English | Telugu
ప్రపంచంలో మరో కీరవాణి లేరు.. ఆ పేరు వెనుక అంత కథ ఉంది!
Updated : Jul 4, 2024
‘మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది..’అంటూ యువతలో స్ఫూర్తి నింపారు. ‘అంతా రామ మయం..’ అంటూ భక్తుల్ని పరవశింప జేశారు. ‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో..’ అంటూ ప్రేమికుల గుండెల్లో తీయని రాగాలు పలికించారు. ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’ అంటూ దేశభక్తిని ప్రభోదించారు. ‘రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే..’ అంటూ జీవిత సత్యాన్ని తెలిపారు. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని సప్త స్వరాల్లో ఓలలాడిస్తున్న స్వరవాణి ఎం.ఎం.కీరవాణి పుట్టినరోజు జూలై 4. ఈ సందర్భంగా ఆయన సంగీత దర్శకుడిగా ఎదిగిన వైనం, అధిరోహించిన కీర్తి శిఖరాల గురించి తెలుసుకుందాం.
కీరవాణి.. సంగీతంలో ఇది ఒక రాగం పేరు. ఈ పేరుతో ప్రపంచంలో మరెవ్వరూ లేరు అంటే ఆశ్చర్యం కలగక మానదు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఆ పేరు పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం విడుదలైన ‘విప్రనారాయణ’ చిత్రాన్ని చూసిన శివశక్తి దత్తాకు అందులోని ఒక పాట బాగా నచ్చింది. ‘ఎందుకోయి తోటమాలి.. అంతులేని యాతనా.. ఇందుకేనా’ అంటూ సముద్రాల రాఘవాచార్య రాసిన ఈ పాటను ఎస్.రాజేశ్వరరావు కీరవాణి రాగంలో స్వరపరచగా, భానుమతి ఆలపించారు. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిలపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ పాట శివశక్తి దత్తాను సంవత్సరాల తరబడి వెంబడిస్తూనే ఉంది. దాంతో కీరవాణి రాగంపైన మమకారం పెంచుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే ‘విప్రనారాయణ’ విడుదలైన 7 సంవత్సరాల తర్వాత శివశక్తి దత్తా దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు తనకెంతో ఇష్టమైన కీరవాణి అనే పేరు పెట్టేశారు. అలా ఇప్పటివరకు ఎవ్వరూ వినని పేరు పెట్టారు కీరవాణి తండ్రి.
1987 ప్రాంతంలో తెలుగు సంగీత దర్శకుడు చక్రవర్తి, మలయాళ సంగీత దర్శకుడు సి.రాజమణి దగ్గర సహాయకుడిగా చేరారు. చాలా సినిమాలకు పనిచేసిన తర్వాత 1990లో ‘కల్కి’ పేరుతో ప్రారంభమైన ఓ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ జరగలేదు. ఆ సినిమా కోసం చేసిన పాటలు కూడా రిలీజ్ అవ్వలేదు. కీరవాణికి సంగీతంతోపాటు సాహిత్యం పట్ల కూడా మంచి ఆసక్తి ఉంది. అందుకే కొంతకాలం వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర శిష్యరికం చేశారు.
సంగీత దర్శకుడిగా అవకాశం సంపాదించుకోవడం కోసం కొన్ని ట్యూన్స్‌ని రికార్డ్ చేసి 51 కాపీలను క్యాసెట్ల రూపంలో సిద్ధం చేశారు. వాటిని తన బంధువైన విజయేంద్రప్రసాద్‌తో కలిసి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఇళ్ళకు వెళ్ళి వారికి ఇచ్చారు. సంగీత దర్శకుడిగా అవకాశం ఇస్తే మంచి సంగీతం ఇవ్వగలను అని చెప్పారు. వేటూరి దగ్గర శిష్యరికం కారణంగా రామోజీరావు 1990లోనే నిర్మించిన ‘మనసు మమత’ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇప్పించారు. ఆ సినిమా పాటలు మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించిన తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ‘క్షణక్షణం’ చిత్రానికి మ్యూజిక్ చేసే ఛాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడిగా కీరవాణికి బ్రేక్ ఇచ్చిన సినిమా అదే.
ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు చేసిన చాలా సినిమాలకు సూపర్‌హిట్ సాంగ్స్‌ని అందించారు. కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లోనే 23 సినిమాలు చేసారు. అవన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి.
కీరవాణి కెరీర్‌లో మైలు రాళ్ళుగా చెప్పుకోదగిన సినిమాలు ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’. అలాగే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు కీరవాణి సంగీత దర్శకుడు. ‘బాహుబలి’ సిరీస్ సంగీత దర్శకుడిగా ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, పెళ్లిసందడి వంటి ఎన్నో కమర్షియల్ సినిమాలకు సూపర్‌హిట్ సాంగ్స్‌ని అందించిన ఘనతను సాధించారు కీరవాణి. తన కెరీర్‌లో మొత్తం 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో ఎక్కువ శాతం మ్యూజికల్‌గా సూపర్‌హిట్ అయ్యాయి.
కీరవాణిలో సంగీత దర్శకుడే కాదు, చక్కని గాయకుడు, భావుకత కలిగిన రచయిత కూడా ఉన్నాడు. ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే..’ పాటతో తొలిసారి సింగర్‌గా మారారు. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్‌ని ఆయన ఆలపించారు. అలాగే తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు కీరవాణి. ‘బాహుబలి2’లోని ‘దండాలయ్యా..’ సాంగ్‌కి ఉత్తమ గేయరచయితగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇవికాక ‘అన్నమయ్య’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక నంది అవార్డులు, తమిళనాడు స్టేట్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కీరవాణి ఖాతాలో చాలానే ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ట్రెండ్‌కి తగినట్టుగా తన బాణీలను మార్చుకుంటూ సంగీత దర్శకుడిగా ఇప్పటికీ టాప్ పొజిషన్‌లో ఉన్న యం.యం.కీరవాణి పుట్టినరోజు జూలై 4. ఈ సందర్భంగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తున్న స్వరవాణి కీరవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.