English | Telugu

క్లాసిక్ ఫిల్మ్‌ 'క‌ళ్లు' క‌థ ఆలోచ‌న గొల్ల‌పూడికి ఎలా వ‌చ్చిందో తెలుసా?

 

తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లో 'క‌ళ్లు' (1988) ఒక‌టి. గొల్ల‌పూడి మారుతీరావు అదే పేరుతో రాసిన రేడియో నాటిక‌కు ఇది తెర‌రూపం. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇది ఘ‌నవిజ‌యం సాధించ‌క‌పోయినా, గొప్ప చిత్రాల్లో ఒక్క‌టిగా విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌లు పొందింది. అనేక అవార్డుల‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుల నామినేష‌న్ ప‌రిశీల‌న‌కు కూడా ఇది ఎంపికైంది. ఈ సినిమాతోటే సినిమాటోగ్రాఫ‌ర్ ఎం.వి.ర‌ఘు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ సినిమాతోటే శివాజీరాజా అనే న‌టుడు ప్రేక్ష‌కుల‌కు తెలిశాడు. ఆ ఇద్ద‌రికీ ఉత్త‌మ తొలిచిత్ర ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ నూత‌న న‌టుడుగా నంది అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాతోటే చిదంబ‌రం అనే న‌టుడికి 'క‌ళ్లు చిదంబ‌రం' అనే పేరు స్థిర‌ప‌డింది. సీతారామ‌శాస్త్రి ర‌చించ‌గా, ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సంగీతం స‌మ‌కూర్చిన "తెల్లారింది లెగండోయ్ కొక్కొరొకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో" పాట ఓ ప్ర‌భంజ‌నంలా తెలుగువారిని చుట్టేసింది. ఆ పాట పాడింది కూడా స్వ‌యంగా సీతారామ‌శాస్త్రి. ఇలాంటి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న క‌ళ్లు క‌థ ఎలా పుట్టిందో తెలుసుకుందాం...

గొల్ల‌పూడి మారుతీరావు హైద‌రాబాద్ ఆల్ ఇండియా రేడియోలో ప‌నిచేస్తూ ఉండ‌గా చాలా ర‌చ‌న‌లు చేశారు. త‌న మిత్రుడు, నాట‌కాల ప్రియుడు అయిన బి.వి. రామారావు కోసం కొన్ని నాటిక‌లు రాశారు. వాటిలో చెప్పుకోద‌గ్గ‌వి రెండు.. 'రెండు రెళ్లు ఆరు', 'క‌ళ్లు'. బి.వి. రామారావు అసెంబ్లీ హాలులో ప‌నిచేసేవారు. ఇద్ద‌రి ఆఫీసులూ ఎదురెదురుగానే కాబ‌ట్టి.. రోజూ లంచ్‌కి వాళ్లిద్ద‌రూ క‌లిసి క్యాంటిన్‌కు వెళ్లి తినేవారు. ఎప్ప‌టిలాగే వాళ్లిద్ద‌రూ లంచ్ చేయ‌డానికి క్యాంటిన్‌కు వెళ్తూ ఉండ‌గా, దారిలో మారుతీరావును రామారావు ఓ విచిత్ర‌మైన కోరిక కోరారు. అదేమంటే.. అంద‌రూ గుడ్డివాళ్లుగా ఒక నాటిక రాయ‌మ‌ని. 

కొన్ని నెల‌లు గ‌డిచిపోయాయి. చివ‌ర‌కు ఒక‌రోజు గొల్ల‌పూడికి ఒక ఆలోచ‌న వ‌చ్చింది. ఒక గుడ్డివాడు పామువేపు న‌డుస్తున్నాడు. చూడ‌గ‌లిగే శ‌క్తి లేనివాడికి తాను ప్ర‌మాదంవైపు న‌డుస్తున్నాన‌న్న సంగ‌తి తెలీదు. అదే.. చూడ‌గ‌లిగేశ‌క్తి ఉన్న‌వాడైతే అక్క‌డ పాము ఉంద‌ని, దానివేపు న‌డిస్తే త‌న‌కు ప్ర‌మాదమ‌నీ తెలుసుకోగ‌లుగుతాడు. అంటే చూడ‌లేక‌పోవ‌డం అనేది ఒక బ‌ల‌హీన‌త‌. నిజాన్ని చూడ‌లేక‌పోవ‌డం అనే బ‌ల‌హీన‌త‌. చూడ‌గ‌లిగేవాడికీ, చూడ‌లేక‌పోయేవాడికీ కార‌ణం.. 'క‌ళ్లు'. అందుకే క‌ళ్లును సింబ‌ల్‌గా తీసుకున్నారు.

ఈ నిజాన్ని చూడ‌లేక‌పోవ‌డం అనే బ‌ల‌హీన‌త విజ్ఞ‌త లేక‌పోవ‌డం వ‌ల్ల కావ‌చ్చు, చ‌దువు లేక‌పోవ‌డం వ‌ల్ల కావ‌చ్చు.. ఇలా ఏ కార‌ణంచేత‌నైనా కావ‌చ్చు. అంచేత‌, ఈ చూడ‌లేనిత‌నాన్ని బ‌ల‌హీన‌త‌గా తీసుకొని, చూడ‌గ‌లిగేవాళ్లు వాళ్ల‌ని ఏవిధంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో అనేది విజువ‌లైజ్ చేస్తే, అనే ఆలోచ‌న మారుతీరావుకు త‌ట్టింది.

"గుడ్డిత‌నం అనే బ‌ల‌హీన‌త మూలంగా తాము చేయ‌లేని ప‌నిని అంద‌రూ క‌లిసి త‌మ సంక్షేమం కోసం ఒక నాయ‌కుడిని ఎన్నుకొని, త‌మ న‌మ్మ‌కాన్ని అత‌నిమీద పెట్టుబ‌డిగా పెట్టి త‌మ స‌మాజాన్ని న‌డిపించ‌మంటే, వాళ్ల బ‌ల‌హీన‌త‌ల్ని అవ‌కాశం చేసుకొని, త‌న‌ని పెద్ద‌చేసిన స‌మాజాన్ని దోచేసి, దాన్ని ముష్టెత్తుకొనే స్థితికి తీసుకొస్తాడు ఆ నాయ‌కుడు. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేవాళ్ల‌ను చేతులుజాపే స్థితికి తీసుకువ‌స్తాడు. అట్లాంటి ప‌రిస్థితి ఎద‌రురైన‌ప్పుడు ప్రతివ్య‌క్తీ తానుగా క‌ల్పించిన విశ్వాసాన్ని వెన‌క్కి తీసుకొనే హ‌క్కులేదా? మ‌నం చూడాల‌ని ఆశించిన నిజాన్ని చూడలేని క‌ళ్లు ఉండి ఏం ప్ర‌యోజ‌నం? అనే ఆలోచ‌నే ఈ నాటిక రాయ‌డానికి నాంది ప‌లికింది." అని గొల్ల‌పూడి చెప్పుకున్నారు.

1968-70 ప్రాంతాల్లో విజ‌య‌వాడ రేడియో కేంద్రంలో ఉన్న‌ప్పుడు ఈ నాటిక‌ను ఆయ‌న రాశారు. మిత్రులు బి.వి. రామారావు, జ‌వ్వాది రామారావు ఓ రోజు రాత్రి ఆయ‌న ద‌గ్గ‌ర కూర్చొని రాయించుకున్నారు. ఆలిండియా రేడియోలో బెస్ట్ స్క్రిప్టుగా ఎన్నికైన 'క‌ళ్లు' 1975లో సాహిత్య అకాడ‌మీ అవార్డును కూడా అందుకుంది. విజ‌య‌వాడ ఎస్‌.ఆర్‌. అండ్ సి.వి.ఆర్‌. కాలేజీలో చ‌దివే రోజుల్లో ఈ నాటిక‌ను ఆంధ్ర‌నాట‌క క‌ళాప‌రిష‌త్తు పోటీల్లో చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు ఎం.వి. ర‌ఘు. మొద‌ట 'క‌ళ్లు' నాటిక‌ను ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు ('య‌మ‌గోల' ద‌ర్శ‌క‌డు) సినిమాగా తియ్యాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ అది వాస్త‌వ‌రూపం దాల్చ‌లేదు. చివ‌ర‌కు ఎం.వి. ర‌ఘు ఈ నాటిక‌కు వెండితెర రూపం ఇచ్చారు. అది ఓ క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంటుంద‌ని అప్పుడు ఆయ‌న‌కూ తెలీదు.