English | Telugu
బర్త్ డే స్పెషల్: టాప్ స్టార్స్ తో రవిరాజా పినిశెట్టి బ్లాక్ బస్టర్స్.. ఏంటో తెలుసా!
Updated : Jul 14, 2023
రవిరాజా పినిశెట్టి.. ఇప్పటి ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియకపోయినా 80, 90 దశకాల్లో ఓ సంచలనం. రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రవిరాజా.. దాదాపు టాప్ స్టార్స్ అందరితోనూ ఘనవిజయాలు చూశారు. వాటిలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండడం విశేషం. కథానాయకుల వారీగా ఆ ఘనవిజయాల వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి: రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో చిరంజీవి మంచి విజయాలు చూశారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 'యముడికి మొగుడు'. 1988 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక చిరు తొలి హిందీ చిత్రం 'ప్రతిబంధ్' (1990), మలి బాలీవుడ్ వెంచర్ 'ఆజ్ కా గూండారాజ్' (1992) కూడా మంచి సక్సెస్ అయ్యాయి.
నటసింహం బాలకృష్ణ: ఈ నందమూరి అందగాడితో రవిరాజా తీసిన 'బంగారు బుల్లోడు' (1993) అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని భలేగా ఎట్రాక్ట్ చేసింది. బాలయ్య బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా 'బంగారు బుల్లోడు' నిలిచింది.
విక్టరీ వెంకటేశ్: ఈ దగ్గుబాటి వారి హ్యాండ్సమ్ హీరోతో రవిరాజా చేసిన తొలి చిత్రం 'చంటి' (1992) అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆపై వచ్చిన 'కొండపల్లి రాజా' (1993) కూడా వసూళ్ళ వర్షం కురిపించింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు: రవిరాజా పినిశెట్టి - మోహన్ బాబు కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చినా.. గుర్తుండిపోయే మూవీ అంటే మాత్రం ఒకటే. ఆ చిత్రమే.. 'పెదరాయుడు' . 1995లో రిలీజైన ఈ రీమేక్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో అలరించారు.
యాంగ్రీ హీరో రాజశేఖర్: రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో రాజశేఖర్ మంచి విజయాలు చూశారు. నటభూషణ్ శోభన్ బాబుతో కలిసి రాజశేఖర్ నటించిన మల్టిస్టారర్ 'బలరామకృష్ణులు' (1992)తో పాటు తను ద్విపాత్రాభినయం చేసిన 'మా అన్నయ్య' (2000) కూడా విజయపథంలో పయనించింది.
నటకిరీటి రాజేంద్రప్రసాద్: రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో 'ముత్యమంత ముద్దు' (1989) మంచి విజయం సాధించింది. యండమూరి నవల 'థ్రిల్లర్' ఆధారంగా ఈ సినిమా రూపొందింది.