English | Telugu
టాలీవుడ్‌లో ఆ క్వాలిటీస్ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్!
Updated : May 19, 2024
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో నవరసాలూ పలికించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున చెప్పే పేరు ఎన్టీఆర్. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను తన నటనలో ఎంతో ఈజీగా చూపించగల నటుడు ఎన్టీఆర్. ఏ షాట్ అయినా డైరెక్టర్‌కి కావాల్సిన విధంగా సింగిల్ టేక్‌లో చేసి ఓకే చెప్పించుకునే హీరో ఎన్టీఆర్. ‘నిన్ను చూడాలని’ చిత్రం నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, మాస్ యాక్షన్‌తో కూడిన సినిమాలు చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ చిత్రం చేస్తున్నారు. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం నందమూరి తారక రామారావుగా పిలవబడుతున్న ఎన్టీఆర్ అసలు పేరు తారక్‌రామ్. నందమూరి హరికృష్ణ తన కుమారులకు జానకిరామ్, కళ్యాణ్‌రామ్, తారక్‌రామ్ అనే పేర్లు పెట్టారు. చిన్నతనంలో తన పోలికలతోనే ఉన్న తారక్‌ని చూసిన సీనియర్ ఎన్.టి.ఆర్. అతనికి తన పేరు పెట్టమని హరికృష్ణకు చెప్పారు. అలా తారక్‌రామ్ కాస్తా నందమూరి తారక రామారావు అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను మొట్టమొదటిసారి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎన్.టి.రామారావు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో హిందీ చిత్ర సీమకు పరిచయం చేశారాయన. ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు గుణశేఖర్. ‘బాల రామాయణం’ చిత్రంలో ఎన్టీఆర్ బాలరాముడిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు, ఎన్టీఆర్‌కు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు కూడా లభించింది.
డైరెక్టర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎస్.ఎస్.రాజమౌళి.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్ ‘ఆది’ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. మెహర్ రమేష్‌ను ‘కంత్రి’ చిత్రంతో తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం చేశారు ఎన్టీఆర్. అలాగే వక్కంతం వంశీ, కొరటాల శివ కూడా ఎన్టీఆర్ సినిమాల ద్వారానే రచయితలుగా పరిచయమయ్యారు.
ఎన్టీఆర్ ఇప్పటివరకు 29 సినిమాల్లో నటించారు. కానీ, ఏ ఒక్క సినిమాలోనూ ఎన్టీఆర్ లుక్‌గానీ, గెటప్‌గానీ ఒకేలా ఉండవు. ప్రతి సినిమాకీ గెటప్ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలందరూ గడ్డాలతో కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్‌ని స్టార్ట్ చేసింది ఎన్టీఆరే. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో గడ్డంతో ఒక కొత్త గెటప్‌లో కొన్ని సంవత్సరాల క్రితమే కనిపించారు ఎన్టీఆర్.
ఓవర్సీస్‌లో వరసగా నాలుగు సినిమాలతో 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన మొదటి సౌత్ ఇండియన్ హీరో ఎన్టీఆర్. అలాగే ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో వరసగా ఐదు సూపర్‌హిట్ సినిమాలు ఇచ్చిన హీరో కూడా ఎన్టీఆర్ ఒక్కరే. ఇప్పుడు ఉన్న హీరోల్లో పౌరాణిక పాత్ర పోషించే కెపాసిటీ ఉన్న హీరో కూడా ఎన్టీఆర్ ఒక్కరే. చిన్నతనంలో బాల రామాయణంలో శ్రీరాముడిగా, ఆ తర్వాత యమదొంగ చిత్రంలో యముడి పాత్రను అద్భుతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగులు చెప్పగలడు. కానీ, కామెడీ పండిరచలేడు అనే విమర్శలకు ‘అదుర్స్’తో చక్కని సమాధానం ఇచ్చారు. ఆ చిత్రంలోని చారి పాత్రను అత్యద్భుతంగా పోషించి ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఇమిడిపోగలనని ప్రూవ్ చేసుకున్నారు ఎన్టీఆర్. పాజిటివ్ క్యారెక్టర్సే కాదు, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా అవలీలగా చెయ్యగలనని టెంపర్‌లోని దయా క్యారెక్టర్‌తో ప్రూవ్ చేశారు. అలాగే ‘జై లవకుశ’ చిత్రంలో పూర్తి స్థాయిలో నెగెటివ్ క్యారెక్టర్‌తో మెప్పించారు.
నటుడిగానే కాదు, సింగర్‌గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు ఎన్టీఆర్. ఓలమ్మీ తిక్కరేగిందా, 123 నేనొక కంత్రి, చారి, రాకాసి రాకాసి, ఫాలో ఫాలో వంటి సూపర్‌హిట్ సాంగ్స్ పాడి తనలోని గాయకుడ్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తను హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలోని ‘గెలెయా గెలెయా..’ అనే పాటను ఎన్టీఆర్‌తో పాడించుకున్నారు.
ఏ హీరో అయినా తనకు కథ నచ్చకపోతే కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఆర్య, బొమ్మరిల్లు, భద్ర. మొదట ఈ ప్రాజెక్టులు ఎన్టీఆర్ దగ్గరకే వచ్చాయి. ఇతర హీరోలు నటించిన ఆ సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య వంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
టాలీవుడ్‌లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది ‘వార్2’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కెజిఎఫ్ సిరీస్, సలార్ వంటి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఇలా సినిమా సినిమాకీ హీరోగా తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.