English | Telugu

కృష్ణ, శోభన్‌బాబు విడిపోవడానికి, మల్టీస్టారర్స్‌కి బ్రేక్‌ పడడానికి కారణమైన సినిమా ఇదే!

తెలుగు సినిమా రంగంలో మల్టీస్టారర్‌ చిత్రాలకు ఆద్యులుగా ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల గురించి చెప్పుకోవాలి. వారి కెరీర్‌ ప్రారంభం నుంచి దాదాపు 15 సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అయితే వారి మధ్య ఎప్పుడూ మనస్పర్థలు రాలేదు. ఇద్దరిలో ఎన్టీఆర్‌ కంటే ఎఎన్నార్‌ సీనియర్‌. అయినా ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది, ఎవరి పాత్ర తక్కువ ఉంది అనే విషయాల గురించి ఇద్దరూ పట్టించుకోలేదు. ‘మిస్సమ్మ’ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌ ప్రారంభంలోనే చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ హీరో కాగా, ఎఎన్నార్‌ డిటెక్టివ్‌గా ఒక కామెడీ క్యారెక్టర్‌ చేశారు. అయినా ఎఎన్నార్‌ ఆ విషయంలో ఫీల్‌ అవ్వలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎలాంటి అరమరికలు లేకుండా ఇద్దరూ సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరు హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ కలిసి చేసే సినిమాల్లో తమ హీరోకి ఎలాంటి ఇంపార్టెన్స్‌ ఇచ్చారు అని అభిమానులు డిస్కస్‌ చేసుకునేవారు. 

ఆ క్రమంలోనే ఇద్దరూ కలిసి చేసిన ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడిగా, ఎఎన్నార్‌ అర్జునుడిగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత అక్కినేని అభిమానులు తమ హీరో పాత్ర విషయంలో నిరాశ చెందారు. ఎన్టీఆర్‌ పాత్ర కంటే ఎఎన్నార్‌ పాత్రకు ప్రాధాన్యం తగ్గిందని వారు భావించారు. అంతటితో ఆగకుండా కొందరు సీనియర్‌ అభిమానులు ఈ విషయాన్ని అక్కినేని అన్నపూర్ణ చెవిలో వేశారు. అప్పుడు సినిమా చూసిన ఆమెకు కూడా అలాగే అనిపించింది. ఇకపై ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయవద్దని అక్కినేనిపై  ఆంక్ష విధించారు అన్నపూర్ణ. దీనికి సంబంధించి ఆయన నుంచి మాట కూడా తీసుకున్నారు. ఈ సినిమా 1963లో విడుదలైంది. ఆ తర్వాత 14 సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు. 1977లో వచ్చిన ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రంతో మళ్ళీ ఇద్దరూ కలిసి నటించడం ప్రారంభించారు. 

మల్టీస్టారర్స్‌ విషయంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చుకున్న జంట కృష్ణ, శోభన్‌బాబు. వయసు రీత్యా, కెరీర్‌ పరంగా కృష్ణ కంటే శోభన్‌బాబు సీనియర్‌. కృష్ణ కంటే నాలుగు సంవత్సరాల ముందే శోభన్‌బాబు ఇండస్ట్రీకి వచ్చారు. అందుకే శోభన్‌బాబును ఎంతో గౌరవించేవారు కృష్ణ. వీరిద్దరూ కలిసి మొదట నటించిన సినిమా ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ఓ అరడజను సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా ‘మహా సంగ్రామం’. మొత్తంగా చూస్తే ఇద్దరూ కలిసి 17 సినిమాలు చేశారు. 1973 తర్వాత ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ మొదలైంది. ఒకరిని మించి ఒకరు హిట్లు కొడుతూ దూసుకెళ్ళేవారు. ఇక్కడ కూడా ఇద్దరికీ అభిమాన సంఘాలు ఏర్పడడం, తమ హీరోల సినిమాల గురించి అభిమానులు చర్చా వేదికలు పెట్టుకోవడం వంటివి విరివిగా జరిగేవి. 

దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత 1977లో ‘కురుక్షేత్రం’ చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో శ్రీకృష్ణుడుగా శోభన్‌బాబు, అర్జునుడిగా కృష్ణ నటించారు. ఈ సినిమా నుంచి మళ్ళీ ఇద్దరి కాంబినేషన్‌ మొదలైంది. అప్పటికే ఇద్దరూ టాప్‌ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీరు చేసే సినిమాలు అభిమానులకు చర్చనీయాంశాలుగా మారేవి. ఇద్దరిలో ఎవరి పాత్రకు ప్రాధాన్యం ఉంది అనే దానిమీదే ఎక్కువ చర్చ జరిగేది. అయితే కృష్ణ కంటే శోభన్‌బాబు సీనియర్‌ కావడం వల్ల తన పాత్ర ఇంపార్టెన్స్‌ తగ్గినా కృష్ణ ఫీల్‌ అయ్యేవారు కాదు. కానీ, అభిమానులు మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకునేవారు. ఆ క్రమంలోనే ఇద్దరూ కలిసి చేసిన ముందడుగు చాలా పెద్ద హిట్‌ అయింది. సిల్వర్‌ జూబ్లీ జరుపుకున్న ఏకైక మల్టీస్టారర్‌గా ‘ముందడుగు’ చిత్రాన్ని చెబుతారు. అంతకుముందు ఇద్దరి కాంబినేషన్‌లో ‘మండే గుండెలు’ చిత్రం వచ్చింది. అభిమానుల మధ్య ఎన్ని చర్చలు జరుగుతున్నా ఇద్దరూ కలిసి కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు, మహాసంగ్రామం వంటి సినిమాలు చేశారు. 

సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్న వీరిద్దరి కాంబినేషన్‌కి ‘మహా సంగ్రామం’ బ్రేక్‌ వేసింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత శోభన్‌బాబు అభిమానులు కోపంతో రగిలిపోయారు. ఈ సినిమాలో కృష్ణ క్యారెక్టర్‌ మెయిన్‌గా కనిపించడం, శోభన్‌బాబు క్యారెక్టర్‌ని తగ్గించి చూపించడంతో గొడవ మొదలైంది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ విషయంలో శోభన్‌బాబు కూడా బరస్ట్‌ అయి పరుచూరి బ్రదర్స్‌ని చంపేస్తానని కోపంగా అన్నారని తర్వాత పరుచూరి గోపాలకృష్ణ  ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో శోభన్‌బాబు మిలటరీ ఆఫీసర్‌గా నటించారు. అతని క్యారెక్టర్‌తో కామెడీ చేయించారు. సినిమా రిలీజ్‌కి ముందే ఒక మిలటరీ ఆఫీసర్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్‌లో శోభన్‌బాబు పాత్ర నిడివిని తగ్గించాల్సి వచ్చిందని పరుచూరి బ్రదర్స్‌ తర్వాత వివరణ ఇచ్చారు. అయితే దీన్ని శోభన్‌బాబు అభిమానులు ఒప్పుకోలేదు. సెన్సార్‌లో కట్‌ అయిందనేది సాకు మాత్రమేనని, కావాలనే తమ హీరో క్యారెక్టర్‌ను తగ్గించారని వాదించారు శోభన్‌బాబు అభిమానులు. ఇది జరిగిన తర్వాత కలిసి మళ్ళీ సినిమా చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యారు కృష్ణ, శోభన్‌బాబు.