English | Telugu

మీకు తెలుసా.. ఆ సినిమాకి డైరెక్టర్‌ రాఘవేంద్రరావు కాదు.. విఠలాచార్య!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘బాబు’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో ఆయన డైరెక్ట్‌ చేసిన చివరి సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. అయితే 2021లో వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి మాత్రం దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 110 సినిమాల్లో మైల్‌ స్టోన్స్‌గా చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్‌ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. 1990 మే 9న ఈ సినిమా రిలీజ్‌ అయింది. ఆరోజుల్లో హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాకి ముందు అగ్ని, రుద్రనేత్ర, ఒంటరిపోరాటం వంటి ఫ్లాప్‌ సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. అలాంటి సమయంలో మళ్ళీ చిరంజీవితో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ అయిన తర్వాత రకరకాల విమర్శలు వచ్చాయి. అవి ఏమిటి, ఎందుకు వచ్చాయి, సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలను ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. 

‘ఈ సినిమా చేయడానికి ముందు మూడు ఫ్లాప్‌ సినిమాలు తీసాను. ఇక ఈ సినిమాతో రాఘవేంద్రరావు పనైపోయింది అని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో నాతో సినిమా చెయ్యడానికి ముందుకొచ్చిన చిరంజీవి, అశ్వనీదత్‌లకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ తరహా సినిమా నేను మాత్రమే తియ్యగలనని నమ్మి నన్ను డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. సినిమా పూర్తయింది. ఇళయారాజా బ్యాక్‌గ్రౌండ్‌ చెయ్యాల్సి ఉంది. డబుల్‌ పాజిటివ్‌ రష్‌ చూసిన ఆయన ‘దీనికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అవసరం లేదు.. యాజిటీజ్‌గా రిలీజ్‌ చేసెయ్యొచ్చు. అంత అద్భుతంగా ఉంది’ అన్నారు. ఆ మాట విని నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఆ సంతోషంతోనే అమెరికా ఫ్లైట్‌ ఎక్కాను. సినిమా రిలీజ్‌ అయింది. మొదటి మూడు రోజులు సినిమాకి కలెక్షన్లు లేవు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు కాదు డైరెక్టర్‌.. విఠలాచార్య అన్నారంతా. పోస్టర్ల మీద కూడా విఠలాచార్య పేరు వేస్తే బాగుంటుంది అన్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే అలాంటి సినిమాలు తియ్యడంలో విఠలాచార్య ఎక్స్‌పర్ట్‌. సినిమా టాక్‌ చూసి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ భార్య మెడలోని తాళిబొట్టు అమ్ముకోవాలి అంటూ ప్రచారం జరిగింది. 

సినిమా రిలీజ్‌ అయిన మూడోరోజు నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఘనవిజయం దిశగా పయనించింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. ఆ వర్షాల వల్లే తాడేపల్లిగూడెంలోని ఓ థియేటర్‌లోకి నీళ్లు వచ్చేశాయి. ఫైరింజన్లతో థియేటర్‌లోని నీళ్ళను బయటికి తోడుతుంటే ప్రేక్షకులు మాత్రం కుర్చీలపైకి ఎక్కి మరీ సినిమా చూశారు. ఫ్లాపుల్లో ఉన్న నేను మళ్ళీ డైరెక్టర్‌గా నిలదొక్కుకోగలిగాను అంటే అది ఈ సినిమా వల్లే. అంతటి సెన్సేషనల్‌ మూవీ మళ్ళీ రాదు, చెయ్యలేం కూడా’ అంటూ వివరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు