Read more!

English | Telugu

గొప్ప‌న‌టులు గుమ్మ‌డి చివ‌రి రోజులు ఎలా గ‌డిచాయో తెలుసా?

 

తెలుగుచిత్ర‌సీమ గ‌ర్వించే న‌టుల్లో ఒక‌రు.. గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు. మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ త‌ర‌లివ‌స్తున్న క్ర‌మంలో 1992లో హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు గుమ్మ‌డి. ఆ త‌ర్వాత కొద్ది కాలంలోనే ఆయ‌న గుండెజ‌బ్బుకు గుర‌య్యారు. స‌ర్జ‌రీ చేయించుకొని ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే 1995లో ప‌క్ష‌వాతం వ‌చ్చి ఇబ్బందిప‌డ్డారు. ఆ ప్ర‌భావం గొంతుమీద కూడా ప‌డింది. గంభీర‌మైన వాచ‌కానికి పేరుప‌డిన ఆయ‌న‌కు మాట ప‌ల‌కడం క‌ష్ట‌మైంది.

త‌న పాత్ర‌కు మ‌రొక‌రు గొంతునివ్వ‌డం అనే ఆలోచ‌న న‌చ్చ‌క సినిమాలు మానేద్దామ‌నుకున్నారు. కానీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రెండు మూడు సినిమాలు చేశారు. తెర‌పై గుమ్మ‌డి నోట ఇంకెవ‌రి గొంతో వినిపించ‌డం చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆయ‌న‌కూ అది ఎబ్బెట్టుగా తోచింది. దాంతో వేషాలు మానుకున్నారు.

అంజ‌లీదేవి నిర్మించిన 'పుట్ట‌ప‌ర్తి సత్య‌సాయిబాబా' చిత్రంలో బాబా స్వ‌యంగా అడ‌గ‌టంతో ఓ ముస‌లివాని పాత్ర చేశారు గుమ్మ‌డి. ఆయ‌న గొంతుకు బాబా ఏదో మందు లాంటిది రాసి, డ‌బ్బింగ్ చెప్ప‌మంటే, పాత్ర‌కు త‌గ్గ‌ట్లు డ‌బ్బింగ్ చెప్పి త‌న‌కు తానే ఆశ్చ‌ర్య‌పోయారు. అలాగే మ‌రోసారి 2008లో 'కాశినాయ‌న‌'గా తెర‌పై టైటిల్ రోల్ చేశారు. అప్పుడు కూడా గొంతు స‌హ‌క‌రించి, డ‌బ్బింగ్ చెప్పేలా చేసింది.

దాదాపుగా ఆ స‌మ‌యంలోనే మాయాబ‌జార్‌ను క‌ల‌ర్‌లోకి మారుస్తున్నార‌ని తెలిసి, ఆ సినిమాని చెడ‌గొడుతున్నారేమోన‌ని బాధ‌ప‌డ్డారు గుమ్మ‌డి. చివ‌రికి ఆ చిత్రాన్ని రంగుల్లోకి మార్చాక‌, 2010 జ‌న‌వ‌రి 16న ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఆత్మీయుల మ‌ధ్య కూర్చొని చూసి, పుల‌కించిపోయారు.

ఆ త‌ర్వాత వారం రోజుల‌కు గుమ్మ‌డిగారికి మ‌ళ్లీ సుస్తీ చేసింది. గుండె బ‌ల‌హీన‌ప‌డింద‌ని చెప్పారు వైద్యులు. బీపీ ప‌డిపోతుంటే, ఇంటికి ద‌గ్గ‌ర‌లోనే ఉన్న అపోలో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశారు. రెండు రోజుల చికిత్స త‌ర్వాత జ‌న‌వ‌రి 26న తిరిగిరాని లోకాల‌కు త‌ర‌లిపోయారు.