English | Telugu
బాలు పాడిన శ్రీకృష్ణ రాయబారం పద్యాల్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్!
Updated : Jun 4, 2021
దక్షిణ భారత సినీ చరిత్రలో అత్యధిక నిడివి కలిగిన చిత్రం.. నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించి, దర్శకత్వం వహించిన 'దానవీరశూర కర్ణ'. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయిన ఈ మూవీ నిడివి 4 గంటల 7 నిమిషాలు. దేశం మొత్తం చూసుకుంటే నిడివి పరంగా ఈ సినిమాది రెండో స్థానం. రాజ్ కపూర్ సినిమా 'మేరా నామ్ జోకర్' 4 గంటల 24 నిమిషాల నిడివితో ప్రథమ స్థానం వహిస్తుంది. 'దానవీరశూర కర్ణ'లో మొత్తం 35 పద్యాలు, 10 పాటలు ఉన్నాయి. మొదట సాలూరి రాజేశ్వరరావు, తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పనిచేశారు. టైటిల్స్‌లో పెండ్యాల గారి ఒక్క పేరే కనిపిస్తుంది. "ఏ తల్లి నిను కన్నదో.. నేను నీ తల్లినయినానురా" పాటకు బాణీలు కట్టి, రికార్డ్ చేసింది సాలూరివారు.
ఈ సినిమాలో దుర్యోధనుడిపై చిత్రీకరించిన డ్యూయెట్ ఎంత ఫేమస్సో మనకు తెలుసు. దుర్యోధనుడు, భానుమతి పాత్రధారులైన ఎన్టీఆర్, ప్రభలపై ఆ పాటను చిత్రీకరించారు. "చిత్రం భళారే విచిత్రం" అంటూ సాగే పాటను సి. నారాయణరెడ్డి రాయగా, సుశీల, బాలు పాడారు. ఎన్టీఆరే ఆ పాటను స్వయంగా ఆలపించారా అన్నంతగా ఆయన గొంతులాగా అనిపించేలా బాలు ఆలపించారు.
తిరుపతి వేంకటకవుల రాయబార పద్యాలు నాటక ప్రియుల్లో బాగా పాపులర్. వాటి హక్కుల్ని 'శ్రీ కృష్ణావతారం' తీసే సమయంలోనే కొన్నారు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. వాటిని ముందుగా ఎస్పీ బాలు చేతనే పాడించారు. కానీ ఎందుకనో ఎన్టీఆర్‌కు నచ్చలేదు. తర్వాత పీసపాటి రఘురామయ్యతో పాడించారు. అవీ నచ్చలేదు. దాంతో ఘంటసాల ఆలపించిన 'శ్రీకృష్ణ తులాభారం' పద్యాల్నే ఉపయోగించుకోవాలని ఆయన భావించారు. అప్పుడు రామకృష్ణ పేరు సూచించారు సాలూరి రాజేశ్వరరావు. సరేనని రామకృష్ణను పిలిపించి, ఆయన చేత రాయబారం పద్యాల్ని పాడించారు. రామకృష్ణ కంఠంలో ఆ పద్యాలు ఎన్టీఆర్‌కు బాగా నచ్చాయి. దాని తర్వాత రామకృష్ణతోటే భగవద్గీతను పాడించారు. 'దానవీరశూర కర్ణ చిత్రం'తో రామకృష్ణ ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు.