English | Telugu
బాలు ఆర్కెస్ట్రాలో హార్మోనిస్టుగా పనిచేసిన ఇళయరాజా!
Updated : Jun 4, 2021
డైరెక్టర్ భారతీరాజా మొదట్నుంచీ ఎస్పీ బాలుకు ఫ్రెండ్. ఆయన ద్వారా ఇళయరాజా, ఆయన ముగ్గురు అన్నదమ్ములు బాలును కలిశారు. "కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు మీ ఆర్కెస్ట్రాలో అవకాశం ఇవ్వు" అని భారతీరాజా చెప్పారు. సరేనని బాలు కలవమనడంతో ఇళయరాజా బ్రదర్స్ కలిశారు. హార్మోనియం వాయించమని బాలు చెబితే, రెండు చేతులతో చాలా ఒడుపుగా వాయించారు ఇళయరాజా. ఆశ్చర్యపడి, "ఎక్కడ నేర్చుకున్నావు?" అనడిగారు బాలు. "విని నేర్చుకున్నా" అనేది రాజా సమాధానం.
"సంగీతం నేర్చుకోకుండా ఎలా వాయిస్తావు?" అని మళ్లీ ప్రశ్నించారు బాలు. "విని నేర్చుకుంటా" అని మళ్లీ చెప్పారు రాజా. అలా బాలు ఆర్కెస్ట్రాలో గిటారిస్ట్‌గా జాయినయ్యారు రాజా. కొంత కాలం తర్వాత అంతదాకా బాలు దగ్గర హార్మోనిస్టుగా ఉన్న అనిరుద్ర మానేయడంతో, హార్మోనిస్టుగా రాజాకు ప్రమోషన్ ఇచ్చారు బాలు.
ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక, తమిళ, తెలుగు భాషల్లో పాటల్ని ఎక్కువగా బాలుతోనే పాడించారు. నిజానికి బాలుతో రాజా పాడించినన్ని పాటలు మరే మ్యూజిక్ డైరెక్టర్ పాడించలేదనడం అతిశయోక్తి కాదు. మణిరత్నం రూపొందించిన 'దళపతి' చిత్రం కోసం "సుందరీ నీవే నేనంట.." పాటను ముంబైలో 126 మంది మ్యూజీషియన్స్‌తో రికార్డ్ చేయించారు రాజా. ఆ పాటను బాలు, జానకి పాడారు. ఆ పాట రికార్డింగ్ చూసేందుకు ఎంతోమంది తరలి వచ్చారు.
బాలు పరమపదించేంత వరకూ ఇళయరాజాతో ఆయన స్నేహం, ఆత్మీయ బంధం అపూర్వంగా కొనసాగుతూ వచ్చింది. కొంత కాలం క్రితం పాట కాపీరైట్ విషయంలో ఇద్దరి మధ్యా చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చినా, త్వరగానే అవి సమసిపోయాయి. కరోనా సోకి బాలు వెంటిలేటర్ మీదకు వెళ్లినప్పుడు ఇళయరాజా ఎంత భావోద్వేగానికి గురయ్యారో.. బాలు కోలుకుని తిరిగి రావాలని ఎంతగా ఆకాంక్షించారో!.. కానీ అవి ఫలించలేదు. బాలు ఇకలేరనే వార్త తెలియగానే రాజా దుఃఖానికి అంతులేకుండా పోయింది.