English | Telugu
ముఖంపై రక్తం కారుతుంటే, మిరపకాయలు నమిలిన ఎన్టీఆర్!
Updated : Jun 28, 2021
తెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ హీరోగా పేరు పొందారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు. పనినే దైవంగా భావించే అతికొద్ది మంది నటుల్లో ఆయన అందరికంటే ముందుంటారు. షూటింగ్ సమయంలో దెబ్బలు తగిలినా, లెక్కచెయ్యకుండా తన సీన్లు పూర్తి చేయడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు అనేకం. అలాంటి వాటిలో 'ఎదురీత' (1977) సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ఘటనను ప్రముఖంగా చెప్పాలి.
బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ నటించిన ద్విభాషా చిత్రం (హిందీ, బెంగాలీ) 'అమానుష్' ఆధారంగా 'ఎదురీత'ను నిర్మించారు. వి. మధుసూదనరావు దీనికి దర్శకుడు. ఎన్టీఆర్ సరసన నాయికగా వాణిశ్రీ నటించగా, విలన్ ప్రెసిడెంట్ భూషయ్య పాత్రను కైకాల సత్యనారాయణ చేశారు. జయసుధ ఓ కీలక పాత్ర పోషించారు.
ఆ సినిమాకు వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడమే కాకుండా, నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు. ఆ సినిమా షూటింగ్‌ను ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో నిర్వహించారు. అందులో భాగంగా యానాంలో సముద్రంపై ఎన్టీఆర్, సత్యనారాయణపై ఓ ఫైట్ సీన్ తీస్తున్నారు. చిన్న షిప్స్ ట్రాలర్స్‌పై ఓవైపు ఆర్టిస్టులు ప్రయాణిస్తుంటే, ఇంకోవైపు కెమెరా బృందం ప్రయాణిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ ఐరన్ రాడ్ ఎన్టీఆర్ ముఖానికి తగిలి, రక్తం కారడం మొదలుపెట్టింది. అందరూ కంగారు పడి, ఒడ్డుకు చేరుకున్నారు.
ఆ టైమ్‌లో ఎవరో అక్కడ ఇసుక తిన్నెలపై మిరపకాయలు ఆరబెట్టారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా, కొన్ని మిరపకాయలు తీసుకొన్న ఎన్టీఆర్.. వాటిని నోటిలో వేసుకొని కసకసా నమిలేశారు. ఇనుప చువ్వ గీచుకున్న మంటకు, మిరపకాయల మంట జతకలిస్తే, నొప్పి మాయం అయ్యిందన్న మాట. ఆ వెంటనే ఆయన, "పదండి.. షూటింగ్ చేద్దాం" అని అందర్నీ తిరిగి పనిలోకి మళ్లించారు. దటీజ్ ఎన్టీఆర్!
"ఎదురీతకు అంతంలేదా", "తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ", "బాలరాజు బంగారు సామీ" లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలోనివే. మాధవపెద్ది సత్యం ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.