Read more!

English | Telugu

టైమ్ వేస్ట్ అవుతుంద‌ని లంచ్ టైమ్‌లోనూ కిరీటం తీయ‌ని బాల‌కృష్ణ‌!

 

విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించిన కొన్ని సినిమాల‌కు సింగీతం శ్రీ‌నివాస‌రావు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. నిజానికి ఆయ‌న సినీరంగ ప్ర‌వేశం జ‌రిగింది 'మాయాబ‌జార్‌'తో. దిగ్ద‌ర్శ‌కుడు కె.వి. రెడ్డి శిష్యునిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన సింగీతం సైతం లెజండ‌రీ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదిగారు. 'పుష్ప‌క విమానం' ఒక్క‌టి చాలు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఎలాంటిదో చెప్ప‌డానికి. అయితే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయ‌న‌కు జీవిత కాలంలో రాలేదు. కానీ ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణను మాత్రం మూడు సినిమాల్లో ఆయ‌న డైరెక్ట్ చేశారు. వాటిలో రెండు క్లాసిక్స్‌గా కాలానికి త‌ట్టుకొని నిల‌బ‌డ్డాయి.. అవి.. 'ఆదిత్య 369', 'భైర‌వ ద్వీపం'. అయితే మూడో సినిమా 'శ్రీ‌కృష్ణార్జున యుద్ధం' మాత్రం ఫ్లాప‌యింది.

ఎన్టీఆర్‌లో ఉన్న దాదాపు అన్ని ల‌క్ష‌ణాలు బాల‌కృష్ణ‌లో ఉన్నాయంటారు సింగీతం. క్ర‌మ‌శిక్ష‌ణ‌, పెద్ద‌వారిని గౌర‌వించే ల‌క్ష‌ణాలు ఆయ‌న‌కు ఎస్సెట్స్‌గా చెబుతారు. పౌరాణిక చిత్రాలు చేసేట‌ప్పుడు ఒక‌సారి ఆభ‌ర‌ణాలు ధ‌రిస్తే, మ‌ళ్లీ షూటింగ్ ప్యాక‌ప్ చెప్పేట‌ప్పుడే వాటిని తీసేవారు ఎన్టీఆర్‌. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యంలోనూ వాటిని తీసేవారు కాదు, స‌మ‌యం వృథా అవుతుందని. అదే ల‌క్ష‌ణం బాల‌య్య‌కూ వ‌చ్చింది. 'ఆదిత్య 369' సినిమాలో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర పోషించే స‌మ‌యంలో త‌ల‌మీద కిరీటం ఇబ్బంది క‌లిగిస్తున్నా అలాగే ఉండేవారు.

ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో భ‌విష్య‌త్ కాలం షాట్స్ తీసేట‌ప్పుడు సింగీతంకూ, సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్‌కు ఎక్కువ ప‌ని ఉండేది. లైటింగ్ సెట్ చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేది. అందువ‌ల్ల ఆర్టిస్టులు వ‌చ్చినా వృథాగా కూర్చోవాల్సి వ‌చ్చేది. అందుకే ఒక‌రోజు బాల‌కృష్ణ‌ను కాస్త ఆల‌స్యంగా ర‌మ్మ‌ని చెప్పారు సింగీతం. అలా ఆయ‌న ఇంటివ‌ద్దే ఉంటే, ఎన్టీఆర్ "షూటింగ్ లేదా?" అని అడిగారు. డైరెక్ట‌ర్‌గారే లేటుగా ర‌మ్మ‌న్నార‌ని బాల‌య్య చెప్పారు. "నిర్మాత మ‌న‌కు డ‌బ్బు ఇస్తున్న‌ది ఉద‌యం నుంచి సాయంకాలం దాకా వారికి అందుబాటులో ఉండ‌టానికి. ముందు మేక‌ప్ వేసుకొని షూటింగ్‌కు వెళ్లు." అని ఆర్డ‌ర్ వేశారు ఎన్టీఆర్‌. వెంట‌నే బాల‌కృష్ణ మేక‌ప్ వేసుకొని షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చారు. అదీ ఎన్టీఆర్ ప‌ద్ధ‌తి. దాన్ని బాల‌య్య అనుస‌రిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో సింగీతం చెప్పుకొచ్చారు.