English | Telugu
హత్య కేసులో సూపర్‌స్టార్ జైలు పాలు... 90 ఏళ్ళ క్రితం లక్ష రూపాయలు తీసుకున్నారు
Updated : Jul 3, 2024
సినిమా రంగంలోని ఎంతో మంది నటీనటులు వివిధ కారణాలతో, వివిధ నేరారోపణలతో జైలు జీవితాన్ని అనుభవించినవారు ఉన్నారు. తాజాగా కన్నడ హీరో దర్శన్ ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ తరహా ఘటనతోనే దాదాపు 90 ఏళ్ళ క్రితం మొట్ట మొదటి సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఎం.కె.టి. త్యాగరాజ భాగవతార్ ఓ హత్య కేసులో రెండున్నర సంవత్సరాలపాటు జైలు జీవితాన్ని అనుభవించారనే విషయం ఇప్పటి తరం వారికి తెలియదు.
ఎం.కె.టి. త్యాగరాజ భాగవతార్. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన భాగవతార్ తన 16వ ఏట నుంచే సంగీత కచ్చేరీలు చేయడం ప్రారంభించాడు. అతని సంగీతం వింటూ ప్రజలు మంత్రముగ్ధులయ్యేవారు. భారతదేశంలోనే కాదు, శ్రీలంక, నేపాల్, బర్మా వంటి దేశాల్లో కూడా ఆయనకు ప్రజాదరణ ఎక్కువగా ఉండేది. సంగీత కచ్చేరీలతోపాటు రంగస్థలం మీద నాటకాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు భాగవతార్.
1934లో సినీ రంగ ప్రవేశం చేసిన భాగవతార్ ‘పావలక్కోడి’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాదు, ఇందులో భాగవతార్ పాడిన పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ సినిమాలో 50 పాటలు ఉండడం విశేషం. హీరోగా మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న ఆయన 1944 వరకు కేవలం 9 సినిమాల్లో మాత్రమే నటించారు. 100 సినిమాలు చేస్తేనే గానీ రాని ఖ్యాతి ఈ 9 సినిమాలతోనే లభించింది. సూపర్‌స్టార్ అనే పేరును సంపాదించి పెట్టింది. హీరోగానే కాదు ఒక దైవంగా ఆయన్ని ప్రేక్షకులు ఆరాధించేవారు. ఆయన నడిచి వెళ్లిన దారిలోని మట్టిని వెండి బరిణల్లో దాచుకునేవారట. ఆయన కారు నుంచి వచ్చిన ధూళిని విభూదిలా నుదుటన పెట్టుకునేవారట. ఆరోజుల్లో ఒక్క సినిమాకి భాగవతార్ లక్ష రూపాయల పారితోషికం తీసుకునేవారంటే ఆయనకు ఎంత పాపులారిటీ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో, దేవాలయాల్లో కచ్చేరీలు చేస్తే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదు. వ్యక్తిగతంగా అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఎం.కె.టి. త్యాగరాజ భాగవతార్‌కి జైలుకి వెళ్ళాల్సిన దుస్థితి ఎందుకు పట్టింది? ఒక వ్యక్తిని హత్య చేయించాల్సిన అవసరం ఆయనకేమిటి? ఆ వివరాల్లోకి వెళితే..
అతని పేరు ఎన్.సి.లక్ష్మీకాంతన్.. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. మోసాలు, ఫోర్జరీలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఒక పత్రికను కొని దాన్ని ఎల్లో జర్నలిజానికి వాడుకునేవాడు. ప్రముఖులపై తప్పుడు కథనాలు రాస్తూ ఉండేవాడు. రాసే ముందు వారికి విషయం చెప్పి డబ్బు ఇమ్మని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. కొందరు ఇచ్చేవారు, కొందరు ఇచ్చేవారు కాదు. అలా.. భాగవతార్‌ని, అతని సన్నిహితుడైన హాస్యనటుడు ఎన్.ఎస్.కృష్ణన్‌ని కూడా బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాడు భాగవతార్. లక్ష్మీకాంతన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలోనే భాగవతార్ నటించిన ‘హరిదాసు’ చిత్రం 1944 దీపావళికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ ఒక్క సినిమా విజయంతోనే 12 సినిమాల్లో బుక్ అయ్యారు భాగవతార్. ‘హరిదాసు’ ఒకే థియేటర్‌లో 1946వ సంవత్సరం దీపావళి వరకు ప్రదర్శితమైంది. ఆ విజయాన్ని ఆనందించకుండానే భాగవతార్ జీవితంలోకి చీకటి ప్రవేశించింది.
జైలు నుంచి వచ్చిన లక్ష్మీకాంతన్ హిందు నేషన్ అనే మరో పత్రిక పెట్టాడు. యధావిధిగా ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ అవాకులు, చవాకులు రాసేవాడు. అలా పత్రిక మీద చాలా సంపాదించాడు. సొంతంగా ప్రెస్ పెట్టాడు. ఒక ఇల్లు కూడా కొన్నాడు. అయితే ఆ ఇంట్లో ది హిందులో పనిచేసే వడివేలు అనే వ్యక్తి ఉండేవాడు. అతన్ని ఖాళీ చెయ్యమంటే.. నేను చెయ్యను అన్నాడు. వడివేలు అతని మరదలితో కలిసి ఉండేవాడు. అతను ఖాళీ చెయ్యను అన్నాడన్న కోపంతో అతని గురించి, అతని మరదలి గురించి పత్రికలో అసభ్యంగా రాశాడు. అలా రాసినందుకు మరింత రగిలిపోయిన వడివేలు ఇల్లు ఖాళీ చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అతన్ని ఖాళీ చేయించేందుకు కోర్టులో పిటిషన్ వేశాడు లక్ష్మీకాంతన్. ఆ కేసు నవంబర్ 10న విచారణకు రావాల్సి ఉంది. నవంబర్ 8న తన లాయర్‌ని కలిసేందుకు రిక్షాలో వెళుత్ను లక్ష్మీకాంతన్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు. అతను చికిత్స పొందుతూ నవంబర్ 9న చనిపోయాడు. ఇక ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. లక్ష్మీకాంతన్ అంతకుముందు ఎవరి గురించి చెడుగా రాసాడో వాళ్ళందరూ కక్ష పెంచుకొని ఉంటారన్న ఉద్దేశంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ క్రమంలోనే సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేసే ఆర్య వీరసేనన్‌ను, ఒక కానిస్టేబుల్‌ని కూడా అరెస్ట్ చేశారు. చివరగా భాగవతార్‌ని, ఎన్.ఎస్.కృష్ణన్‌ని అరెస్ట్ చేశారు. అప్పుడు జైలుకు వెళ్లిన భాగవతార్ 30 నెలల వరకు బయటికి రాలేకపోయారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తనతోపాటు వడివేలును కూడా లక్ష్మీకాంతన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న భాగవతార్.. వడివేలుతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. దానికి మిత్రులు, ఒక కానిస్టేబుల్ సహకారం కూడా ఉందని తేల్చింది. దీంతో ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కేసును లండన్ తరలించేందుకు అనుమతి కోరారు భాగవతార్. ఎందుకంటే అప్పటికి ఇండియాలో సుప్రీమ్ కోర్టు లేదు. లండన్ కోర్టు.. మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. వారే హత్య చేయించారని ఎక్కడా నిరూపణ కాలేదని చెబుతూ భాగవతార్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.
జైలు నుంచి వచ్చిన తర్వాత భాగవతార్‌లో చాలా తేడా వచ్చింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అతని జీవితంలో ఒక నిర్లిప్తత అనేది వచ్చింది. జైలు నుంచి వచ్చినప్పటికీ అతనికి జనంలో అదే పాపులారిటీ ఉంది. అంతకుముందు 12 సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశారు. మళ్ళీ ఏ నిర్మాత దగ్గరా అడ్వాన్స్ తీసుకోలేదు. తనే సొంతంగా 1959 వరకు సినిమాలు నిర్మించారు. కానీ, ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఎందుకంటే అతను జైలు నుంచి వచ్చే సమయానికి సినిమాల తీరు తెన్నులు మారిపోయాయి. కొత్త నటీనటులు వచ్చేశారు. భాగవతార్ చేసే సినిమాలకు ఆదరణ కరవైంది. మానసికంగా కుంగిపోయిన భాగవతార్ అనారోగ్య కారణాల వల్ల తన 49వ ఏటనే తుదిశ్వాస విడిచారు.