English | Telugu
మాస్ మహారాజ్ రవితేజ.. ఇలా అనిపించుకోవడం వెనుక ఉన్నది మెగాస్టార్ చిరంజీవి!
Updated : Jan 25, 2025
ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం టాలెంట్‌తో, స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే పరిశ్రమకు వచ్చినవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ చేరుకున్న రవితేజ చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడంతోపాటు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. దాదాపు పది సంవత్సరాలపాటు కష్టపడిన తర్వాతే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగారు. 35 సంవత్సరాల సినీ కెరీర్‌లో 74 సినిమాలు పూర్తి చేసిన రవితేజ 75వ సినిమా మాస్ జాతరతో సమ్మర్‌లో రాబోతున్నారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొంది మంచి మాస్ హీరోగా అనిపించుకోవడమే కాకుండా మాస్ మహరాజ్‌గా పేరు తెచ్చుకున్న రవితేజ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అతను పడిన శ్రమ ఎలాంటిది, ఒక స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎలాంటి కష్టాలు అనుభవించారు అనే విషయాలు ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. (Ravi Teja)
1968 జనవరి 26న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో భూపతిరాజు రాజగోపాలరాజు, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించారు రవితేజ. ఆయన అసలు పేరు భూపతిరాజు రవిశంకర్‌రాజు. ఆయన తమ్ముళ్లు రఘు, భరత్. తండ్రి ఫార్మాసిస్టు కావడంతో జైపూర్, ఢల్లీి, ముంబై, భోపాల్ వంటి ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. చివరికి వీరి కుటుంబం విజయవాడకు చేరింది. అక్కడ సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో బి.ఎ. పూర్తి చేశారు రవితేజ. సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల పై చదువులకు వెళ్ళకుండా మద్రాస్ రైలెక్కేశారు. అతనికి డైరెక్షన్‌పై కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేందుకు చాలా మందిని కలిశారు. ఆ సమయంలో గుణశేఖర్, వై.వి.ఎస్.చౌదరిలతో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారు రవితేజ. అప్పటికి వాళ్ళు కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలోనే కర్తవ్యం చిత్రంలో తొలిసారి ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత అరడజను సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. నిన్నే పెళ్లాడతా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచి అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ కొందరు హీరోలను ఇమిటేట్ చేసేవారు. అతనిలోని టాలెంట్ ఉందని గుర్తించిన కృష్ణవంశీ బ్రహ్మాజీ, రవితేజ హీరోలుగా సిందూరం చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా విజయం సాధించలేదుగానీ రవితేజకు నటుడుగా మంచి పేరు వచ్చింది.
సిందూరం తర్వాత యధావిధిగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న రవితేజ హీరోగా నీకోసం చిత్రాన్ని రూపొందించారు శ్రీను వైట్ల. కమర్షియల్‌గా ఫర్వాలేదు అనిపించిన ఈ సినిమా 7 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత కూడా రవితేజ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత కూడా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన రవితేజ 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంతో హీరోగా తన మార్క్ చూపించగలిగారు. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో కమర్షియల్ హిట్‌ని తన ఖాతాలో వేసుకొని హీరోగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నారు.
2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ చిత్రంతో కమర్షియల్ హీరోగా ఎదిగారు రవితేజ. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా రవితేజకు ఒక డిఫరెంట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ఖడ్గం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, భద్ర వంటి సినిమాలు రవితేజను పక్కా మాస్ హీరోగా నిలబెట్టాయి. 2006లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు చిత్రంతో స్టార్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అప్పుడు మొదలు రవితేజ కెరీర్ మంచి సక్సెస్ రేట్‌తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. నేనింతే, కిక్, డాన్ శీను, మిరపకాయ్, బలుపు, పవర్, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్ వంటి కమర్షియల్ సినిమాలతో తన ఇమేజ్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు రవితేజ. ఇటీవలి కాలంలో రవితేజ కెరీర్ కాస్త మందకొడిగా నడుస్తోంది. గడిచిన ఏడు సంవత్సరాల్లో రవితేజ 12 సినిమాల్లో నటించగా, వాటిలో క్రాక్, ధమాకా వంటి సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం భాను బొగ్గవరపు దర్శకత్వంలో మాస్ జాతర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ నటుడిగానే కాకుండా నిర్మాతగా ఆర్‌టి టీమ్ వర్క్స్ పతాకంపై తమిళ్‌లో మట్ట కుస్తీ, తెలుగులో రావణాసుర, ఛాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్ వంటి చిత్రాలను నిర్మించారు. ఖడ్గం చిత్రంలోని నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, నేనింతే చిత్రానికి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు రవితేజ. వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. 2002లో కళ్యాణితో రవితేజ వివాహం జరిగింది. వీరికి కుమార్తె మోక్షధ, కుమారుడు మహాధన్ ఉన్నారు. రవితేజ సోదరులు రఘు, భరత్‌రాజు కూడా పలు చిత్రాల్లో నటించారు. 2017లో భరత్‌రాజు ఓ కార్ యాక్సిడెంట్‌లో మృతి చెందారు.
(జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా..)