English | Telugu

గుమ్మడికి గుండెపోటు వచ్చింది.. థియేటర్‌లో నవ్వులే నవ్వులు!

ఏ నటుడికైనా అన్ని రకాల పాత్రలు పోషించాలి అనే కోరిక ఉంటుంది. అలా నవరసాలూ పోషించే అవకాశం కొందరికే దక్కుతుంది. సాత్విక పాత్రలైనా, హాస్య పాత్రలైనా, విలన్‌ పాత్రలైనా.. ఇలా ఏ రకమైన పాత్రలోనైనా జీవించే అవకాశం వస్తుంది. ప్రేక్షకులు కూడా వారు ఏ క్యారెక్టర్‌ చేసినా ఆదరిస్తారు. కానీ, కొందరి విషయంలో అలా జరగదు. ఒక సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు వస్తే.. ఆ తర్వాత సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్సే చెయ్యాల్సి వస్తుంది. కళాకారులకు ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇదే ఇబ్బంది పాత తరం నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుకు అనే సందర్భాల్లో ఎదురైంది. ఈ విషయాన్ని ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 

‘నేను అదృష్టదీపుడు అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో అలాంటి పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలు పోషించే అవకాశం నాకు రాదు అని గట్టిగా నిర్ణయించుకొని ఊరికి వెళ్లిపోదామనుకుంటున్న తరుణంలో ఎన్‌.టి.రామారావుగారితో పరిచయం ఏర్పడింది. ఆయన ననెంతో ఆదరించారు. ఆ సమయంలోనే ఆయన నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ అనే బేనర్‌ స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో నాకు ప్రధాన పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సినిమాలో రామారావుగారి కంటే పెద్దవాడిగా నటించాను. ఈ సినిమా చూసిన డైరెక్టర్‌ పుల్లయ్యగారు ఆయన చేస్తున్న ‘అర్థాంగి’ సినిమాలో జమిందారు క్యారెక్టర్‌ ఇచ్చారు. అప్పటికి నా వయసు 27 సంవత్సరాలే. అందులో నా రెండో భార్యగా నటించిన శాంతకుమారిగారు నాకన్నా పది సంవత్సరాలు పెద్దవారు. ఈ సినిమాలో నాకు కొడుకులుగా నాగేశ్వరరావుగారు, జగ్గయ్యగారు నటించారు. వాళ్ళిద్దరూ నా కంటే పెద్దవారే. అలా చిన్న వయసులోనే పెద్ద వయసు క్యారెక్టర్లు చెయ్యాల్సి వచ్చింది. ఆ తర్వాత అవే వేషాలు రావడం మొదలైంది. అలా ఎన్నో సినిమాల్లో వృద్ధుడిగా నటించాను. ప్రతి సినిమాలోనూ తండ్రి, తాత, పెదనాన్న, బాబాయ్‌, మావయ్య.. ఇలా అన్నీ నా వయసుకు మించిన పాత్రలే చేశాను. 

అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. ‘గుండెపోటు’. ఒక దశలో ఈ మాట వింటేనే భయపడేవాడ్ని. ఏ ఆర్టిస్టుకైనా ఇది ఒక శాపమే. ఒకే తరహా పాత్రలు వరసగా రావడం కొంత బాధ కలిగించే విషయమే. నేను గుండె పట్టుకుంటే థియేటర్‌లో జనం నవ్వుకునే స్థాయికి వచ్చేశారు. అప్పటి నుంచి ఏ సినిమా అవకాశం వచ్చినా ‘నేను మధ్యలోనే చనిపోతానా.. లేక చివరి వరకు ఉంటానా’ అని అడిగి మరీ ఒప్పుకునేవాడిని. ఒకసారి ఒక సినిమాలో నా వేషం గురించి చెబుతూ గుండెపోటుతో మీరు చనిపోతారు అని చెప్పారు. అప్పుడు ‘చచ్చిన చావు చావకుండా చచ్చేన్ని చావులు చచ్చాను. ఇక ఈ చావు నేను చావలేను. నన్ను చంపకండి’ అంటూ నామీద నేనే జోక్‌ వేసుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్లు చేసి చేసి నాకే విసుగొచ్చేసింది. ఇక జనం మాత్రం ఎంత కాలం భరిస్తారు’ అంటూ సరదాగా చెప్పారు గుమ్మడి వెంకటేశ్వరరావు.