English | Telugu

కథానాయికల కథల్లో నాథుడు.. రంగనాథ్! ఆ సినిమాలేంటో, హీరోయిన్లెవరో తెలుసా!!

తెలుగునాట 'అండర్ రేటెడ్' నటుల జాబితాలో తప్పక వినిపించే పేరు.. రంగనాథ్. కెరీర్ ఆరంభంలో కథానాయకుడిగా పలు చిత్రాల్లో అలరిస్తూ వచ్చిన రంగనాథ్.. అదే సమయంలో సహాయనటుడిగానూ కనిపించారు. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. దర్శకుడిగానూ ఓ ప్రయత్నం చేశారు. ఇక టీవీ సీరియల్స్ లో సైతం తనదైన ముద్రవేశారు.  

గమ్మత్తు ఏమిటంటే.. రంగనాథ్ హీరోగా నటించిన తొలి చిత్రం మొదలుకుని చాలామటుకు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే కథానాయకుడిగా సందడి చేశారు. 'చందన' (1974)తో మొదలైన ఈ ప్రయాణం.. ఆపై 'జమీందారు గారి అమ్మాయి', 'అమెరికా అమ్మాయి', 'పంతులమ్మ', 'రామ చిలుక', 'అందమే ఆనందం', 'మా ఊరి దేవత',  'దేవతలారా దీవించండి', 'మదన మంజరి', 'పల్లె సీమ', 'మేనత్త కూతురు' తదితర చిత్రాల వరకు సాగింది. 'రామ చిలుక'లో అప్పటి అగ్రకథానాయిక వాణిశ్రీ జోడీగా అలరించిన రంగనాథ్.. 'జమీందారు గారి అమ్మాయి', 'ప్రియబాంధవి'లో మరో స్టార్ హీరోయిన్ శారద జంటగా కనిపించారు. అలాగే 'పల్లె సీమ'లో జయసుధ సరసన, 'పంతులమ్మ'లో లక్ష్మి జతగా, 'అందమే ఆనందం'లో జయప్రద జోడీగా, 'మదన మంజరి'లో జయమాలిని పక్కన, 'మేనత్త కూతురు'లో మాధవితో జట్టుకట్టి ఆకట్టుకున్నారు. వీటిలో సింహభాగం సినిమాలు జనరంజకమే. సో.. కథానాయికల కథల్లో నాథుడిగా రంగనాథ్ అచ్చొచ్చారనే చెప్పొచ్చు. 

(జూలై 17.. రంగనాథ్ జయంతి సందర్భంగా..)