English | Telugu

వినాయక్‌, ప్రభాస్‌ చేసిన పనికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన నిర్మాత.. అసలేం జరిగింది?

సినిమా రంగంలో రాణించాలంటే కేవలం టాలెంట్‌ ఒక్కటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. మరి కొందరికి ఎవరో ఒకరి చేయూత ఉంటుంది. వారు ఎదిగేందుకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంటారు. ఇప్పుడు టాప్‌ హీరోలుగా, టెక్నీషియన్స్‌గా వెలుగొందుతున్న ఎంతో మందికి అలాంటి వారి ప్రోత్సాహం ఉంది. అలా టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీసి డైరెక్టర్‌గా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు వి.వి.వినాయక్‌. అతను ఇండస్ట్రీకి రావడానికి, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వ్యక్తి ప్రముఖ నిర్మాత రాశీ మూవీస్‌ నరసింహారావు. వినాయక్‌ తండ్రి కృష్ణ ఆయనకి మంచి స్నేహితుడు. సినిమా ఇండస్ట్రీ మీద వినాయక్‌కి ఉన్న ఇంట్రెస్ట్‌ని గుర్తించిన కృష్ణ.. తన స్నేహితుడైన నరసింహారావు దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ సమయంలో అబ్బాయిగారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు నరసింహారావు. తన స్నేహితుడి మాట కాదనలేక వినాయక్‌ని ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తీసుకున్నారు. 

ఆ తర్వాత ఏం జరిగింది అనేది రాశీ మూవీస్‌ నరసింహారావు మాటల్లోనే తెలుసుకుందాం. ‘వినాయక్‌ తండ్రి కృష్ణ నాకు మంచి స్నేహితుడు. సినిమాలపై అతనికి ఇంట్రెస్ట్‌ ఉందని తెలిసి అబ్బాయిగారు సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాను. తణుకులో ఈ సినిమా షెడ్యూల్‌ జరుగుతున్నప్పుడు వచ్చి జాయిన్‌ అయ్యాడు. ఆ సమయంలో అతని వర్క్‌ చూసి ‘నువ్వు తప్పకుండా రాఘవేంద్రరావు అంత డైరెక్టర్‌వి అవుతావు’ అని చెప్పాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘ఓ సినిమా డైరెక్ట్‌ చేయబోతున్నాను.. మీ ఆశీర్వాదం కావాలి’ అంటూ వచ్చాడు. ‘నువ్వు డైరెక్ట్‌ చేస్తానంటే నా బేనర్‌లోనే చేసేవాళ్ళం కదా’ అన్నాను. రెండో సినిమా తప్పకుండా చేస్తాను అన్నాడు. వెంకటేష్‌ హీరోగా వినాయక్‌ డైరెక్షన్‌లో సినిమా ఫిక్స్‌ అయింది. దానికి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాను. అయితే ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. ‘ఆది’ సినిమాకి డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఇచ్చిన బెల్లంకొండ సురేష్‌కి మరో సినిమా చెయ్యాల్సి వస్తోంది అని చెప్పాడు వినాయక్‌. బాలకృష్ణతో సినిమా కాబట్టి తప్పకుండా చెయ్‌. మనం తర్వాత చేద్దాం అన్నాను. ఆ సినిమా రిలీజ్‌ అయింది. అంతగా ఆడలేదు. దానికి అతను బాధపడడం చూసి ‘ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. బాధ పడొద్దు. మేమంతా నీ వెనక ఉన్నాం’ అని చెప్పాను. 

చెన్నకేశవరెడ్డి తర్వాతయినా మన బేనర్‌లో సినిమా చేస్తాడేమో అనుకున్నాను. అలా జరగలేదు. అప్పుడు ‘దిల్‌’ సినిమా చేశాడు. అలా మా మధ్య గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది. ఆ సినిమా తర్వాత వెంటనే చిరంజీవిగారితో ‘ఠాగూర్‌’ ఎనౌన్స్‌ చేసేశారు. ఈ విషయం వినాయక్‌ని అడిగితే నన్ను చెయ్యమని అడుగుతున్నారు. కానీ, నాకు కుదరడం లేదు అని చెప్తూ వచ్చాడు. మరో పక్క షూటింగ్‌ పూర్తయిపోయింది. ‘వెంకటేష్‌గారితో సినిమా ఇంకా లేట్‌ అయ్యేలా ఉంది. ప్రభాస్‌ మీకు బాగా కావాల్సిన వాడే కదా. అతనితో చేద్దాం’ అన్నాడు వినాయక్‌. అప్పుడు ప్రభాస్‌ని, వినాయక్‌ని ఇంటికి భోజనానికి పిలిచాను. మేం ముగ్గురం కలిసి ఒక సినిమా చేస్తున్నామనే ఒప్పందం జరిగింది. కానీ, అది కూడా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు కొత్త జనరేషన్‌ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనా ధోరణి ఎలా ఉంది అనేది అంతు పట్టడం లేదు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అతనికి ఏదో అవసరం వచ్చి ‘సినిమాకి అడ్వాన్స్‌ ఇస్తాను అన్నారు కదా. ఇస్తారా’ అని అడిగాడు. మొదట నేను అడ్వాన్స్‌ ఇచ్చాను. ఇప్పుడు అవసరం ఉంది అని చెప్పాడు కాబట్టి అతను అడిగిన పెద్ద ఎమౌంట్‌ ఒక్కరోజులో ఎరేంజ్‌ చేశాను. ఒక్కసారిగా వినాయక్‌ షాక్‌ అయిపోయాడు. నేను అనుకున్న థియేటర్‌ కోసం మొత్తం డబ్బు మీరే ఇచ్చారు అని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. 
అతను ఇంత చేసినా నాకు అతని మీద కోపం లేదు. పైగా అతనంటే నాకెంతో ఇష్టం. నా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి నన్ను ఇలా చేయడం నాకు చాలా బాధ కలిగించింది. ఒక దశలో నేను డిప్రెషన్‌కి వెళ్లిపోయాను. నేను అతను చేసిన దాన్ని తట్టుకోలేకపోయాను. వినాయక్‌ మంచివాడే.. నేనూ మంచివాడ్నే. కానీ, పక్కన ఉన్నవాళ్ళు లేని పోనివి ఎక్కించి చెప్పడం వల్ల ఈ మిస్‌ అండర్‌స్టాండింగ్‌ వచ్చింది. 
మరో పక్క ప్రభాస్‌ కూడా సినిమా చేస్తానని చెప్పినా అతను కూడా ముందుకు రాలేదు. నాకు ఎందుకిలా జరిగింది అనేది అర్థం కావడం లేదు’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు రాశీ మూవీస్‌ నరసింహారావు.

ఇదిలా ఉంటే.. ఆ తర్వాత కొన్ని రోజులకు వి.వి.వినాయక్‌ ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ మూవీస్‌ నరసింహారావు ప్రస్తావన వచ్చింది. ఆయన తనపై చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ ‘నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనంటే నాకెంతో గౌరవం. మేం కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ, ఎందుకో అస్సలు కుదరలేదు. దానికి కారణం ఏమిటో కూడా నాకు తెలీదు. మా పక్కన ఉన్నవాళ్ళు చెప్పే మాటల వల్ల ఇద్దరి మధ్య మిస్‌ అండర్‌స్టాండిరగ్‌ వచ్చింది తప్ప మరో కారణం ఏమీ లేదు. అయితే నా వల్ల ఆయన ఎంతో బాధపడ్డారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన బాధపడినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఈ విషయంలో నేను ఆయనకి సారీ చెబుతున్నాను’ అన్నారు.