English | Telugu

‘DVSకర్ణ’లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన చలపతిరావు!

మన ప్రేక్షకులకు ఒకప్పుడు ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం వంటివి బాగా న‌చ్చేవి. సినిమా మొత్తం త‌మ హీరోనే క‌నిపిస్తూ ఉంటే టిక్కెట్‌కి పెట్టిన డ‌బ్బులు గిట్టుబాట‌య్యాయ‌నే భావ‌న వారిది. ఒకే సారి అన్ని పాత్ర‌ల‌లో క‌నిపించ‌డం ఆయా హీరోల అభిమానుల‌కే కాదు.. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా థ్రిల్‌ని క‌లిగించేవి. దాంతో నాటి సీనియ‌ర్ ఎన్టీఆర్ నుంచి కృష్ణ వ‌ర‌కు త్రిపాత్రాభిన‌యాలే కాదు.. మ‌రిన్ని పాత్ర‌ల‌ను ఒకే చిత్రంలో చేసి మెప్పించాల‌ని ఉబ‌లాట‌ప‌డేవారు. కానీ  చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌ల త‌రానికి వ‌చ్చే స‌రికి త్రిపాత్రాభిన‌యం కృత్రిమంగా ఫీల‌వ్వ‌డం మొద‌లైంది. దాంతో ఆ త‌రం హీరోలు త్రిపాత్రాభిన‌యాల‌ను ప‌క్క‌న పెట్టి కాస్త వైవిధ్యంగా ఉంటే ద్విపాత్రాభిన‌యాలు మాత్ర‌మే చేయ‌డం మొద‌లు పెట్టారు. కానీ నేటితరంలో మాత్రం మ‌రీ బాగుంది అనిపిస్తే త‌ప్ప డ‌బుల్ యాక్ష‌న్‌కి కూడా ఒప్పుకోవ‌డం లేదు.

 రామ్‌చ‌ర‌ణ్ ఆ మ‌ధ్య నాయ‌క్‌, ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాలు చేశారు. ఇప్ప‌టిత‌రం స్టార్లు, ప్రేక్ష‌కుల నాడి ఎలా ఉందంటే పాత్ర ఒక‌టే అయినా ఏదో విభిన్న గెట‌ప్‌ల‌కు మాత్రం స‌రే అంటున్నారు.   ఇప్పటి వారికి రాను రాను ఇవి కూడా రొటీన్ అయిపోతున్నాయి. తాజాగా వ‌చ్చిన ధ‌మాకా మూవీ మొద‌ట‌ రామ్‌చ‌ర‌ణ్ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. కానీ ఏమాత్రం కొత్త‌ద‌నం లేకుండా వాస్త‌విక‌త లోపించ‌డంతో ఆయ‌న దానికి నో చెప్పాడ‌ని స‌మాచారం.  దాంతో ఇలాంటి రొటీన్ చిత్రాలను కాకుండా  కొత్త తరహా చిత్రాలను, కొత్తదనం నిండిన పాత్రలను వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యాలు నిజ‌జీవితంలో వాస్త‌విక‌త‌కు దూరం.  నిజ జీవితంలో పెద్దగా సాధ్యం కాని పని. దాంతో అది ఊహాతీతంగా మారింది.  ఇక ఈమ‌ధ్య కాలంలో త్రిపాత్రాభినయం చేసి కాస్త మెప్పించిన ఘ‌న‌త కేవ‌లం జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ కే సాధ్య‌ప‌డింది. క‌మ‌ల్‌కి ఏదైనా సాధ్య‌మే. అలా ఆయ‌న భార‌తీయుడులో ద్విపాత్రాభిన‌యం, మైఖేల్ మ‌ద‌న కామ‌రాజులో త్రిపాత్రాభిన‌యంతో పాటు ద‌శావ‌తారం చిత్రాలు చేసి మెప్పించాడు. కానీ చిరు ఎంతో ఆశ‌తో చేసిన ముగ్గురు మొన‌గాళ్లు ఫ‌లితం అంద‌రికీ తెలిసిందే. 

ఇక  రాబోయే రామ్ చరణ్ శంకర్‌ల  చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంత‌వ‌ర‌కు ఓకే అనుకోవ‌చ్చు. అందునా శంక‌ర్ చేస్తున్నాడంటే ఆయ‌న లాజిక్‌ను మిస్స‌వ్వ‌డు అనే దృఢ‌భిప్రాయం.  ఇక విషయానికి వస్తే టాలీవుడ్ క్లాసిక్ లో ఒకటిగా చెప్పుకోదగింది దానవీరశూరకర్ణ. ఈ చిత్రంలో పలువురు ఒకటికి మించిన పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ అసమాన నటన ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమిది. ఈ చిత్రంలో ఓవైపు మన తారక రాముడు మూడు పాత్రలలో అత్యద్భుత నటన ప్రదర్శించ‌గా  మరోవైపు ఇదే చిత్రంలో ఐదు పాత్రల‌లో  నటించి నటుడు చలపతిరావు ఔరా అనిపించారు. అవి మరీ అంత పెద్ద పాత్రలు కాకపోవచ్చు. కానీ అవి సమయోచితంగా ఆకట్టుకునేవి. ఈ పౌరాణిక గాథలు సూతుడు, ఇంద్రుడు, జరాసంధుడు, ద్రుష్ట‌ద్యుమ్నుడు, విప్రుడు  పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో చలపతిరావు ఒక్కడే ఐదు  పాత్రల‌లో చేసినట్టు ఆడియన్స్ గుర్తించలేరు. ఇది చాలా గమ్మత్తైన వ్యవహారం.