Read more!

English | Telugu

ఎన్టీఆర్‌ను మొద‌ట యాక్ట‌ర్‌గా, త‌ర్వాత హీరోగా ప‌రిచ‌యం చేసింది ఒక్క‌రే!

 

మ‌న‌లో చాలామందికి తెలుసు.. న‌ట‌రత్న నంద‌మూరి తార‌క‌రామారావు 'మ‌న‌దేశం' (1949) చిత్రంతో న‌టునిగా ప‌రిచ‌యం అయ్యార‌న్న విష‌యం. అందులో పోలీస్ వేషంలో ఆయ‌న క‌నిపించారు. చిన్న పాత్రే అయినా ఓ సంద‌ర్భంలో కీల‌కంగా ఉంటుంది. ఆ సినిమా త‌ర్వాత 'ప‌ల్లెటూరి పిల్ల' (1950) అనే సినిమాలో ఫ‌స్ట్ టైమ్ హీరోగా న‌టించారు ఎన్టీఆర్‌. విశేష‌మేమంటే, అప్ప‌టికే హీరోగా ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు పొందిన న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అందులో సెకండ్ హీరోగా న‌టించ‌డం!

'మ‌న‌దేశం' మూవీలో ఎన్టీఆర్‌ను న‌టునిగా, 'ప‌ల్లెటూరి పిల్ల' సినిమాలో హీరోగా ప‌రిచ‌యం చేసింది మీర్జాపురం రాజా, సి. కృష్ణ‌వేణి దంప‌తులు. ఎం.ఆర్‌.ఎ. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై 'మ‌న‌దేశం' చిత్రాన్ని వారు నిర్మించారు. ఎం.ఆర్‌.ఎ. అంటే మేకా రాజ్య‌ల‌క్ష్మీ అనూరాధ‌. అది.. ఆ దంప‌తుల కుమార్తె పేరు. త‌ర్వాత కాలంలో ఆమె ఎం.ఆర్‌. అనూరాధాదేవి పేరుతో ప‌లు సినిమాలు నిర్మించారు. 

కాగా, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'ప‌ల్లెటూరి పిల్ల‌'ను నిర్మించింది.. టైటిల్స్ ప్ర‌కారం ద‌ర్శ‌కుడు కూడా అయిన‌ బి.ఎ. సుబ్బారావు. నిజానికి ఆయ‌న పేరు మీద ఆ చిత్రాన్ని తీసింది రాజావారే. ఈ విష‌యాన్ని ఆ చిత్ర క‌థానాయిక కూడా అయిన కృష్ణ‌వేణి స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. "సుబ్బారావు పేరుతో రాజావారే 'ప‌ల్లెటూరి పిల్ల' చిత్రాన్ని నిర్మించారు. సుబ్బారావు అప్ప‌ట్లో మా ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌. మా శోభ‌నాచ‌ల‌ స్టూడియో వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌నే చూసేవారు." అని ఆమె చెప్పారు.