English | Telugu
బిగ్గెస్ట్ స్కూప్: శ్రీరామునిగా మహేశ్.. రావణునిగా హృతిక్!
Updated : Feb 10, 2021
ఇంతకంటే బిగ్గెస్ట్ స్కూప్ ఇంకోటి ఉండదు. ఇప్పుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆ స్కూప్ ఏమిటంటే.. శ్రీరాముని పాత్రను సూపర్‌స్టార్ మహేశ్ చేయనున్నాడు. అదేమిటీ ఆల్రెడీ ప్రభాస్ చేస్తున్నాడు కదా? అని సందేహం రావచ్చు. కానీ ఇది వేరే ప్రాజెక్ట్. బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో 'రామాయణ 3డి' సినిమాని నిర్మించాలని చాలా కాలంగా కలలు కంటున్నాడు.
ఇప్పటికే హృతిక్ రోషన్, దీపికా పడుకోనేలను ఆ సినిమా చేయడానికి ఒప్పించాడు కూడా. అయితే హృతిక్ చేయడానికి ఒప్పుకుంది రాముని పాత్ర కాదు, ప్రతినాయకుడైన రావణాసురుని పాత్రను! సీత పాత్రకు దీపిక సరేనంది. నిజానికి మొదట శ్రీరాముని పాత్రకు ప్రభాస్‌ను సంప్రదించాడు మధు మంతెన. అయితే ఆ ప్రాజెక్ట్ బాలా ఆలస్యమవుతుండటంతో, ఈలోగా ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో 'ఆదిపురుష్' చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రభాస్. 'ఆదిపురుష్'లో రామునిగా ప్రభాస్ నటిస్తున్నట్లు ఓమ్ రౌత్ ప్రకటించడంతో మధు మంతెన షాక్ అయ్యాడు.
వెంటనే తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో వేగం పెంచాడు. రాముని పాత్రకోసం ముఖంలో స్వచ్ఛత, చూడగానే ఆకట్టుకొనే రూపం ఉన్న మరో సౌత్ స్టార్ కోసం చేసిన అన్వేషణ మహేశ్ దగ్గర ఆగిందని తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్‌ను అప్రోచ్ అవడం, స్క్రిప్ట్ వినిపించడం కూడా జరిగిపోయాయంట. మహేశ్ కూడా ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎగ్జయిట్ అయ్యాడని అంటున్నారు. అయితే ఇంకా ఒప్పందం మాత్రం కుదరలేదని తెలుస్తోంది.
ఈ రూమర్స్ గనుక నిజమే అయితే ఆడియెన్స్‌కు ఇంతకంటే కన్నుల పండుగ ఉండదు. ఎవరికివారే అయిన ముగ్గురు సూపర్ స్టార్లు.. హృతిక్, మహేశ్, దీపిక.. ఒకే సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించడం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలి.