English | Telugu

బయోగ్రఫీ: నవరస నటనా సార్వభౌమ.. వెండితెర యమ.. మన కైకాల సత్యనారాయణ!

 

శృంగారం, హాస్యం, వీరం, కరుణ, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.. ఇలా నవరసాలను అలవోకగా పలికించే నటులు కొంతమందే ఉంటారు. వారిలో కైకాల సత్యనారాయణ ముందు వరుసలో ఉంటారు.  ఆరు దశాబ్దాల చిత్ర ప్రయాణంలో దాదాపు 800 సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న ఆయన.. తెలుగునాట 'నవరస నటనా సార్వభౌమ'గా పేరుపొందారు. అంతేకాదు..  సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక.. ఇలా అన్ని రకాల జోనర్స్ లోనూ అభినయించి ఆకట్టుకున్న వైనం కైకాల సత్యనారాయణ సొంతం. అదేవిధంగా తెలుగు తెరపై యమధర్మరాజు పాత్రలకు చిరునామాగానూ నిలిచారాయన.  అలాంటి కైకాల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీకోసం.. 

కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణాజిల్లాలోని గూడూరు తాలుకాకి చెందిన కౌతవరం గ్రామంలో జన్మించారు. గుడ్లవల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్మీడియట్, గుడివాడ కళాశాలలో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే నాటకాల మీద ఆసక్తి ఉండడంతో.. పలు నాటకాల్లో కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ వేషాలు వేశారు. మరోవైపు.. డిగ్రీ పూర్తిచేసినా సరైన ఉద్యోగం లేకపోవడంతో, తన కుటుంబానికి చెందిన కలప వ్యాపారం చూసుకున్నారు. అదేసమయంలో.. తన స్నేహితుడి సలహా మేరకు సినిమా అవకాశాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మద్రాస్ బాట పట్టారు. తొలుత సహాయ కళా దర్శకుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ.. ఆపై నటుడిగా ప్రయత్నాల వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల కోసం.. మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, వాయిస్ టెస్ట్ జరిగినా అవకాశాలు దక్కలేదు.  ఈ  నేపథ్యంలోనే.. 'సిపాయి కూతురు' చిత్రంలో ఏకంగా హీరో ఛాన్స్ ఇచ్చారు 'దేవదాసు' నిర్మాత డి.ఎల్. నారాయణ.  1959లో నిర్మితమైన ఈ సినిమాలో అప్పటి అగ్ర కథానాయిక జమున హీరోయిన్. మొదటి చిత్రమే జమున వంటి స్టార్ హీరోయిన్ కి జోడీగా నటించిన సత్యనారాయణ.. ఆ మూవీ తరువాత తన దశ, దిశ మారుతుందని భావించారు. అయితే, 'సిపాయి కూతురు' పరాజయం పాలవడంతో కైకాల అంచనాలు, ఆశలు తల్లకిందులయ్యాయి. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలో మూడేళ్ళ ఒప్పందం ఉండడంతో కొన్నాళ్ళు అవకాశాల లేమి వెంటాడిది. ఇలాంటి తరుణంలో.. నటరత్న నందమూరి తారక రామారావు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న 'రాముడు - భీముడు'లో బాడీ డబుల్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్ కి డూప్ గా సత్యనారాయణ బాగా సెట్ అవడంతో.. తరువాతి కాలంలో పెద్దాయన నటించిన పలు డ్యూయెల్ రోల్ మూవీస్ లో బాడీ డబుల్ గా కనిపించారు సత్యనారాయణ. అంతకంటే ముందు.. 'సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి'లో రాజకుమారుడిగా చిన్న వేషం కల్పించారు ఎన్టీఆర్. ఆపై జానపద బ్రహ్మ బి. విఠలాచార్య రూపొందించిన 'కనక దుర్గ పూజా మహిమ'లో విలన్ గా నటించారు కైకాల. అది కాస్త క్లిక్ అవ్వడంతో.. ప్రతినాయకుడి పాత్రలపరంగా ఆపర్ల వర్షం కురిసింది. ఆర్టిస్టుగా బిజీ అవుతున్న సమయంలోనే నాగేశ్వరమ్మని వివాహమాడారు సత్యనారాయణ. పెళ్ళయి నలుగురి బిడ్డలకు తండ్రయ్యాక కైకాల కెరీర్ స్పీడందుకుంది. 

ఈ దశలోనే ప్రతినాయకుడి పాత్రల్లో అలరిస్తూనే కరుణరసం, హాస్యరసంతో కూడిన పలు పాత్రలు పోషించారు కైకాల. అలాగే కెరీర్ ఆరంభం నుంచే పరమేశ్వరుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలు పోషిస్తూ వచ్చిన సత్యనారాయణకి.. ఎన్టీఆర్ 'యమగోల'లో యమధర్మరాజుగా నటించే అవకాశం దక్కింది. ఆ పాత్రలో ఆయన పరకాయప్రవేశం చేసిన తీరు.. ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఆపై 'యముడికి మొగుడు', 'యమలీల', 'యమగోల మళ్ళీ మొదలైంది' సినిమాల్లోనూ యముడిగా ఆకట్టుకున్నారు. అలా వెండితెర యమ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. యముడి పాత్రల్లో కైకాల నటిస్తే.. సినిమా పక్కా హిట్ అనే ఇమేజ్ వచ్చింది. కెరీర్ తుది దశలోనూ సీనియర్ యమగా 'దరువు' చిత్రంలో కనిపించారు కైకాల. 

 ఒకే కథాంశంతో తెరకెక్కి ఒకే రోజున పోటాపోటీగా రిలీజైన 'దానవీరశూరకర్ణ', 'కురుక్షేత్రం' సినిమాల్లో రెండు విభిన్న పాత్రల్లో అలరించారు సత్యనారాయణ. 'దానవీరశూరకర్ణ'లో భీముడిగా దర్శనమిచ్చిన ఆయన.. 'కురుక్షేత్రం'లో దుర్యోధనుడిగా కనిపించి మెప్పించారు. 

కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాణంలోనూ తనదైన ముద్రవేశారు కైకాల సత్యనారాయణ. తన సోదరుడు కె. నాగేశ్వరరావు పేరిట రమా ఫిల్మ్స్ బేనర్ లో ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. నందమూరి తారక రామారావు హీరోగా 'గజదొంగ' చిత్రాన్ని చలసాని గోపితో పాటు నిర్మించి శుభారంభాన్ని చూసిన సత్యనారాయణ.. ఆపై 'ఇద్దరు దొంగలు', 'కొదమసింహం', 'బంగారు కుటుంబం' వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. సత్యనారాయణ కెరీర్ ని పరిశీలిస్తే.. పలు సందర్భాల్లో ఆయనకి నందమూరి తారక రామారావు ప్రోత్సాహం మెండుగా ఉందని చెప్పకతప్పదు. అందుకేనేమో.. ఎన్టీఆర్ తో ఏకంగా 101 సినిమాల్లో కలిసి నటించే అరుదైన అవకాశం దక్కింది కైకాలకి. అంతేకాదు.. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మూడు తరాల అగ్ర కథానాయకులతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని రంజింపజేశారు కైకాల. అలాగే ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, రవితేజ వంటి టాప్ స్టార్స్ కాంబినేషన్ లోనూ ఎంటర్టైన్ చేశారు. కళా రంగానికి చేసిన సేవలకి గానూ.. 2011లో రాష్ట్ర ప్రభుత్వం తరపున రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల సత్యనారాయణ.. 2017లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ కి ఎంపికయ్యారు. ఇక సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు కైకాల. 1996లో తెలుగుదేశం తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారాయన. ఇలా.. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు సత్యనారాయణ. 2022 డిసెంబర్ 23న అంటే తన 87వ ఏట అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు కైకాల సత్యనారాయణ. ప్రస్తుతం భౌతికంగా ఆయన మన ముందు  లేకున్నా.. విభిన్న పాత్రల  రూపంలో ఎప్పటికీ చేరువలోనే ఉంటారు కైకాల సత్యనారాయణ. 

(జూలై 25.. కైకాల సత్యనారాయణ జయంతి)