English | Telugu

ఎన్టీఆర్ Vs కృష్ణ.. జయప్రదకి మాత్రం డబుల్ ధమాకా.. 45 ఏళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమాలేంటో తెలుసా!

నటరత్న నందమూరి తారక రామారావు అంటే నటశేఖర కృష్ణకి ఎంతో అభిమానం. ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో అలరించారు కూడా.  అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్టీఆర్ కి పోటిగా కృష్ణ నటించిన చిత్రాలు విడుదలైన వైనాలు ఉన్నాయి. 1977 సంక్రాంతికి అంటే జనవరి 14న రామారావు త్రిపాత్రాభినయం చేసి దర్శకత్వం వహించిన 'దానవీరశూరకర్ణ' విడుదల కాగా.. సరిగ్గా అదే రోజున కృష్ణ నటించిన 'కురుక్షేత్రం' రిలీజైంది. వీటిలో 'దానవీరశూరకర్ణ' అఖండ విజయం సాధించింది. కట్ చేస్తే.. 1978లో అంటే ఏడాది తరువాత ఇదే 14వ తేదిని టార్గెట్ చేసుకుని జూలై నెలలో ఈ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. ఆ చిత్రాలే.. 'యుగపురుషుడు', 'దొంగల వేట'. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అందాల తార జయప్రద నాయికగా అలరించారు. 

'ఎదురులేని మనిషి' (1975) వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ - కె. బాపయ్య - వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి. అశ్వనీదత్ - కేవీ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'యుగపురుషుడు'. 'ఎదురులేని మనిషి'లా 'యుగపురుషుడు' బాక్సాఫీస్ ని షేక్ చేయకపోయినా.. హిట్ మూవీగా నిలిచింది. 'ఎదురులేని మనిషి'లో వాణిశ్రీ నాయికగా నటిస్తే.. 'యుగపురుషుడు'లో జయప్రద ఎంటర్టైన్ చేసింది. ఇక కృష్ణ, జయప్రద కాంబినేషన్ లో వచ్చిన 'దొంగల వేట'ని ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్ తెరకెక్కించారు. కృష్ణ, కె.ఎస్.ఆర్. దాస్ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా 'దొంగల వేట' కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ సినిమాకి సత్యం స్వరాలు సమకూర్చారు.  ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'యుగపురుషుడు' తెలుగులో విజయం సాధించాక హిందీలో 'మర్ద్ కి జబాన్' పేరుతో రీమేక్ అయితే.. 'దొంగల వేట' మాత్రం హిందీ చిత్రం 'ఇన్ కార్' ఆధారంగా తెరకెక్కింది. కాగా, 1978 జూలై 14న జనం ముందు నిలిచిన ఎన్టీఆర్ 'యుగపురుషుడు', కృష్ణ 'దొంగల వేట' చిత్రాలు.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకున్నాయి.