English | Telugu

ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ కోసం నెలరోజులు.. సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది!

ఒక సినిమా నిర్మాణం ఎంత కాలంలో పూర్తవుతుందీ అనేది ఆ సినిమా హీరో, కథ, బ్యాక్‌డ్రాప్‌, జోనర్‌ని బట్టి ఉంటుంది. కొన్ని సినిమాలు ఆరు నెలల్లో పూర్తి కావచ్చు, మరికొన్ని సినిమాలు ఆరేళ్ళు పట్టొచ్చు. అలా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘అంజి’ సినిమా పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. గ్రాఫిక్స్‌ ప్రధానంగా, ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి హయ్యస్ట్‌ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సోషియో ఫాంటసీ మూవీ అనే విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో గ్రాఫిక్స్‌కి అంతగా ప్రాధాన్యం లేదు. 2004లో విడుదలైన పూర్తి గ్రాఫిక్స్‌తో ‘అంజి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి. అసలు చిరంజీవితో గ్రాఫిక్స్‌ ప్రధానంగా సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ సినిమా వెనుక జరిగిన ఆసక్తికరమైన విశేషాల గురించి దర్శకుడు కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. 

‘నా సినిమా కెరీర్‌లో నాకు బాగా గుర్తుండిపోయే సినిమా ‘అంజి’. ఈ సినిమా నిర్మాణంలో ఎంతో మంది కృషి ఉంది. ముందుగా అందర్నీ అభినందించాలి. అందర్నీ మించి నిర్మాత శ్యాంప్రసాద్‌కి పూర్తి క్రెడిట్‌ ఇవ్వాలి. ఎందుకంటే ‘అమ్మోరు’ వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత శ్యామ్‌గారికి చిరంజీవిగారు డేట్స్‌ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా ఒక కమర్షియల్‌ సినిమా ప్లాన్‌ చేసుకుంటారు. కానీ, శ్యామ్‌గారు మాత్రం ఆయనతో ఒక గ్రాఫిక్స్‌ సినిమా చెయ్యాలని ఉంది అన్నారు. ‘చిరంజీవిగారితో గ్రాఫిక్స్‌ సినిమా ఎందుకండీ. నా దగ్గర ఒక కమర్షియల్‌ కథ ఉంది. అది చేద్దాం’ అన్నాను. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ఇలా కాదని, ఆయనకు తెలియకుండా చిరంజీవిగారిని కలిసి విషయం చెప్పాను. గ్రాఫిక్స్‌తో సినిమా అంటే ఎంతో రిస్క్‌ కూడుకున్నదని, ఎక్కువ టైమ్‌ కూడా పడుతుందని నచ్చజెప్పాను. దానికి చిరంజీవిగారు ఎంతో కూల్‌గా ‘మీరు ఏం కంగారు పడకండి. ఎంత రిస్కయినా చేద్దాం. నా పూర్తి కోఆపరేషన్‌ ఉంటుంది’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సినిమా కోసం ఎంతో రిస్క్‌ తీసుకున్నారు. సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ళు పట్టింది. ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ తియ్యడానికి నెలరోజులు పట్టింది. ఒక టాప్‌ హీరో తన సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ళు ఓపికగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న సీన్‌ కోసం 120 షాట్స్‌ వరకు తియ్యాల్సి వచ్చేది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. 

ఈ సినిమాలోని ఒక కాస్ట్యూమ్‌ను రెండు సంవత్సరాలు వేసుకున్నారు చిరంజీవిగారు. ఎందుకంటే గ్రాఫిక్స్‌ కోసం ఆ కాస్ట్యూమ్‌కి కొన్ని మార్కులు పెట్టేవాళ్ళం. దాన్ని వాష్‌ చెయ్యడానికి వీలు లేదు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో ఎఫర్ట్‌ పెట్టి వర్క్‌ చేశారు. సినిమాపై భారీ అంచనాలు ఉండడం వల్ల రిలీజ్‌ తర్వాత ఆశించిన స్థాయిలో రెస్పాన్స్‌ రాలేదు. అయితే అది నా దృష్టిలో ‘అంజి’ ఒక గొప్ప సినిమా. మొదట సాధారణమైన సినిమాలాగే అనిపించినా చూడగా చూడగా అందరికీ నచ్చింది. ఇప్పటికీ టీవీలో ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని వివరించారు దర్శకుడు కోడి రామకృష్ణ.