English | Telugu

ఆస్కార్‌ రేంజ్‌లో సినిమా చేసినా.. వారిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చెయ్యడానికి 37 ఏళ్ళు పట్టింది!

 

మణిరత్నం.. ఈ పేరు చెబితే చాలు.. ఓ దృశ్యకావ్యం మన మనసుల్లో మెదులుతుంది. సామాజిక స్పృహ ఉన్న బాధ్యతగల పౌరులు గుర్తు వస్తారు. అల్లరి చేసే అమ్మాయిలు కళ్ళముందు ప్రత్యక్షమవుతారు. ఎన్నోరకాల భావాలు మనల్ని పులకరింపజేస్తాయి. ఒక్క దర్శకుడిలోనే ఇన్ని కోణాలు మనకు కనిపిస్తున్నాయంటే.. ఆ దర్శకుడు సామాన్యుడు కాదు అనేది అర్థమవుతుంది. మణిరత్నం సినిమాలకు ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సినిమానీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించే ఆయన తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని ఏర్పరుచుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు, వెంటనే థియేటర్లకు పరుగులు పెట్టే వీరాభిమానులు ఆయన సొంతం. మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని ప్రతి హీరో, ప్రతి హీరోయిన్‌ అనుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కింది. 

 

చిన్నతనం నుంచీ సినిమాలపై అంతగా ఆసక్తి లేని మణిరత్నం ఇప్పుడు దేశం గర్వించే గొప్ప దర్శకుడు అయ్యారంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పల్లవి అను పల్లవి’ మొదలుకొని ‘పొన్నియన్‌ సెల్వన్‌’ వరకు మణిరత్నం రూపొందించిన కళాఖండాల గురించి చెప్పుకోవాలంటే మన శక్తిని మించిన పనే అవుతుంది. ఆయన చేసిన సినిమాలు దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రదర్శితమయ్యాయి. ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకొని దాని చుట్టూ ఓ అందమైన ప్రేమకథను అల్లి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం మణిరత్నంకి వెన్నతో పెట్టిన విద్య. రోజా, ముంబాయి వంటి సినిమాలకు సైతం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే ఆ సినిమాల్లో ఉన్న డెప్త్‌ అలాంటిది, మణిరత్నం ఎంపిక చేసుకున్న కథాంశాలు అలాంటివి. మూడు దశాబ్దాలకు పైగా భారత చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మణిరత్నం సినిమాలంటే ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 

 

మణిరత్నం తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ‘గీతాంజలి’. అద్భుతమైన ఒక ప్రేమకావ్యంగా రూపొందిన ఈ సినిమా తర్వాత ఎంతో మంది తెలుగు నిర్మాతలు ఆయనతో సినిమా చెయ్యాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అలాగే మణిరత్నం కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయే సినిమా ‘నాయకుడు’. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ నటన, మణిరత్నం దర్శకత్వ ప్రతిభ రెండూ పోటీ పడ్డాయి. ఇండియన్‌ సినిమాలోని టాప్‌ మూవీస్‌ గురించి ప్రస్తావించాల్సి వస్తే అందులో నాయకుడు సినిమా తప్పకుండా ఉంటుంది. కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా వారికి అంత మంచి పేరు తెచ్చినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందడానికి 37 సంవత్సరాలు పైనే పట్టింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ‘థగ్‌లైఫ్‌’ చిత్రం రూపొందుతోంది. 

టెర్రరిజం ట్రయాలజీగా పేరొందిన చిత్రాలు.. మణిరత్నం ఖాతాలో చాలానే ఉన్నాయి. రోజా, బొంబాయి, దిల్‌ సే వంటి సినిమాలను ఎంతో సాహసోపేతంగా తెరకెక్కించారు మణిరత్నం. ఈ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నాయి. మణిరత్నం సినిమా అంటే కథ, కథనాలే కాదు, అన్ని విభాగాల్లోనూ ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌ని ఓ పెయింటింగ్‌లా తీర్చి దిద్దడం ఆయన ప్రత్యేకత. ఇక సంగీతం విషయానికి వస్తే చెప్పక్కర్లేదు. పల్లవి అనుపల్లవి నుంచి దళపతి వరకు అంటే 10 సినిమాల్లోని పాటలు ఇళయరాజా సంగీత సారధ్యంలోనే రూపొందాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన పాటలన్నీ చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. 1983లో అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన మణిరత్నం తన మార్క్‌ సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఆయన సినిమాల్లో ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే పి.సి.శ్రీరామ్‌, సంతోష్‌ శివన్‌ వంటి సినిమాటోగ్రాఫర్లు తమ పూర్తి టాలెంట్‌ని మణిరత్నం సినిమాలకు వినియోగిస్తారు. కమల్‌హాసన్‌తో చేస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చెయ్యబోతున్న మణిరత్నం పుట్టినరోజు జూన్‌ 2. ఈ సందర్భంగా లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.