English | Telugu

తెలుగు చిత్ర సీమలో తొలి నట వారసుడు.. విలక్షణ నటుడు నందమూరి హరికృష్ణ!

సినిమా రంగంలో వారసత్వం అనేది సర్వ సాధారణమైన విషయం. ఎంతో మంది హీరోల వారసులు సినిమా రంగంలో ప్రవేశించి ఎన్నో విజయాలు సాధించారు, సాధిస్తున్నారు. తెలుగు చలనచిత్ర సీమలో తొలి నట వారసుడు ఎవరూ అంటే.. నందమూరి హరికృష్ణ అని చెప్పాలి. అప్పటివరకు ఏ తెలుగు హీరో కుమారుడు సినిమా రంగానికి పరిచయం కాలేదు. ఆ ఘనత సాధించారు హరికృష్ణ. 1956 సెప్టెంబర్‌ 2న నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించారు నందమూరి హరికృష్ణ. 1967లో విడుదలైన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో బాలకృష్ణుడుగా నటించడం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తల్లా పెళ్లామా, తాతమ్మ కల, రామ్‌రహీమ్‌ చిత్రాల్లో నటించారు. ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దానవీరశూర కర్ణ చిత్రంలో అర్జునుడుగా నటించారు హరికృష్ణ. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టలేదు. నిర్మాణ రంగంపై దృష్టి సారించి తమ సొంత బేనర్‌లో నిర్మించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగా హరికృష్ణ తొలి సినిమా ‘డ్రైవర్‌ రాముడు’. తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తర్వాత పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, పెద్దన్నయ్య వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో సత్యం అనే వైవిధ్యమైన పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామరాజు’ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేశారు హరికృష్ణ. నందమూరి నట వారసుడు హరికృష్ణ, అక్కినేని నటవారసుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా సాధించిన విజయంతో వై.వి.యస్‌.చౌదరి తన సొంత బేనర్‌లో నిర్మించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పాత్రతో హరికృష్ణ ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచేశారు. ఆ తర్వాత చేసిన శివరామరాజు, సీతయ్య, టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌, స్వామి వంటి సినిమాలు హరికృష్ణకు నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక స్టార్‌ హీరో ఇమేజ్‌ ఈ సినిమాలతో లభించింది. ఆ తర్వాత కృష్ణతో కలిసి చేసిన శ్రావణమాసం చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అదే హరికృష్ణ నటించిన చివరి సినిమా. 

ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. దాని కోసం వినియోగించిన చైతన్య రథం వాహనానికి సారధిగా వ్యహరించారు హరికృష్ణ. 75,000 కిలోమీటర్లు ఆ వాహనాన్ని నడిపి రికార్డు సృష్టించారు. 1995లో అధికార మార్పిడి జరిగినపుడు తండ్రి ఎన్‌.టి.రామారావును వ్యతిరేకిస్తూ చంద్రబాబునాయుడిని సమర్థించారు హరికృష్ణ. ఆయన ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో తండ్రి మరణించడంతో హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2013లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

నందమూరి హరికృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు జానకిరామ్‌, కళ్యాణ్‌రామ్‌, తారక్‌రామ్‌. వీరిలో కళ్యాణ్‌రామ్‌, తారక్‌ ఇద్దరూ హీరోలుగా తమ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకున్నారు. తండ్రి సూచన మేరకు చిన్నతనంలోనే తారక్‌ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు హరికృష్ణ. కళ్యాణ్‌రామ్‌, హరికృష్ణ, ఎన్టీఆర్‌ కలిసి ఓ సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇది జరిగిన నాలుగు సంవత్సరాలకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన నందమూరి హరికృష్ణ జయంతి సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.