English | Telugu

గుమ్మడి.. తన వయసుకి మించిన పాత్రలు చేయడం వెనుక అసలు కారణం అదే!

గుమ్మడి.. తన వయసుకి మించిన పాత్రలు చేయడం వెనుక అసలు కారణం అదే!

(జనవరి 26 నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు వర్థంతి సందర్భంగా..)


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ నటుడికీ లేని ప్రత్యేకత గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉంది. ఆయన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎంతో విభిన్నమైనవి. చదువుకునే రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఉన్నత స్థానానికి చేరుకున్న రోజుల వరకు ఎక్కువ శాతం వృద్ధ పాత్రలు ధరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గుమ్మడి చేసినన్ని వృద్ధ పాత్రలు ఏ నటుడూ చెయ్యలేదంటే అతిశయోక్తి కాదు. తనకంటే ఎన్నో సంవత్సరాలు పెద్దవారుగా ఉన్న నటులకు తండ్రిగా, తాతగా, బాబాయ్‌గా ఎంతో సహజంగా నటించి పేరు తెచ్చుకున్నారు. 1950లో నటుడిగా ప్రారంభమైన గుమ్మడి కెరీర్‌ దాదాపు 50 సంవత్సరాలు కొనసాగింది. తెలుగు, తమిళ్‌ భాషల్లో 500 చిత్రాల్లో నటించారు.  హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన గుమ్మడి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎలా మారారు? తన వయసుకు మించిన పాత్రలు చేయడానికి కారణం ఏమిటి? ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది వంటి ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం.

1927 జూలై 9న గుంటూరు జిల్లా రావికంపాడు గ్రామంలో బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా అప్యాయత, అనుబంధాల మధ్య ఆయన బాల్యం గడిచింది. ఆయన చిన్నతనం నుంచి తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన వారితో స్నేహం చేసేవారు. అంతేకాకుండా, వారి కుటుంబంలో వృద్ధులు ఎక్కువగా ఉండేవారు. ఆ కారణంగానే ఆయనకు సాత్విక స్వభావం బాగా అబ్బింది. గుమ్మడి పాఠశాల విద్యాభ్యాసం రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు ఉన్నత పాఠశాలలో సాగింది. అక్కడ ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకు చదివారు. పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు అడుగులు వేశారు. కమ్యూనిస్టు భావాలు పుణికిపుచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఆ ఊరి మునసబు బుచ్చిరామయ్య.. గుమ్మడి తీరును గమనించి అతని మనసు మార్చారు. 17 సంవత్సరాల వయసులోనే గుమ్మడికి లక్ష్మీసరస్వతితో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత గుంటూరులోని హిందూ కాలేజీలో చేరారు గుమ్మడి. 

స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే పేదరైతు అనే నాటకంలో నటించాలంటూ స్కూల్‌ మాస్టారు ఆదేశించడంతో వృద్ధుడి పాత్ర ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు గుమ్మడి. అలా రంగస్థల ప్రవేశం జరిగింది. గుమ్మడికి పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టం. ఆ ఊరి లైబ్రరీలోని పుస్తకాలను బాగా చదివేవారు. అలా వీరాభిమన్యు నాటకం చదివారు. అది ఆయన్ని ఎంతో ఆకర్షించింది. కొంతమంది స్నేహితుల్ని పోగేసి కొంత డబ్బు సమకూర్చుకొని వీరాభిమన్యు నాటకం వేశారు. అందులో దుర్యోధనుడిగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆరోజుల్లో దుర్యోధనుడి పాత్ర వేయడంలో పేరు మోసిన మాధవపెద్ది వెంకట్రామయ్య ఈ విషయం తెలుసుకొని గుమ్మడిని కలిసారు. తనకోసం మరోసారి ఆ నాటకాన్ని ప్రదర్శించమని అడిగారు. నాటకం చూసిన తర్వాత పౌరాణిక పాత్రలు పోషించడంలోని మెళకువలను గుమ్మడికి నేర్పించారు. అతని నటన చూసి సినిమాల్లోకి వెళితే రాణిస్తావు అని చెప్పారు. ఆ క్షణమే గుమ్మడి మనసు సినిమాలవైపు మళ్లింది. 

ఆ తర్వాత మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసినా కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. చివరికి 1950లో వచ్చిన అదృష్టదీపుడు చిత్రంతో నటుడుగా తొలి అవకాశాన్ని పొందారు. ఆ తర్వాత నవ్వితే నవరత్నాలు, పేరంటాలు, ప్రతిజ్ఞ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఊరికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఎన్‌.టి.రామారావుతో ఉన్న పరిచయం కారణంగా ఆయనకు ఒక మాట చెప్పి వెళ్లాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం తిరిగి వెళ్లొద్దని, నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ పేరుతో ఓ నిర్మాణం సంస్థను ప్రారంభిస్తానని, తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో మద్రాస్‌లోనే ఉండిపోయారు గుమ్మడి. పిచ్చిపుల్లయ్య సినిమాలో ఆయనకు విలన్‌ పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత తోడుదొంగలు చిత్రంలో ఎన్టీఆర్‌, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. 

తోడు దొంగలు చిత్రం తరువాత కూడా చిన్నచిన్న వేషాలతో కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్ర జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఆయనకు అభించింది. అర్ధాంగిలో జమీందారు పాత్ర గుమ్మడికి చాలా మంచి పేరు తేవడమే కాకుండా సినిమా ఘనవిజయం సాధించింది. అలా తెలుగు చిత్ర సీమకు గంభీరమైన తండ్రి పాత్రలు చేయగల నటుడు లభించారు. ఈ సినిమా తర్వాత గుమ్మడి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయనకు లభించాయి. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో అయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అయితే ప్రతి సినిమాలోనూ దాదాపుగా తన వయసుకు మించిన పాత్రలే చేసేవారు గుమ్మడి. ఒక సినిమాలో తనకంటే పెద్ద వారైన ఎస్‌.వి.రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య కంటే వయసులో పెద్దవాడి పాత్ర పోషించారు. 

పౌరాణిక చిత్రాల్లోని వశిష్ట, విశ్వామిత్ర పాత్రల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గుమ్మడి పోషించిన దశరథుడు, భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, సత్రజిత్‌, బలరాముడు, భృగు మహర్షి వంటి పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక సాంఘిక చిత్రాల్లో దాదాపుగా అన్నీ సాత్విక పాత్రలే పోషించారు గుమ్మడి. నమ్మినబంటు, లక్షాధికారి, విచిత్ర బంధం వంటి సినిమాల్లో విలన్‌గా కూడా మెప్పించారు. మాయాబజార్‌, మహామంత్రి తిమ్మరుసు, మా ఇంటి మహాలక్ష్మి, కులదైవం, కుల గోత్రాలు, జ్యోతి, నెలవంక, మరోమలుపు, ఏకలవ్య, ఈ చరిత్ర ఏ సిరాతో?, గాజు బొమ్మలు, పెళ్ళి పుస్తకం చిత్రాలు.. ఆయన చేసిన అద్భుతమైన సినిమాల్లో కొన్ని మాత్రమే. 

దాదాపు ఐదు దశాబ్దాలపాటు నటుడిగా కొనసాగిన గుమ్మడిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో, భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. జాతీయ సినిమా అవార్డుల న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశారు గుమ్మడి. ఎన్టీఆర్‌ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తన జీవిత చరిత్రను తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. 1995లో వచ్చిన ఆయనకి ఇద్దరు చిత్రంలో నటించినపుడు తన గొంతు సరిగా లేకపోవడంవల్ల నూతన్‌ప్రసాద్‌తో డబ్బింగ్‌ చెప్పించారు. తనకు వేరొకరు డబ్బింగ్‌ చెప్పడం ఇష్టం లేక సినిమాల్లో నటించడం మానుకున్నారు. ఆ తర్వాత 2008లో జగద్గురు శ్రీకాశీనాయన చరిత్ర చిత్రంలోని పాత్రకు గొంతు సరిపోతుంది కాబట్టి నటించారు. అదే ఆయన చివరి సినిమా. గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. 2008 తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2010 జనవరి 26న హైదరాబాద్‌లోని కేర్‌ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన చూసిన చివరి సినిమా రంగుల్లోకి మార్చిన మాయాబజార్‌. ఈ చిత్రాన్ని ఆయన ప్రేక్షకుల మధ్య థియేటర్‌లో చూశారు. ‘అంతటి గొప్ప సినిమాను రంగుల్లో చూసేందుకే నేను ఇంతకాలం బ్రతికి వున్నాను అనుకుంటున్నాను’ అంటూ సంతోషంగా అన్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు.