English | Telugu

ఆ పాత్ర విషయంలో ఎన్టీఆర్‌తో విభేదించిన సావిత్రి.. ఆమె బాటలోనే భానుమతి కూడా! 

ఒక మంచి పాత్ర చేసి అందరి అభిమానం పొందాలని కళాకారులందరికీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మంచి పాత్రలు వాటంతట అవే వస్తాయి. కొన్నిసార్లు ప్రయత్నం చెయ్యడం ద్వారా లభిస్తాయి. పాతతరం టాప్‌ హీరోల్లో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి ఎంతో మంది హీరోయిన్స్‌ నటించారు. వీరితో ఎక్కువ సినిమాలు చేసినవారు సావిత్రి, జమున, కృష్ణకుమారి. విజయా సంస్థలో ఈ ముగ్గురు హీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేశారు. ఇక సావిత్రి విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె 26 సినిమాల్లో నటించారు. ఆ క్రమంలోనే ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్‌తో విభేదించారు సావిత్రి. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘సత్యహరిశ్చంద్ర’ చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది విజయా సంస్థ. ఎన్టీఆర్‌ సత్యహరిశ్చంద్రుడిగా, సావిత్రి చంద్రమతిగా ఎంపికయ్యారు. మిగతా తారగణాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఆ సమయంలో సావిత్రిని ఒక వ్యక్తి కలిశారు. అతను విజయా సంస్థలోనే పనిచేస్తున్నారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలతో సావిత్రి షాక్‌ అయ్యారు. 

‘సత్య హరిశ్చంద్ర’ సినిమా చేస్తున్నారట కదా’ అని అడిగాడా వ్యక్తి.  ‘అవును.. మంచి కరుణరసం ఉన్న పాత్ర అది. తప్పకుండా నాకు మంచి పేరు వస్తుంది’ అన్నారు. ‘అలాగా.. మరి ఇంతకుముందు విజయా సంస్థ చేసిన జగదేకవీరుని కథలో మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదో ఆలోచించారా?. ఆ సినిమాలో ఆడి పాడే గ్లామర్‌ పాత్ర కోసం బి.సరోజాదేవిని తీసుకున్నారు. ఈ సినిమాలో ట్రాజెడీ పాత్ర కోసం మిమ్మల్ని సెలెక్ట్‌ చేసుకున్నారు. అంటే మీరు రొమాంటిక్‌ పాత్రలు చేయడానికి పనికి రారని తల్లి పాత్రకు ప్రమోట్‌ చేశారా?’ అన్నాడా వ్యక్తి. అప్పటివరకు దాని గురించి ఆలోచించని సావిత్రికి అతను చెప్పింది నిజమే కదా అనిపించింది. జగదేకవీరునికథ వంటి మంచి సినిమాలో తనను తప్పించి బి.సరోజాదేవికి అవకాశం ఇచ్చారు. సత్యహరిశ్చంద్ర చిత్రంలో పదేళ్ళ కుర్రాడికి తల్లిగా నటించే పాత్ర ఇస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదు అనుకున్నారు సావిత్రి. అప్పటివరకు ఎన్టీఆర్‌తో 26 సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా విషయంలో ఆయనతో విభేదించారు. కె.వి.రెడ్డిగానీ, ఎన్టీఆర్‌గానీ నమ్మలేని ఒక సాకు చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు సావిత్రి. ఎన్టీఆర్‌ ఈ విషయంలో కలగజేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, సావిత్రి ఆయన మాట వినలేదు. 

సినిమా ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో మళ్ళీ కథానాయిక వేట మొదలెట్టారు కె.వి.రెడ్డి. భానుమతి అయితే ఈ క్యారెక్టర్‌కి న్యాయం చెయ్యగలరు అని భావించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి కలిశారు. చంద్రమతి క్యారెక్టర్‌ గురించి విన్న భానుమతి సంతోషంగా చేస్తానని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే తను ఆ సినిమా చెయ్యడం లేదని కబురు పంపారు. ఈ క్యారెక్టర్‌ చేసేందుకు సావిత్రిగానీ, భానుమతిగానీ ఎందుకు ఒప్పుకోవడం లేదో కె.వి.రెడ్డికి అర్థం కాలేదు. సినిమా ప్రారంభించడానికి అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కథానాయిక విషయంలో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక భానుమతి విషయానికి వస్తే.. సావిత్రి తిరస్కరించిన పాత్ర తనను చెయ్యమంటున్నారని గ్రహించి ఆమె ఎందుకు చెయ్యనని చెప్పిందో తెలుసుకున్నారు. ఆ కారణంగానే తను కూడా ఆ సినిమా చెయ్యనని చెప్పారు. 

చివరికి ఎస్‌.వరలక్ష్మీని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు కె.వి.రెడ్డి. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, కె.వి.రెడ్డి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. వాహిని స్టూడియోలో వేసిన స్మశాన వాటిక సెట్‌లో దాదాపు 10 రోజులు షూటింగ్‌ చేశారు. ఈ పదిరోజులూ సెట్‌లో ఉన్న ఫ్యాన్లు వెయ్యనివ్వలేదు ఎన్టీఆర్‌. ఎందుకంటే చెమటలు బాగా పడితే మనిషి నీరసించిపోతాడు కాబట్టి ఆ టైమ్‌లో షాట్‌ తీస్తే సహజంగా ఉంటుందని అలా చేఖీ. షాట్‌ పూర్తి కాగానే చెమటలు తుడుచుకుంటూ బయటికి వచ్చేవారు కె.వి.రెడ్డి. కానీ, ఎన్టీఆర్‌ మాత్రం అక్కడే కూర్చొనేవారు. అలా ఓ తపస్సులా ఈ సినిమాను పూర్తి చేశారు ఎన్టీఆర్‌. 1965 ఏప్రిల్‌ 22న ‘సత్యహరిశ్చంద్ర’ విడుదలైంది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.