English | Telugu

కమలహాసన్‌కి రాధికపై మూడ్ వచ్చేందుకు విశ్వ‌నాథ్ ఏం చేశారో తెలుసా!?

విశ్వ నటుడు కమలహాసన్. ఆయన కెరీర్ లో 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' ఆల్ టైం క్లాసిక్స్‌గా మిగిలి పోతాయి. భావితరాలకు కూడా కమల్ చేసిన పాత్రలు, ఆయా సినిమాలు ఓ లైబ్రరీగా చెప్పవచ్చు. ఆ సినిమాల్లో కమల్ చేసిన పాత్రలు మరో నటుడు చేయలేడు అనడం అతిశయోక్తి కాదు. చాలెంజింగ్ రోల్స్‌లో  లో కమల్ హాసన్ నటించారు అనేకంటే జీవించారని చెప్పాలి. ముఖ్యంగా 'స్వాతిముత్యం' సినిమాలో మందబుద్ధి కలిగిన యువకుడి పాత్రలో క‌మ‌ల్‌ ఒదిగిపోయి నటించారు. అప్పటికే కమర్షియల్ హీరోగా ఎదిగి స్టార్డం తెచ్చుకున్న కమల్ ఆ తరహా పాత్రలో అభిమానులను మెప్పించడం నిజంగా సాహసమే.

'స్వాతిముత్యం'లో ఆయ‌న‌ది క‌థానుసారం హీరోయిజానికి  అవకాశం లేని పాత్ర. ఈ చిత్రం చూసిన ప్రభావం అందరి పైన పడింది. ఏకంగా చిరంజీవి భారతి రాజా దర్శకత్వంలో సుహాసిని  హీరోయిన్ గా 'ఆరాధన' చిత్రం చేస్తున్న సమయంలో కమల్ 'స్వాతిముత్యం'లో ఎలా నటించాడో తాను కూడా  అలా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు అని అంటారు. ఆ సమయంలో రాధిక, "కమలహాసన్ అద్భుతంగా నటించి ఉండవచ్చు. కానీ ఆయన కంటే రజినీకాంత్ కు తమిళనాడులో క్రేజ్ ఎక్కువ. కాబట్టి ఎవర్నో అనుకరించడం మనకెందుకు? మీకున్న స్టార్డంకి తగ్గట్టుగా మీరు నటించండి" అని చిరంజీవిని ప్రోత్సహించింది అని నాడు వార్తలు వచ్చాయి.

ఇక కళాతపస్వి  కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ నుండి జాలువారిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. మ‌న దేశం తరఫున 'స్వాతిముత్యం' సినిమాను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు.  అలాగే పలు అవార్డ్స్ 'స్వాతిముత్యం' అందుకుంది. విశ్వనాథ్ కమలహాన్‌తో తీసిన ఈ  చిత్రం కమర్షియల్ గా కూడా పెద్ద హిట్. ఇక ఇందులో  కమల్ తో పోటీపడి మరీ నటించిన ఘనత రాధికకు దక్కుతుంది. లోతైన భావాలు పలికించాల్సిన పాత్రలో రాధిక పరిపక్వతతో కూడిన నటనను చూపించారు. ఈ చిత్రంలో కమల్‌కు దీటుగా రాధిక నటించాలంటే అతిశయోక్తి కాదు.

'స్వాతిముత్యం' సినిమాలో కమల్ రాధిక‌ల మధ్య 'మనసు పలికే మౌనగీతం' అనే రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌లో ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించాలి. కమల్, రాధిక సీన్స్ సరిగా చేయడం లేదు... ఇన్వాల్వ్ కావడం లేదని దర్శకుడు విశ్వనాథ్ భావించారట. రెండు టేక్స్ చేసినా  కూడా రాజీప‌డ‌ని విశ్వనాథ్.. రాధికను పిలిచి ఆమె మీద పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారట. అయితే కమల్ కి మూడ్‌ రావడం కోసం ఆ స్ప్రే తనే వేసుకున్నానని కమల్ అపార్థం చేసుకున్నారని ఇటీవల రాధిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తానికి ఈ సంఘటన చూస్తుంటే సినిమా నటీనటులు ఆయా సందర్భాలకు తగ్గట్టు ఎలా పర‌కాయ ప్రవేశం చేస్తారు? దానికి ఏ విధంగా కష్టపడతారు?.. అనే విషయం అర్థం అవుతుంది.