English | Telugu

టైగర్ హరికృష్ణ కెరీర్ లో టాప్ 10 మెమరబుల్ మూవీస్.. 

నటరత్న నందమూరి తారక రామారావు తొలి నటవారసుడు అనే ట్యాగ్ తో వెండితెరపై సందడి చేసిన నటుడు హరికృష్ణ. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. ఇటు బాలనటుడిగానూ, అటు కథానాయకుడు, సహాయనటుడిగానూ తనదైన ముద్రవేశారు హరి. అలాంటి హరికృష్ణ కెరీర్ లో టాప్ 10 మెమరబుల్ మూవీస్ ఏంటో చూద్దాం.. 

10. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్: మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో హరికృష్ణ.. టైటిల్ రోల్ లో అదరగొట్టారు. 2003లో వచ్చిన ఈ మూవీని వి. సముద్ర డైరెక్ట్ చేశారు.

9. శ్రీకృష్ణావతారం: హరికృష్ణ నటించిన మొదటి సినిమా ఇది. కమలాకర కామేశ్వరరావు రూపొందించిన ఈ చిత్రంలో.. బాలకృష్ణుడి పాత్రలో కనిపించి అలరించారు హరి. 1967లో ఈ సినిమా జనం ముందు నిలిచింది.

8. శివరామరాజు: 2002లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. ఆనంద భూపతి రాజుగా అతిథి పాత్రలో మెరిశారు హరికృష్ణ. పాత్ర పరిధి తక్కువే అయినా.. సినిమా ఫలితంపై ప్రభావం చూపించారు హరి. ఈ చిత్రాన్ని వి. సముద్ర తెరకెక్కించారు.

7. తాతమ్మకల: తన తండ్రి ఎన్టీరామారావు స్వయంగా దర్శకత్వం వహించి మరీ నటించిన ఈ సినిమాలో వెంకటేశం పాత్రలో అలరించారు హరికృష్ణ. ఈ చిత్రం రిలీజ్ టైమ్ కి హరి.. టీనేజ్ లో ఉన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. 1974లో తాతమ్మకల జనం ముందు నిలిచింది. 

6. తల్లా పెళ్ళామా: తన స్వీయదర్శకత్వంలో రూపొందించి మరీ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇది. ఇందులో బాలనటుడిగా, కథకు ముఖ్యమైన వేషంలో ఆకట్టుకున్నారు హరికృష్ణ. 1970లో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది.

5. శ్రీరాములయ్య: 1998లో విడుదలైన ఈ సినిమాలో.. కామ్రేడ్ సత్యంగా అతిథి పాత్రలో దర్శనమిచ్చారు హరికృష్ణ. చిన్న వేషమే అయినా.. తన నటనతో శ్రీరాములయ్యకి ఓ ఎస్సెట్ గా నిలిచారాయన. మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించిన శ్రీరాములయ్యకి ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వం వహించారు.

4. సీతారామరాజు: అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్ నాగార్జునకి అన్నగా అలరించారు హరికృష్ణ. సీతయ్య పాత్రలో హరి కనిపించగా.. రామరాజు వేషంలో నాగ్ దర్శనమిచ్చారు. వైవీఎస్ చౌదరి రూపొందించిన ఈ చిత్రం.. 1999లో జనం ముందు నిలిచింది. 

3. లాహిరి లాహిరి లాహిరిలో: బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హరికృష్ణకి నంది పురస్కారాన్ని అందించిన చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కృష్ణమనాయుడు పాత్రలో ఆకట్టుకున్నారు హరికృష్ణ. 2002లో రిలీజైన ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి తెరకెక్కించారు.

2. దాన వీర శూర కర్ణ: 1977 సంక్రాంతికి విడుదలై అఖండ విజయం సాధించిన సినిమా ఇది. ఇందులో అర్జునుడి పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు హరికృష్ణ. ఈ చిత్రాన్ని మహానటుడు ఎన్టీఆర్ డైరెక్ట్ చేయడమే కాకుండా.. కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మూడు విభిన్న పాత్రలను పోషించారు.

1. సీతయ్య: సోలో హీరోగా హరికృష్ణకి అఖండ విజయాన్ని అందించిన చిత్రం సీతయ్య. టైటిల్ రోల్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా జీవించేశారాయన. అంతేకాదు.. పాటల్లో తన నృత్యాలతో రంజింపజేశారు. వైవీఎస్ చౌదరి రూపొందించిన ఈ కాప్ డ్రామా 2003లో రిలీజైంది.