Read more!

English | Telugu

చాలా త‌క్కువ మందికి తెలిసిన భానుప్రియ వైవాహిక జీవితంలోని నిజాలు!

 

ఒక‌ప్పుడు సినిమా హీరోయిన్ల‌లో 'విశాల‌నేత్రి' అనే మాట‌కు నిఖార్స‌యిన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు భానుప్రియ‌. చ‌క్క‌ని న‌టి, అంత‌కుమించిన డాన్స‌ర్ కావ‌డంతో క‌ళ్ల‌తోటి ఆమె ప‌లికించే భావాల‌ను ప్రేక్ష‌కులు ముచ్చ‌ట‌ప‌డుతూ చూసేవారు. అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఒక ద‌శాబ్దం పాటు రాణించిన భానుప్రియ వ్య‌క్తిగ‌త జీవితం అంత సాఫీగా సాగ‌లేద‌నే చెప్పాలి. మొద‌ట 'సితార‌'తో త‌నను హీరోయిన్‌ను చేసిన ద‌ర్శ‌కుడు వంశీతో ఆమె ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టికే పెళ్ల‌యిన వంశీ ఆమెను రెండో పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అన్నారు కూడా. కానీ భానుప్రియ త‌ల్లి గ‌ట్టిగా వారించ‌డ‌తో భానుప్రియ ఆగిపోయారు.

ఆ త‌ర్వాత ఆమె సుప్ర‌సిద్ధ భ‌ర‌త‌నాట్య కళాకారిణి సుమ‌తీ కౌశ‌ల్ కుమారుడు ఆద‌ర్శ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయ‌న అమెరికాలో స్థిర‌ప‌డిన‌ పేరుపొందిన ఫొటోగ్రాఫ‌ర్‌. అందువ‌ల్ల న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పి భానుప్రియ అమెరికా వెళ్లిపోయారు. 2003లో అభిన‌య అనే పాప పుట్టిన త‌ర్వాత కొన్నాళ్ల‌కు భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయి. సామ‌ర‌స్యంగా వాటిని ప‌రిష్క‌రించుకుంటూనే కూతుర్ని తీసుకుని 2005లో భానుప్రియ చెన్నైకు వ‌చ్చేశారు. త‌న క‌మిట్‌మెంట్స్‌తో ఆద‌ర్శ్ ఎప్పుడూ బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌, ఫ్యామిలీకి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయేవార‌నీ, దాంతో సెన్సిటివ్ అయిన‌ భానుప్రియ బాగా అప్‌సెట్ అయ్యార‌నీ, అందుకే ఇండియాకు తిరిగి వ‌చ్చేశార‌నీ అంతా అనుకున్నారు.

ఏదేమైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టిస్తూ వ‌చ్చారు. అయితే భానుప్రియ భ‌ర్త‌తో విడిపోయార‌నీ, వారికి 2005లోనే విడాకులు కూడా మంజూర‌య్యాయ‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆద‌ర్శ్‌ను భానుప్రియ మాజీ భ‌ర్త అని కూడా ప‌త్రిక‌ల్లో రాస్తూ వ‌చ్చారు. అయితే 2016లో ఇచ్చిన ఒక‌ ఇంట‌ర్వ్యూలో తాము విడిపోలేద‌నీ, ప్ర‌తి సంసారంలో క‌ల‌త‌లు అనేవి సాధార‌ణ‌మేన‌నీ, త‌మ సంసారంలోనూ అవి వ‌చ్చాయ‌నీ ఆమె చెప్పారు. అత్త‌య్య సుమ‌తితో ఇప్ప‌టికీ త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. త‌న‌కు సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు ఆమె ఎంక‌రేజ్ చేశార‌ని ఆమె చెప్పారు. భ‌ర్త ఆద‌ర్శ్‌ నేష‌న‌ల్ జియోగ్రాఫిక‌ల్‌, డిస్క‌వ‌రీ చాన‌ల్స్‌కు వ‌ర్క్ చేస్తున్నార‌నీ, ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫొటోగ్రాఫ‌ర్ అనీ, సితార్ బాగా వాయిస్తార‌నీ అప్పుడు భానుప్రియ‌ తెలిపారు.

ఆయ‌న అక్క‌డ‌, ఈమె ఇక్క‌డ అన్న‌ట్లు సుమారు ప‌దమూడు సంవ‌త్స‌రాల పాటు అలాగే విడివిడిగా జీవించారు ఆద‌ర్శ్‌, భానుప్రియ‌. 2018 ఫిబ్ర‌వ‌రి మొద‌ట్లో హ‌ఠాత్తుగా గుండెపోటుతో ఆద‌ర్శ్ మృతి చెందార‌నే వార్త తెలియ‌డంతో ఆమె గుండె బ‌ద్ద‌ల‌యింది. హుటాహుటిన అమెరికా బ‌య‌లుదేరి వెళ్లి, ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు భానుప్రియ‌.

ప్ర‌స్తుతం భానుప్రియ కుమార్తె అభిన‌య‌తో క‌లిసి చెన్నైలో జీవ‌నం సాగిస్తున్నారు. లేటెస్ట్‌గా డాన్స్ బేస్డ్ ఫిల్మ్ 'నాట్యం'లో కీల‌క పాత్ర చేస్తున్నారు.