English | Telugu
తెలుగులో మమ్ముట్టి నేరుగా నటించిన సినిమాలివే..
Updated : Sep 7, 2023
నటుడిగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టిది 52 ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో 400కి పైగా సినిమాల్లో సందడి చేశారాయన. ప్రధానంగా మలయాళ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన మమ్ముట్టి.. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషల్లోనూ తనదైన ముద్రవేశారు. 13 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 3 జాతీయ పురస్కారాలతో పాటు ఏడు కేరళ స్టేట్ అవార్డ్స్ సైతం తన కైవసం చేసుకున్నారు.
ఇక తెలుగులో మమ్ముట్టి నేరుగా నటించిన సినిమాల విషయానికి వస్తే.. కేవలం నాలుగు తెలుగు చిత్రాల్లో మాత్రమే ఆయన కనిపించారు. 1991లో కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వాతి కిరణం' మమ్ముట్టికి తెలుగులో ఫస్ట్ స్ట్రయిట్ మూవీ. ఇందులో అనంత రామశర్మ పాత్రలో జీవించేశారాయన. సంగీతభరితంగా సాగే ఈ సినిమాకి ఆయన అభినయం ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఇక ఐదేళ్ళకు పైగా విరామంతో 1996లో 'సూర్య పుత్రులు' సినిమా చేశారు మమ్ముట్టి. సి. ఉమామహేశ్వరరావు రూపొందించిన ఈ సినిమాలో సుమన్, నగ్మా, శోభన ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆనక సుదీర్ఘ విరామం అనంతరం 2019లో 'యాత్ర' చేశారు. మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రాఫికల్ ఫిల్మ్ లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాత్రలో అలరించారు. ఇక రీసెంట్ గా వచ్చిన 'ఏజెంట్' మూవీ తెలుగులో మమ్ముట్టి నాలుగో చిత్రం. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో.. మమ్ముట్టి ఓ స్పెషల్ రోల్ చేశారు. మరి.. భవిష్యత్ లోనూ తెలుగునాట మమ్ముట్టి విభిన్న పాత్రలతో పలకరిస్తారేమో చూడాలి.
(సెప్టెంబర్ 7.. మమ్ముట్టి పుట్టినరోజు సందర్బంగా..)