English | Telugu

లక్ష రూపాయలతో మద్రాస్‌ వెళ్లిన చలపతిరావు.. 1200 సినిమాలు ఎలా చేశారో తెలుసా?

తెలుగు చలనచిత్ర సీమలో నటుడు చలపతిరావుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినీ ప్రస్థానంలో దాదాపు 1200 సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా వివిధ పాత్రలు పోషించారు. 1969లో ఎన్‌.టి.ఆర్‌ హీరోగా వచ్చిన ‘కథానాయకుడు’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు చలపతిరావు. 5 దశాబ్దాలపాటు నటుడుగా కొనసాగిన చలపతిరావు తన మిత్రుడు రాధాకృష్ణతో కలిసి ఆర్‌.సి.క్రియేషన్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి కడప రెడ్డెమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళపంట, కలియుగ కృష్ణుడు, ప్రెసిడెంట్‌గారి అల్లుడు వంటి సినిమాలను నిర్మించారు. చలపతిరావు కుమారుడు రవిబాబు నటుడుగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా విజయవంతమైన సినిమాలు తీశారు. నటుడుగా సుదీర్ఘమైన కెరీర్‌ని కొనసాగించిన చలపతిరావు.. తన సినీ ప్రస్థానం గురించి ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. 

‘మాది కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు గ్రామం. నాకు చిన్నతనం నుంచీ చదువంటే ఇంట్రెస్ట్‌ ఉండేది కాదు. ఎంతో కష్టపడి పి.యు.సి. పూర్తి చేశాను. డిగ్రీలో చేరిన మొదటి సంవత్సరమే చదువు మనకు అబ్బదు అని అర్థమైంది. నాటకాలంటే విపరీతమైన పిచ్చి. ఎన్నో నాటకాల్లో నటించాను. సినిమా మీద ఇంట్రెస్ట్‌తో లక్ష రూపాయలు తీసుకొని మద్రాస్‌ రైలు ఎక్కేశాను. అక్కడికి వెళ్లిన తర్వాత 15 వేలతో ఓ డబ్బింగ్‌ సినిమా తీసుకున్నాను. అది ఫ్లాప్‌ అయింది. కారు ఉంటే వేషాలు వస్తాయని కారు కొన్నాను. అది యాక్సిడెంట్‌ అయింది. అలా తెచ్చుకున్న లక్ష రూపాయలు ఆవిరైపోయాయి. ఏం చెయ్యాలో తెలీక రామారావుగారి దగ్గరికి వెళ్లాను. వేషాల కోసం మద్రాస్‌ వచ్చానని చెప్పాను. ‘ఇక్కడ చాలా కష్టం. బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగంలో చేరు’ అని చెప్పారు. ఆ తర్వాత ఊరికి వచ్చేసి మరో వారం తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన్ని కలిశాను. ఆ టైమ్‌లో ఆయన ‘కథానాయకుడు’ సినిమా చేస్తున్నారు. ఏదైనా వేషం ఇవ్వమని డైరెక్టర్‌కి చెప్పారు. అందులో నేను ఎలక్షన్‌ కమిషనర్‌ క్యారెక్టర్‌ చేశాను. 

ఆ సినిమా తర్వాత నుంచి ప్రతిరోజూ రామారావుగారిని కలిసేవాడిని. ఆయన చేసే సినిమాల షూటింగులకు వెళ్ళేవాడిని. అలా ఆయనతోనే ఉండేవాడిని. రామారావుగారు చేసే ప్రతి సినిమాలో నాకు ఏదో ఒక వేషం ఇచ్చేవారు. దానవీరశూర కర్ణ సినిమా చేస్తున్న సమయంలో, కృష్ణగారు కురుక్షేత్రం చేస్తున్నారు. ఆ సినిమా కోసం మద్రాస్‌లో వున్న ఆర్టిస్టులందర్నీ రాజస్థాన్‌ తీసుకెళ్లిపోయారు. దానవీరశూర కర్ణ చిత్రంలో వేషాలు వెయ్యడానికి ఆర్టిస్టులు కరువైపోయారు. ఆ సమయంలో రామారావుగారు నన్ను మూడు రోజులకు ఒక వేషానికి పిలిచేవారు. జరాసంధుడు, ఇంద్రుడు, సూతుడు.. ఇలా ఆ సినిమాలో నా క్యారెక్టర్లు పెరుగుతూ పోతున్నాయి. అలా ఐదు వేషాలు, ఏడెనిమిది గెటప్‌లు అయిపోయాయి. ఆ సినిమా తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది. వరసగా అవకాశాలు వచ్చాయి. అందరు హీరోల సినిమాల్లో నటించాను. అయితే ఎక్కువగా విలన్‌ వేషాలే వచ్చేవి. పైగా ప్రతి సినిమాలో మూడు, నాలుగు రేప్‌లు ఉండేవి. ఒక దశలో నాకు రేపుల చలపతిరావు అనే పేరు కూడా వచ్చేసింది. మొత్తం 94 రేప్‌లు చేశాను. మిగతా 6 కూడా పూర్తి చేసి 100 చెయ్యాలనుకున్నాను. కానీ, అవకాశం రాలేదు. నేను రేప్‌ చేసిన హీరోయిన్లందరూ టాప్‌ పొజిషన్‌కి వెళ్ళిపోయారు. ఆ సెంటిమెంట్‌ కూడా ఉంది. నేనంటే హీరోయిన్లు అందరూ భయపడిపోయేవారు. నేను తాగుతానని, అమ్మాయిలతో తిరుగుతానని, రేప్‌లు చేస్తానని అనుకునేవారు. కానీ, నా భార్యకు ఇచ్చిన మాట కోసం సిగరెట్‌, మందు, అమ్మాయిలు.. వీటి జోలికి నా జీవితంలో వెళ్ళలేదు. రామారావుగారికి కూడా మందు అలవాటు లేదు. ఆయనతో కలిసి ఉండడం వల్ల ఆ డిసిప్లిన్‌ కూడా నాకు వచ్చింది. ఏడున్నరకి భోజనం చేయడం, ఎనిమిది గంటలకు పడుకోవడం అలవాటైపోయింది.

ఇవన్నీ తెలీక నన్ను చూసి హీరోయిన్లు భయపడేవారు. ఔట్‌డోర్‌ షూటింగ్‌కి వెళితే.. నేను ఉన్న హోటల్‌లో హీరోయిన్లు ఎవరూ రూమ్‌ తీసుకునేవారు కాదు. అంతేకాదు, అప్పట్లో నేను చేసినవన్నీ విలన్‌ వేషాలు కావడంతో ఔట్‌డోర్‌ షూటింగ్‌కి వెళ్లినపుడు ఆడవాళ్ళు నన్ను చూసి భయంతో పారిపోయేవారు. త్రిశూలం సినిమా కోసం పూడిపల్లి అనే ఊరు వెళ్లాం. అందులో మొదటి రోజే కత్తి నూరుతూ వాడ్ని చంపేస్తా, వీడ్ని చంపేస్తా అంటూ క్రూరంగా ఉండే సీన్‌ ఒకటి షూట్‌ చేశారు. ఆ తర్వాత అక్కడ నేను పదిహేను రోజులు ఉన్నాను. నేను షూటింగ్‌కి వస్తున్నానని తెలిస్తే ఆడవాళ్లు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసేసుకునేవారు. నేను బయటికి వెళ్ళినపుడు కూడా ఎవరూ నా దగ్గరికి వచ్చేవారు కాదు, ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు కాదు. నిన్నే పెళ్లాడతా తర్వాత పూర్తిగా మారిపోయింది. బయటికి వెళ్లినపుడు జనం నన్ను చూసి దగ్గరికి రావడం, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం వంటివి చేశారు. ఆ సినిమా తర్వాత అన్నీ పాజిటివ్‌ వేషాలే చేశాను. అన్నయ్య, బాబాయ్‌, మావయ్య.. ఇలా అన్నీ మంచి క్యారెక్టర్సే చేశాను. నా కెరీర్‌లో నిన్నే పెళ్లాడతా సినిమాకి ముందు ఒక ఫేజ్‌.. ఆ సినిమా తర్వాత మరో ఫేజ్‌ అని చెప్పొచ్చు’ అంటూ వివరించారు నటుడు చలపతిరావు.