English | Telugu

సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదని ప్రూవ్‌ చేసుకుంటున్న పవర్‌స్టార్‌!

(సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా..)

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే యూత్‌లో ఓ విచిత్రమైన వైబ్రేషన్‌. కేవలం సినిమాలతోనే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చలించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్య పరిచే సాధనం అని భావించే పవన్‌కళ్యాణ్‌.. తన ప్రతి సినిమాలోనూ యూత్‌ని ఇన్‌స్పైర్‌ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఒక యంగ్‌ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పవర్‌స్టార్‌గా తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు పవన్‌కళ్యాణ్‌. ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్‌.. రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్‌ ఏమిటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు మహామహులు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో ఓ సాధారణ నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. తన డాన్సులతో, ఫైట్స్‌తో, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ ఎదుగుతూ మెగాస్టార్‌ స్థాయికి చేరుకున్నారు. చిరంజీవితోపాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలు వారి ఇమేజ్‌కి తగ్గట్టు సినిమాలు చేస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలోనే మెరికలాంటి కుర్రాడు టాలీవుడ్‌లో మెరిశాడు. మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.

అప్పటికే ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలో ప్రవేశించారు. నటనలోనూ, డాన్సుల్లోనూ చిరంజీవిని అనుకరిస్తూ వచ్చారు. అయితే పవన్‌కళ్యాణ్‌ మాత్రం చిరంజీవి ప్రభావం తనపై ఒక్క శాతం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. 1996లో మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తనలోని టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తను క్రియేట్‌ చేసుకున్న ప్రత్యేకమైన స్టైల్‌, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో యూత్‌ని విపరీతంగా ఆకర్షించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఐదు వరస సూపర్‌హిట్స్‌తో స్టార్‌ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్నారు.

2001 పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌కి ఎంతో కీలకమైన సంవత్సరంగా మారింది. తమిళ్‌లో విజయ్‌ హీరోగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఖుషి ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలంటే ఎ.ఎం.రత్నంకి కనిపించిన ఏకైక ఆప్షన్‌ పవన్‌కళ్యాణ్‌. ఆ సినిమా పవన్‌కి కూడా విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారు. తమిళ్‌ హీరో విజయ్‌ పోకడలు తెలుగు వెర్షన్‌లో ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పవన్‌. 2001 ఏప్రిల్‌ 27న విడుదలైన ఖుషి.. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. అప్పటివరకు చేసిన సూపర్‌హిట్‌ సినిమాలు ఒక ఎత్తయితే.. ఖుషి చిత్రం పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌కి ఓ మైల్‌స్టోన్‌లా నిలిచింది.

‘ఖుషి’ చిత్రం విడుదలైన రెండు సంవత్సరాల వరకు పవన్‌ మరో సినిమా చెయ్యలేదు. తన దర్శకత్వంలోనే రూపొందించిన జాని చిత్రం కోసం చాలా గ్యాప్‌ తీసుకున్నారు పవన్‌. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ప్రభావం.. పవన్‌ చేసిన తర్వాతి సినిమాలపై పడిరది. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వగా, మరికొన్ని ఏవరేజ్‌గా నిలిచాయి. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన జల్సా చిత్రంతో తన పూర్వవైభవాన్ని సాధించారు పవన్‌. ఈ సినిమా తర్వాత కూడా మరికొన్ని ఫ్లాప్‌లు అతన్ని వెంటాడాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేసిన గబ్బర్‌సింగ్‌ ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి, పవన్‌లోని కొత్తకోణాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాతి సంవత్సరం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన అత్తారింటికి దారేది పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి హరిహరవీరమల్లు, ఓజి, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు కమిట్‌ అయి ఉన్నారు. ఇటీవల హరిహర వీరమల్లు చిత్రం విడుదలై ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించింది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఓజీ సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్‌ సెప్టెంబర్‌ 6 నుంచి జరగనుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనే విషయంలో ఇప్పటివరకు మేకర్స్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం పదవీ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించేందుకు కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు పవన్‌కళ్యాణ్‌.