English | Telugu

వివాదాలకు దూరంగా ఉండే వారిద్దరి మధ్య గొడవొచ్చింది.. ఎందుకో తెలుసా?

హీరోల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ, సింగర్స్‌లో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.. ఈ ఇద్దరి గురించి తెలిసిన వారెవరైనా.. చాలా గొప్పవారని, ఎదుటివారిని నొప్పించరని, ముఖ్యంగా నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించరని చెబుతారు. తమ పని తాము చేసుకుంటూ పోవడం తప్ప ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ళని ఈ ఇద్దరూ మంచి మిత్రులు కూడా. కృష్ణ కెరీర్‌ ప్రారంభం నుంచీ ఆయనకి పాటలు పాడుతూ వచ్చారు బాలు. ఒక దశలో పాట పాడుతున్నది బాలు కాదు, కృష్ణ అనిపించేంత దగ్గరగా పాడేవారు. నిజజీవితంలో ఎంతో స్నేహంగా ఉండే ఇద్దరి మధ్య ఓ సందర్భంలో అగాధం ఏర్పడింది. ఆ కారణంగా కొన్ని సంవత్సరాలపాటు కృష్ణకు పాటలు పాడలేదు బాలు. వారిద్దరి మధ్య గ్యాప్‌ రావడం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జీవించి ఉన్న రోజుల్లో ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా తెలియజేశారు. 

‘కృష్ణగారు హీరోగా నటించిన ఓ సినిమాకి సంబంధించి నా రెమ్యునరేషన్‌ రావాల్సి ఉంది. నాలుగేళ్ళుగా ఆ ఎమౌంట్‌ ఇవ్వకుండా రేపు, మాపు అంటున్నారు. ఓరోజు ఆ నిర్మాతకు ఫోన్‌ చేసి అడిగినపుడు ‘డబ్బులివ్వకపోతే మాకు పనిచేయరా మీరు’ అన్నారు. ‘అంత ఆర్గ్యుమెంట్‌ అవసరం లేదు. నాకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నానంతే’ అని ఫోన్‌ పెట్టేశాను. వెంటనే కృష్ణగారు ఫోన్‌ చేసి ‘మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్‌ కావు అన్నారట’ అన్నారు. ‘తలకాయలో గుంజు ఉన్న వాడెవడైనా అలా మాట్లాడతాడా? నా తత్వం ఏమిటో మీకు తెలుసు. మీకు ఇలా ఎవరు చెప్పారో నాకు తెలీదు’ అన్నాను. ‘మీరు పాడకపోతే నా సినిమాలు ఆడవనుకుంటున్నారా?’ అన్నారు. ‘నేను పాడకపోయినా మీ సినిమాలు ఆడతాయి. వేరే సింగర్స్‌కి కూడా అవకాశం వస్తుంది. అలాగే మీరు నాకు ఇవ్వకపోయినా నాకు పాటలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ చిన్న విషయం గురించి మన స్నేహాన్ని పాడు చేసుకోవద్దు’ అన్నాను. ‘లేదు లేదు. మీ డబ్బు పంపించేస్తున్నాను. గతంలో నీ మిత్రుడి సినిమాలో యాక్ట్‌ చెయ్యమని చెప్పారు. అతను నాకు 20 వేలు బ్యాలెన్స్‌ ఉన్నాడు. అది వెంటనే పంపించండి’ అని ఫోన్‌ పెట్టేశారు. వెంటనే నేను ఆ 20 వేలు పంపించేశాను. ఆయన నాకు పంపాల్సిన రూ.800లకు చెక్‌ పంపారు. 

నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. అలాంటి హీరో దొరకడం చాలా కష్టం. నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నారంటే.. డబ్బు తీసుకునేవారు కాదు. సినిమా బాగా ఆడితే ఇస్తారులే అనేవారు. అలా ఎంతో మంది నిర్మాతలు డబ్బు ఇవ్వకపోయినా పట్టించుకునేవారు కాదు. ఈరోజుల్లో అలాంటి హీరో ఎవరున్నారు. ఇది జరిగిన తర్వాత చాలా సందర్భాల్లో కలుసుకున్నాం. కానీ, ఈ టాపిక్‌ మాత్రం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. అయితే దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆయనకు నేను పాడలేదు. రాజ్‌ సీతారాం అనే కొత్త అబ్బాయికి అవకాశాలు ఇచ్చారు. ‘మీరు పాడకపోవడం వల్లే కృష్ణగారి సినిమాలు హిట్‌ అవ్వడం లేదు’ అని చాలా మంది అన్నారు. ‘అందులో నిజం లేదు. నా పాటల వల్ల సినిమా ఎందుకు హిట్‌ అవుతుంది. సినిమాలో విషయం ఉంటే పాటలు లేకపోయినా జనం చూస్తారు’ అని చెప్పేవాడిని. ఇలా జరుగుతుండగా.. 

రాజ్‌కోటి ఒక కొత్త సినిమా రికార్డింగ్‌ స్టార్ట్‌ చేశారు. ‘గురువుగారూ మీరు పాడకపోతే పాటలు పాడైపోతున్నాయి’ అన్నారు. ‘పాటలేం పాడవ్వవు. మంచి సింగర్స్‌ ఉన్నారు పాడించుకోండి’ అని చెప్పాను. అదే సమయంలో వేటూరి సుందరరామ్మూర్తిగారు ఇందులో మధ్యవర్తిత్వం తీసుకున్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరినీ ఎక్కడైనా కలుపుతాను. మనసు విప్పి మాట్లాడుకోండి’ అన్నారు. ‘అంత పెద్దవారు నా దగ్గరకి రావడం ఏంటండీ. అవకాశం ఇస్తే నేనే ఆయన దగ్గరికి వెళ్లి ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తాను’ అన్నాను. వెంటనే పద్మాలయా ఆఫీస్‌కి వెళ్ళి కృష్ణగారిని కలిసి ‘సర్‌ మనవల్ల ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నాకు మీరు పాట ఇవ్వండి అని అడగడానికి రాలేదు. మనమధ్య ఈ అభిప్రాయ భేదం రావడానికి కారణం ఏమిటి అనేది ఎక్స్‌ప్లెయిన్‌ చెయ్యడానికి వచ్చాను’ అన్నాను. దానికాయన ‘వద్దండీ. వదిలెయ్యండి. మనిద్దరం రేపటి నుంచి కలిసి పనిచేస్తున్నాం’ అన్నారు. అలా ఒక్క మాటతో సమస్య పరిష్కారమైపోయింది. అసలు మా మధ్య గ్యాప్‌ రావడానికి కారణమేంటి, అసలు ఏం జరిగిందనే విషయం ఇప్పటివరకు ఆయన నన్ను అడగలేదు, నేను కూడా చెప్పలేదు. 

కృష్ణగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు. నా కెరీర్‌ ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత బాగా పాటలు పాడుతున్న సమయంలో తమ్ముడు రామకృష్ణ ఇండస్ట్రీకి వచ్చారు. మొదట నాగేశ్వరరావుగారికి పాడారు. ఆ తర్వాత రామారావుగారు, శోభన్‌బాబుగారు, కృష్ణంరాజుగారు.. ఇలా అందరూ రామకృష్ణతో పాడిస్తున్నారు. అప్పుడు నాకు అవకాశాలు బాగా తగ్గాయి. అలాంటి టైమ్‌లో కృష్ణగారు నన్ను సపోర్ట్‌ చేస్తూ ‘సంవత్సరానికి నావి నాలుగైదు సినిమాలు ఉంటాయి. అన్ని పాటలూ మీరే పాడండి’ అన్నారు. అలా నేను సింగర్‌గా ఎదగడంలో కృష్ణగారు నాకు ఎంతో హెల్ప్‌ చేశారు’ అంటూ హీరో కృష్ణతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.