English | Telugu
బాలు మీద కోపంతో రాజ్ సీతారామ్‌ను ఎంకరేజ్ చేసిన కృష్ణ!
Updated : Jun 3, 2021
సినిమాల్లో తెరమీద కృష్ణ ఆడిపాడుతుంటే, తెరవెనుక ఎస్పీ బాలు గాత్రమే వినిపించాలి. కృష్ణ హీరోగా పరిచయమైన కొద్ది కాలానికే బాలు కూడా గాయకునిగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఘంటసాల గాత్రమిస్తుంటే కృష్ణ, శోభన్‌బాబు లాంటివారికి బాలు గాత్రం సరిగ్గా సరిపోయిందన్నారు. మరీ ముఖ్యంగా కృష్ణ గొంతుకు బాలు గొంతు పర్ఫెక్టుగా సూటయ్యిందనేది నిజం. అలాంటిది.. 'సూర్యచంద్ర' చిత్రంలో తెరమీద కృష్ణ ఆడుతుంటే, తెరవెనుక వినిపిస్తున్న గొంతు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. 'ఎవరిదీ గొంతు? బాలుది కాదే.. ఈ కొత్త గొంతు ఎవరిది?' అనుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారుతూ 70 ఎంఎంలో కృష్ణ రూపొందించిన తొలి చిత్రం 'సింహాసనం'లోనూ అదే గొంతు. "ఆకాసంలో ఒక తార", "వహవా నీ యవ్వనం", "ఇది కలయని నేననుకోనా" లాంటి పాటలు వింటుంటే అచ్చు.. కృష్ణే ఆ పాటలు పాడుతున్నారా అనిపించింది. ఆ గొంతు బాలుది కాదు.. రాజ్ సీతారామ్ అనే ఓ యువకుడిది.
అందరూ హీరోలకూ పాడేస్తూ బాలు మంచి ఊపులో ఉన్న టైమ్‌లో కృష్ణతో ఆయనకు మనస్పర్ధలు వచ్చాయి. ఎంత సాహసికుడో అంత అభిమానవంతుడు కూడా అయిన కృష్ణ ఎలాంటి అడుగు వేయడానికైనా సంకోచించరు. అప్పటికే నరేశ్ హీరోగా నటించిన 'అగ్ని సమాధి'తో తెలుగుచిత్రసీమకు గాయకుడిగా పరిచయమయ్యాడు తమిళుడైన రాజ్ సీతారామ్. ఆయన ఎస్పీ బాలు బృందంలోనివాడే. ఆయనతో కలిసి ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొన్నాడు కూడా. బాలుకు, కృష్ణకు మధ్య విభేదాలు రావడంతో 'సూర్యచంద్ర' (1985) చిత్రంలోని పాటల్ని రాజ్ సీతారామ్ చేత పాడించారు డైరెక్టర్ విజయనిర్మల. మొదట ఆ పాటల్ని రాజ్ పాడినట్లు కృష్ణకు తెలీదు. ఆ పాటల్ని కృష్ణకు వినిపించి ఎలా ఉన్నాయని అడిగారు విజయనిర్మల. బాగున్నాయని ఆయన అన్న తర్వాతే రాజ్ సీతారామ్‌ను కృష్ణకు ఆమె పరిచయం చేశారు.
అలా 'సూర్యచంద్ర' సినిమాతో కృష్ణకు పాడటం ప్రారంభించారు రాజ్. బాలుకు, తనకు మధ్య మనస్పర్ధలు తొలగిపోయి, సయోధ్య కుదిరేంతవరకూ ఆయన చేతే తన పాటలన్నీ పాడించారు కృష్ణ. ఆయన పెద్ద కుమారుడు రమేశ్‌బాబు హీరోగా పరిచయమైన 'సామ్రాట్' సినిమాలోనూ పాటల్ని రాజ్‌తోనే ఆయన పాడించారు. కృష్ణ అంటే బాలు, బాలు అంటే కృష్ణ అన్నంతగా పేరుపొందడంతో మొదట్లో అభిమానులకు రాజ్ గొంతు కొత్తగా అనిపించినా, తర్వాత ఆ గొంతు కృష్ణకు సరిగ్గా సరిపోయిందని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ కూడా ఒప్పేసుకుంది. అలా మూడేళ్ల పాటు కృష్ణకు రాజ్ సీతారామ్ పాడారు. ఆ తర్వాత తిరిగి కృష్ణకు బాలు చేరువయ్యారు. దాంతో 'రౌడీ నెంబర్ 1' (1988) సినిమా నుంచి బాలుతోనే మళ్లీ పాటలు పాడించుకుంటూ వచ్చారు కృష్ణ. మిగతా హీరోలెవరూ ఎంకరేజ్ చేయకపోవడంతో గాయకుడిగా రాజ్ సీతారామ్ క్రమేపీ కనుమరుగయ్యారు.