English | Telugu
బాలకృష్ణతో 5 బ్లాక్‌బస్టర్స్ తీసిన నిర్మాత.. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పారు!
Updated : Oct 22, 2024
సినిమా ఇండస్ట్రీలో పాతతరం నటులు హీరోలుగా ఎదగడానికి కొన్ని నిర్మాణ సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయి. ఎన్నో సంవత్సరాల పాటు తమను హీరోలుగా నిలబెట్టిన సంస్థల్లోనే సినిమాలు చేస్తూ సంస్థకు కూడా మంచి పేరు తెచ్చారు హీరోలు. ఆ తర్వాతి తరంలో అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్న సంస్థల్లో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఒకటి. నందమూరి బాలకృష్ణతో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసి తమ సంస్థ పేరును కూడా నిలబెట్టుకున్న నిర్మాత ఎస్.గోపాలరెడ్డి. బాలకృష్ణ అంటే భార్గవ్ ఆర్ట్స్, భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ అని ప్రేక్షకులే కాదు, సినిమా వాళ్లు సైతం అనుకునేంతగా బాలకృష్ణ, గోపాలరెడ్డి మధ్య అనుబంధం పెరిగింది. అయితే నిర్మాత గోపాలరెడ్డి చివరి రోజులు ఎంత దయనీయంగా గడిచాయో, మృత్యువు ఆయన్ని ఎలా కబళించిందో తెలుసుకుంటే ఎవరికైనా బాధ కలగక మానదు. ఫైనాన్షియర్‌గా ఇండస్ట్రీకి వచ్చి టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన ఎస్.గోపాలరెడ్డి సినీ జీవితం ఎలా కొనసాగింది, ఎలా ముగిసింది అనే విషయాలు తెలుసుకుందాం.
1949లో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మించిన ఎస్.గోపాలరెడ్డి మొదట సినిమా ఫైనాన్షియర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత మిత్రులతో కలిసి చిలిపి చిన్నోడు, దాహం దాహం అనే అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేశారు. ఎవరో చేసిన సినిమాలను మనం రిలీజ్ చేయడం దేనికి, మనమే సొంతంగా సినిమా తీస్తే బాగుంటుందని భావించారు గోపాలరెడ్డి. తన కుమారుడు భార్గవ్ పేరు మీద భార్గవ్ ఆర్ట్స్ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా మనిషికోచరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ముక్కుపుడక చిత్రం చేశారు. అది కూడా సూపర్‌హిట్ అయి మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మూడో చిత్రంగా అపరాధి చిత్రాన్ని నిర్మించారు. మొదటి నుంచీ ముక్కు సూటిగా వ్యవహరించే అలవాటున్న గోపాలరెడ్డి అపరాధి సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అవుతుందని చెప్పిన డేరింగ్ ప్రొడ్యూసర్.
ఇక తన నాలుగో చిత్రాన్ని నిర్మించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు గోపాలరెడ్డి. తమిళ్‌లో భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన మన్‌వాసనై చిత్రం ఆయనకు బాగా నచ్చింది. అది బాలకృష్ణకు సరిగ్గా సరిపోతుందని భావించారు గోపాలరెడ్డి. ఆరోజుల్లో బాలకృష్ణ చేసే సినిమాల ఎంపిక అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావే చూసుకునేవారు. అప్పటికే బాలకృష్ణ నటించిన సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమి చిత్రాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయాయి. దీంతో కథల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ ఎక్కువ శ్రద్ధ పెట్టారు. బాలకృష్ణతో సినిమా చెయ్యాలనుకున్న గోపాలరెడ్డికి ఎన్టీఆర్‌ను కలిసే అవకాశం ఆయన సోదరుడు త్రివిక్రమరావు ద్వారా వచ్చింది. మన్ వాసనై కథ ఎన్టీఆర్‌కు చెప్పారు గోపాలకృష్ణ. ఆయనకు బాగా నచ్చింది. అలా మంగమ్మగారి మనవడు స్టార్ట్ అయింది. తమ బేనర్‌లో ముక్కుపుడక వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన కోడి రామకృష్ణకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. గోపాలరెడ్డి, బాలకృష్ణ ఇద్దరికీ ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ఈ సినిమా సెన్సేషనల్‌హిట్ అయి బాలకృష్ణను ఒక్కసారిగా స్టార్ హీరోను చేసేసింది.
ఆ తర్వాత బాలకృష్ణ, కోడి రామకృష్ణ, ఎస్.గోపాలరెడ్డి కాంబినేషన్‌లోనే ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య వంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. ఆ సమయంలోనే ఎస్.గోపాలరెడ్డి, కోడి రామకృష్ణల మధ్య విభేదాలు రావడంతో ఇవివి సత్యనారాయణతో మాతోపెట్టుకోకు అనే సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. దీంతో తన సంస్థ నిర్మించే సినిమాల టైటిల్స్ ‘మ’ అక్షరంతో స్టార్ట్ అయ్యేలా పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అలా రథయాత్ర, మా బాలాజీ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంతకుముందు నాగార్జునతో మురళీకృష్ణుడు, అర్జున్‌తో మాపల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు, అల్లరి పిల్ల, మధురానగరిలో వంటి సినిమాలు చేశారు. అవి సూపర్‌హిట్ అయ్యాయి. భార్గవ్ ఆర్ట్స్ బేనర్‌లో మా బాలాజీ చివరి సినిమా.
మాతోపెట్టుకోకు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ బాలకృష్ణతో ఒక సూపర్‌హిట్ సినిమా చెయ్యాలన్న పట్టుదలతో విక్రమసింహ భూపతి అనే జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాలరెడ్డి. తన కుమారుడు భార్గవ్‌ను ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం చెయ్యాలని భావించారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు నిర్మించారు. సినిమా ప్రారంభమైన రోజు నుంచి ఈ సినిమాకి అన్నీ కష్టాలే. సగానికిపైగా నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత సినిమా ఆగిపోయింది. మరో పక్క భార్య క్యాన్సర్‌తో మృతి చెందారు. దీంతో మానసికంగా, ఆర్థికంగా బాగా కుంగిపోయారు గోపాలరెడ్డి. ఆ దిగులుతోనే 2008లో ఆయన తుది శ్వాస విడిచారు. తండ్రి మరణం తర్వాత సినిమాల జోలికి వెళ్ళకుండా ఇతర వ్యాపారాలతో బిజీ అయిపోయారు భార్గవరెడ్డి. అయితే 2018లో సముద్ర తీరాన ఓ మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. అది మరెవరిదో కాదు, భార్గవరెడ్డిదే. ప్రమాదవశాత్తూ మరణించాడా లేక అది హత్యా అనే విషయం ఇప్పటివరకు మిస్టరీగానే మిగిలిపోయింది. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలతో చరిత్ర సృష్టించిన ఎస్.గోపాలరెడ్డి, అతని కుటుంబం అలా కాలగర్భంలో కలిసిపోయింది.