English | Telugu

కృష్ణ లాగే నిర్మాత‌ల‌ను డ‌బ్బు అడ‌గ‌కుండా న‌ష్ట‌పోయిన జ‌మున‌!

ఒక‌ప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నిర్మాత‌ల‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించేవారు. సినిమాలు ఫ్లాపైతే, ఆ నిర్మాత‌ల‌కు మ‌ళ్లీ డేట్స్ ఇచ్చి ఇంకో సినిమా చేసిపెట్టేవారు. ఈ విష‌యాలు అప్ప‌టి ప‌త్రిక‌ల్లో వ‌చ్చేవి. ఆ త‌ర్వాత త‌రంలో కృష్ణ నిర్మాత‌ల హీరోగా పేరు తెచ్చుకున్నారు. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌ల్ని కృష్ణ ఎప్పుడూ ఇబ్బంది పెట్ట‌లేదు. నిజం చెప్పాలంటే అస‌లు అడిగేవారు కాదు. నిర్మాత‌లు ఇచ్చిన‌ప్పుడే తీసుకొనేవారు. ఆ క్ర‌మంలో నిర్మాత‌లు ఆయ‌న‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వ‌కుండా ఎగ్గొట్టిన సంద‌ర్భాలు అనేకం.

ఇలా ఉండ‌బ‌ట్టే ఆయ‌న‌తో సినిమాలు నిర్మించ‌డానికి నిర్మాత‌లు తెగ ఉత్సాహం చూపించేవార‌న్న పేరు కూడా వ‌చ్చింది. అంతే కాదు, సినిమా ఫ్లాపైన‌ప్పుడు త‌ర్వాత సినిమాని ఉచితంగా ఆ నిర్మాత‌గా చేసివ్వ‌డం ఓ అల‌వాటుగా చేసుకున్నారు కృష్ణ‌. దానివ‌ల్లే ఇండ‌స్ట్రీలో చాలా మంచి మ‌నిషిగా ఆయ‌నకు పేరు వ‌చ్చింది.

హీరోయిన్ల ధోర‌ణి అలా ఉండ‌టం చాలా అరుదు. హీరోల‌తో పోలిస్తే హీరోయిన్ల కాలం చాలా త‌క్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి, దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్లు డ‌బ్బు విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటారు. అయితే అల‌నాటి నాయిక జ‌మున తీరే వేరు. మ‌నిషి ఎంత‌టి అభిమాన‌వ‌తి అయినా, డ‌బ్బు విష‌యంలో చాలా లిబ‌ర‌ల్‌గా ఉండేవారు జ‌మున‌. "అందుకే ఆ రోజుల్లో కృష్ణ‌గారు, నేను పోగొట్టుకున్నంత డ‌బ్బు ఎవ‌రూ పోగొట్టుకోలేదు. సినిమా పూర్త‌య్యేవ‌ర‌కూ డ‌బ్బు గురించి అడిగేవాళ్లం కాదు. చివ‌ర‌ల్లో నిర్మాత‌లు డ‌బ్బు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే పోనీలే అని వ‌దిలేసేవాళ్లం." అని చెప్పారామె.

సినిమా ఫీల్డులో నిర్మాత వ‌ట‌వృక్షం లాంటివాడు. నిర్మాత బాగుంటేనే ఆ ఫీల్డు బాగుంటుంది. "స‌గం సినిమా అయ్యాక డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే షూటింగ్ ఎగ్గొట్టిన హీరోయిన్లు ఉన్నారు. కానీ నేను ఆ బాప‌తు కాదు. చాలామంది నిర్మాత‌లు డ‌బ్బు ఇవ్వ‌లేని స్థితిలో ఉంటే కృష్ణ‌గారిలా నేనూ పారితోషికం వ‌దిలేసేదాన్ని. సినిమా దెబ్బ‌తింటే మ‌ళ్లీ కాల్షీట్లు ఇచ్చి స‌హ‌క‌రించేదాన్ని. హీరోల్లో రామారావు గారు, నాగేశ్వ‌ర‌రావు గారు, కృష్ణ‌గారు.. కానీ హీరోయిన్ల‌లో జ‌మున మాత్ర‌మే అలా చేసింది." అని తెలిపారు జ‌మున‌.