి రూమర్స్.. ఎన్టీఆర్ లేకపోతే తాను లేనన్న దేవిక!
Updated : Oct 25, 2024
పాత రోజుల్లో సినిమా ఇండ్రస్టీలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య మంచి అనుబంధం, ఆప్యాయతలు ఉండేవి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఎందుకంటే అప్పట్లో టాప్ హీరోయిన్లుగా ఉన్న నటీమణులు పెద్ద హీరోలతో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు.. హీరోలతో చేసే సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఆరోజుల్లో ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోతో సావిత్రి, కృష్ణకుమారి, దేవిక వంటి హీరోయిన్లు 20కి తగ్గకుండా సినిమాలు చేశారు. అన్ని సినిమాల్లో కలిసి పనిచేయడం వల్ల సహజంగానే వారి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే దాన్ని తప్పుగా భావించిన సంఘటనలు కూడా జరిగాయి. హీరో, హీరోయిన్ మధ్య ఏదో వుంది అంటూ ఇప్పుడు వస్తున్న గాసిప్స్‌లాగే అప్పుడు కూడా వచ్చేవి. అలాంటి గాసిప్స్‌ను కాగడా, హిందు నేషన్ వంటి పత్రికలు ప్రచురించేవి. అవి ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ప్రజలు మాత్రం వాటిని చదివి ఎంజాయ్ చేసేవారు.
ఎన్టీఆర్‌తో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన వారిలో సావిత్రి, కృష్ణకుమారి, దేవిక ముఖ్యులు. వీరిలో కృష్ణకుమారితో ఎన్టీఆర్‌కు ఎఫైర్ ఉందని అప్పట్లో పత్రికలు కోడై కూసేవి. ఆ తర్వాత ఎన్టీఆర్, దేవిక మధ్య ఏదో ఉందని రకరకాలుగా వార్తలు వచ్చేవి. అయితే ఎన్టీఆర్‌గానీ, దేవికగానీ అవేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయేవారు. ఒకసారి దేవికను ఇంటర్వ్యూ చేసిన ఓ జర్నలిస్ట్ ‘ఎన్టీఆర్‌తో మీ అనుబంధం ఎలాంటిది?’ అని ప్రశ్నించాడు. అతను ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న అడిగాడో అర్థం చేసుకున్న దేవిక ‘మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. రామారావుగారంటే నాకు ఎంతో అభిమానం. ఆయన తన సహనటిపై చూపించే ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే.. ఒక విధంగా రామారావుగారు లేకపోతే దేవిక అనే నటి లేదు. ఈరోజు మీ ముందుకు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాననంటే దానికి కారణం రామారావుగారే’ అంటూ సమాధానమిచ్చారు.
దేవిక అలా సమాధానం చెప్పడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఎన్టీఆర్, దేవిక జంటగా నటించిన ‘కంచుకోట’ చిత్రంలోని ‘లేదు లేదని.. ఎందుకు నీలో ఉన్నది దాస్తావు’ అనే పాటను తమిళనాడులోని హోగిన్‌కల్ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రీకరిస్తున్నారు. ఆ వాటర్ ఫాల్స్ ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. ఆ పాటలో నటిస్తున్న సమయంలో దేవిక పొరపాటున నీళ్ళలోకి జారిపోయారు. ఆమె కొట్టుకుపోతూ ఉండడంతో ఎన్టీఆర్ ఎంతో సాహసోపేతంగా ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. తను ప్రాణాలతో ఉండడానికి, నటిగా కొనసాగడానికి కారకులు రామారావుగారేనని ఎన్నో సందర్భాల్లో చెప్పారు దేవిక.
మరో సినిమా షూటింగ్ కోసం ఓసారి ఔట్‌డోర్ వెళ్ళాల్సి వచ్చింది. ఎన్టీఆర్, దేవిక రాత్రి, పగలు అనే తేడా లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఒకరోజు లంచ్ బ్రేక్‌లో భోజనం కూడా చెయ్యకుండా రూమ్‌కి వెళ్లి పడుకున్నారు దేవిక. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఆమె మంచి నిద్రలో ఉండడం గమనించారు. ఆమెను తట్టి లేపారు. ఎంతో ప్రయత్నం తర్వాత నిద్ర లేచారు దేవిక. లేచిందే తడవుగా ఆమెను తిట్టడం మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఆయన అలా మాట్లాడడం వెనుక కారణం ఉంది. దేవిక నిర్విరామంగా షూటింగ్స్ చేస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఎందుకండీ.. ఇలా విశ్రాంతి కూడా లేకుండా అన్ని సినిమాలు చెయ్యడం అవసరమా. ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. కానీ, మీరు వినరు’ అంటూ కోపం ప్రదర్శిస్తూ అన్నారు ఎన్టీఆర్. తన ఆరోగ్యంపై అంత శ్రద్ధ చూపిస్తూ.. తన కోసం ఆయన అలా మాట్లాడుతుంటే దేవిక కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలాంటి సంఘటనలు ఎన్టీఆర్, దేవిక మధ్య ఎన్నో చోటు చేసుకున్నాయి. వీటన్నింటి వల్ల వీరిద్దరి గురించి తప్పుగా రాసే అవకాశం పత్రికలకు కలిగింది. అయితే వీరి గురించి ఎన్ని వార్తలు వచ్చినా ఎన్టీఆర్‌గానీ, దేవికగానీ ఎప్పుడూ స్పందించకపోవడం విశేషం.