English | Telugu

తెలుగులో ఫ‌స్ట్ మేల్‌ ప్లేబ్యాక్ సింగ‌ర్ అయిన ఈయ‌నను గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా?

నండూరి సుబ్బారావు గారు ర‌చించిన "ఈ రేయి న‌న్నొల్ల‌నేర‌వా రాజా" అనే పాట ఒక మేల్ సింగ‌ర్ పాడిన తొలి తెలుగు ప్లేబ్యాక్ సాంగ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. వై.వి. రావు, భానుమ‌తి జంట‌గా న‌టించిన‌ 'తాసిల్దారు' (1944) సినిమాలో ఈ పాట‌ను పాడింది ఎం.ఎస్‌. రామారావు. ఆ ర‌కంగా తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఫ‌స్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్ అనే కీర్తిని పొందారాయన‌. 1941లో ఇంట‌ర్మీడియేట్ చ‌దువుతున్న‌ప్పుడు క‌ళాశాల‌లో జ‌రిగిన ల‌లిత సంగీత పోటీలో ఆయ‌న‌కు ఫ‌స్ట్ ప్రైజ్ వ‌చ్చింది. ఆ పోటీకి సుప్ర‌సిద్ధ న‌వ‌లా ర‌చ‌యిత‌, చిత్ర‌కారుడు అడివి బాపిరాజు ఒక జ‌డ్జిగా వ‌చ్చారు. రామారావు గారి పాట‌విని సినీరంగంలో ప్ర‌వేశించ‌మ‌ని సూచించారు.

అలా 1944లో 'తాసిల్దారు' సినిమాతో నేప‌థ్య గాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఎం.ఎస్‌. రామారావు పూర్తిపేరు మోప‌ర్తి సీతారామారావు. రెండు ద‌శాబ్దాల పాటు అనేక సినిమాల్లో త‌న‌దైన మ‌ధుర గాత్రంతో పాట‌లు పాడి సంగీత ప్రియుల‌ను అల‌రించారు. ఆయ‌న పాటలు పాడిన వాటిలో దీక్ష‌, ద్రోహి, మొద‌టిరాత్రి, పాండురంగ మ‌హాత్మ్య‌ము, నా ఇల్లు, సీతారామ క‌ల్యాణ‌ము, శ్రీ‌రామాంజ‌నేయ యుద్ధ‌ము లాంటి సినిమాలున్నాయి.

"ఈ రేయి న‌న్నొల్ల‌నేర‌వా రాజా" పాట పాట‌డానికి ముందుగా ఆ పాట‌ను నేర్చుకోవ‌డానికి ఏలూరు వెళ్లి నండూరి వారి ఇంట్లో ఉండి, ఆ పాట‌ను నేర్చుకొని, ఆ త‌ర్వాత సినిమాకి పాడారు రామారావు. 'దీక్ష' చిత్రంలో ఆయ‌న పాడిన "పోరా బాబూ పో" అనే పాట ఆ రోజుల్లో అత్యంత పాపుల‌ర్ అయ్యింది. అదే పాట‌ను త‌మిళ వెర్ష‌న్‌లోనూ పాడి అక్క‌డ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు రామారావు.

1964లో ఆయ‌న మ‌ద్రాసునూ, చిత్ర‌రంగాన్నీ వ‌దిలిపెట్టి రాజ‌మండ్రి వెళ్లి ఒక గురుకులంలో 1975 వ‌ర‌కూ ప‌నిచేశారు. తులసీదాస్ ర‌చించిన 'శ్రీ హ‌నుమాన్ చాలీసా'ను 1970లో తెలుగులో అనువ‌దించి గానం చేశారు. అది చాలా పేరు తెచ్చింది. అలాగే వాల్మీకి రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ‌ను సుల‌భ‌శైలిలో తెలుగులో గేయ‌రూపంగా మ‌లచి గానం చేశారు. 'సుంద‌ర‌కాండ' ఆకాశ‌వాణిలో కొన్ని రోజుల‌పాటు వ‌రుస‌గా ప్ర‌సార‌మై ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తిని సాధించిపెట్టింది.

తెనాలి తాలూకా మోప‌ర్రు గ్రామంలో 1921 జూలై 3న జ‌న్మించిన ఎం.ఎస్‌. రామారావు 1992 ఏప్రిల్ 20న హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని స్వ‌గృహంలో క‌న్నుమూశారు. ఆయ‌న నివాసం ఉండిన వీధికి 2001 డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్ మునిసిపాలిటీవారు 'సుంద‌ర‌దాసు ఎం.ఎస్‌. రామారావు వీధి' అనే పేరు పెట్ట‌డం విశేషం.