English | Telugu
శోభన్ బాబు 'మల్లెపూవు'కి 45 వసంతాలు!
Updated : Jul 25, 2023
నటభూషణ్ శోభన్ బాబు పలు రీమేక్ మూవీస్ లో ఎంటర్టైన్ చేశారు. వాటిలో గురుదత్ హిందీ చిత్రం 'ప్యాసా' (1957) ఆధారంగా తెరకెక్కిన 'మల్లెపూవు' ఒకటి. ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావు రూపొందించిన ఈ సినిమాలో లక్ష్మి, జయసుధ నాయికలుగా నటించగా రావు గోపాల రావు, శ్రీధర్, గిరిబాబు, కేవీ చలం, మాడా ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. అల్లు రామలింగయ్య, వేటూరి సుందరరామ్మూర్తి, ఆరుద్ర, నిర్మల, పండరీబాయి అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. గుర్తింపుకు నోచుకుని ఓ కవి (శోభన్ బాబు) చుట్టూ తిరిగే 'మల్లెపూవు'లో.. ఆ కవి విఫలప్రేమ, అన్నదమ్ముల ఛీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, బ్రతికుండగా రాని గుర్తింపు చనిపోయాక అతనికి రావడం వంటి ప్రధాన ఘట్టాలు ఆకట్టుకుంటాయి.
కె. చక్రవర్తి సంగీతమందించిన 'మల్లెపూవు'కి వేటూరి సుందరరామ్మూర్తి, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వీటూరి సాహిత్యమందించారు. "చిన్న మాట ఒక చిన్నమాట", "నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా", "ఓహో ఓహో లలిత నా ప్రేమ కవిత", "బ్రతికున్నా చచ్చినట్లే ఈ సంఘంలో", "మల్లెపూవులా వసంతం మా తోటకి వచ్చింది", "చకచక సాగే చక్కని బుల్లెమ్మ", "ఓ ప్రియా మరుమల్లియ కన్న తెల్లనిది", "జుంబంబా జుంబంబా" అంటూ సాగే ఇందులోని పాటలన్నీ ఆదరణ పొందాయి. వీటిని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, వాణీజయరామ్, వి. రామకృష్ణతో పాటు చక్రవర్తి గానం చేశారు. సమతా ఆర్ట్స్ పతాకంపై వి.ఆర్. యాచేంద్ర, కె. ఛటర్జీ నిర్మించిన 'మల్లెపూవు'.. వైజాగ్ లో శతదినోత్సవం జరుపుకుంది. 1978 జూలై 26న జనం ముందు నిలిచిన 'మల్లెపూవు'.. బుధవారంతో 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.