English | Telugu
'శంకరాభరణం'కు మరో గాయకుడ్ని చూసుకోమన్న బాలు!
Updated : Jun 3, 2021
'శంకరాభరణం'.. తెలుగు సినిమానీ, తెలుగు సినిమా సంగీతాన్నీ దేశవ్యాప్తం.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రరాజం. ఏమాత్రం పరిచయం లేని జె.వి. సోమయాజులు అనే నటుడ్ని రాత్రికి రాత్రే గొప్పనటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిని చేసిన గొప్ప కళాఖండం. దర్శకుడిగా కె. విశ్వనాథ్‌నూ, సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్‌నూ శిఖరాగ్రస్థాయికి చేర్చిన 'శంకరాభరణం'లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ప్రతి గీతం సమ్మోహనకరం. అయితే మొదట ఆ పాటలను తాను పాడననీ, మరో గాయకుడ్ని చూసుకొమ్మనమనీ డైరెక్టర్ విశ్వనాథ్‌కు బాలు చెప్పారనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? జూన్ 4 బాలు 75వ జయంతి సందర్భంగా ఆ విషయాలను ఓసారి చెప్పుకుందాం...
శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా మహదేవన్, పుగళేంది లాంటి విద్వత్ సంపన్నుల దగ్గర దానిని సాధించి, పాడి మెప్పించిన సాధకుడు బాలు. 'శంకరాభరణం'తో ఆయన చేత ఆ సాధనను వారు చేయించి వుండకపోతే బాలు మహోన్నత స్థాయికి ఎదిగి వుండేవారు కాదేమో! 'శంకరాభరణం'కు మహదేవన్-పుగళేంది బాణీలు కట్టడం పూర్తయింది. భద్రాచల రామదాసు, త్యాగరాజు, మహాకవి కాళిదాసు, మైసూర్ వాసుదేవాచార్యులు, సదాశివబ్రహ్మం కీర్తనలు, పద్యాలు మినహా చిత్రంలోని నాలుగు పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రాయడమూ పూర్తయింది. వాటిని పాడేందుకు బాలుకు కబురుపెట్టారు విశ్వనాథ్.
ఆ కీర్తనలు, పాటల ట్యూన్లు విని, "నావల్ల కాదు అన్నయ్యా.. ఎవరైనా మంచి గాయకుడ్ని చూసుకోండి." అని విశ్వనాథ్‌కు చెప్పారు బాలు. విశ్వనాథ్, మహదేవన్ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. విశ్వనాథ్ "నువ్వు పాడగలవురా" అని భరోసా ఇవ్వాలని చూశారు. అయినా బాలులో సంకోచం. అవి గొప్ప పాటలుగా చరిత్రలో నిలబడే పాటలని ఆయనకు తెలుసు. కానీ వాటికి తాను న్యాయం చేయగలనా.. అనే సందేహం. అందుకే పాడలేనని వెళ్లిపోయారు. అప్పుడు పుగళేంది, "వాడు హనుమంతుని లాంటివాడు. వాడి ప్రతిభ వాడికి తెలీదు. ఈ పాటలు వాడు పాడతాడు. నేను పాడిస్తాను." అని విశ్వనాథ్, మహదేవన్‌లకు హామీ ఇచ్చారు.
వెంటనే బాలును కలిశారు. ఆయనలో ఆత్మస్థైర్యం నింపారు. చరిత్రలో నిలిచిపోతావని చెప్పారు. అంతకుముందు "ఆరేసుకోబోయి పారేసుకున్నాను", "ఆకుచాటు పిందె తడిసె" తరహా పాటలు పాడివచ్చిన బాలు నోరు పుక్కిళించుకున్నారు. తులసి ఆకులు నమిలారు. వేటూరి రాసిన గీతం "దొరకునా ఇటువంటి సేవ"ను పాడటం మొదలుపెట్టారు. అంతే.. ఒక్క వాణీ జయరామ్ సోలో సాంగ్ మినహా మిగతా అన్ని పాటలూ, కీర్తనలను బాలు పాడేశారు.
సినిమా విడుదలైంది. ఆ పాటలు విని ముందుగా ఎవరూ "ఓహో.." అనలేదు. కానీ ఇంటికి వెళ్తూ "శంకరా నాద శరీరాపరా.." అంటూ పాడుకోవడం మొదలుపెట్టారు. ఆ పాట ఆయనకు ఆ ఏడాది ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డును అందించింది. 'శంకరాభరణం' పాటలు చరిత్ర సృష్టించాయి, చరిత్రలో నిలిచాయి.