Read more!

English | Telugu

చిన్న వయసులో టాప్‌ హీరోయిన్‌ అయింది.. చిన్న వయసులోనే మృత్యువు ఒడి చేరింది!

ఆర్తీ అగర్వాల్‌.. అందం, అభినయం కలగలిసిన అమ్మాయి. గుజరాతీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ లంగా, ఓణీ వేస్తే అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఆమెను హీరోయిన్‌గా స్వీకరించారు. ఆమె నటించిన సినిమాలను ఆదరించారు. అతి చిన్న వయసులోనే అంటే 17 సంవత్సరాల వయసులోనే 2001లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘పాగల్‌పన్‌’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీలో నటించిన ఒకే ఒక చిత్రం అది. 2015 వరకు కొనసాగిన ఆమె సినీ ప్రయాణంలో 26 సినిమాల్లో నటించింది. అందులో ఒక తమిళ సినిమా ఉంది. మిగతా 24 సినిమాలు తెలుగులో చేసినవే. అంటే తెలుగు ప్రేక్షకులు ఆమెను అంతగా ఓన్‌ చేసుకున్నారని చెప్పొచ్చు. 

గ్లామర్‌ ప్రపంచంలో పైకి ఎదగాలన్న ఆశతో..!

అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ కుటుంబంలో 1984 మార్చి 5న న్యూజెర్సీలో ఆర్తి అగర్వాల్‌ జన్మించింది. వీమా అగర్వాల్‌, కౌశిక్‌ అగర్వాల్‌ ఆమె తల్లిదండ్రులు. 14 సంవత్సరాల వయసులోనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఆర్తీ. ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్‌ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్‌ చూసి ముచ్చటపడిన బిగ్‌ బీ.. ఆమెను బాలీవుడ్‌లో యాక్ట్‌ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్‌లో మంచి నటి అవగలదని ఆర్తీ తండ్రిని ఒప్పించారు. దాంతో ముంబాయి చేరుకున్న ఆర్తీ ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. 2001లో ‘పాగల్‌పన్‌’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. అదే సంవత్సరం వెంకటేశ్‌ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఆర్తీకి వరస అవకాశాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి టాలీవుడ్‌లోనే ఉండి పోయింది తప్ప మరో భాషలో నటించలేదు. మధ్యలో ఒక తమిళ్‌ సినిమా మాత్రం చేసింది. 2000 దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి టాప్‌ హీరోల సరసన నటించింది. అంతేకాదు, మహేష్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ రవితేజ, ఉదయ్‌కిరణ్‌, తరుణ్‌ వంటి యంగ్‌ హీరోల పక్కన కూడా హీరోయిన్‌గా నటించిన ఘనత సాధించింది ఆర్తీ. 

రెండు సంవత్సరాలు కూడా నిలవని వైవాహిక జీవితం!

వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్‌, వసంతం, సంక్రాంతి చిత్రాల్లో నటించిన ఆర్తీ చిరంజీవితో నటించిన ఇంద్ర ఆమెను టాప్‌ హీరోయిన్‌ని చేసింది. మహేష్‌తో బాబీ.. బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడు, రవితేజతో వీడే, నాగార్జునతో నేనున్నాను,  ప్రభాస్‌తో అడవిరాముడు, ఎన్టీఆర్‌తో నరసింహుడు, సునీల్‌తో అందాలరాముడు, రాజశేఖర్‌తో గోరింటాకు, వేణుతో దీపావళి వంటి సినిమాల్లో నటించి తక్కువ సమయంలో టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. 2007లో సికింద్రాబాద్‌ రాణీగంజ్‌లోని ఆర్య సమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉజ్వల్‌ విక్రమ్‌ను ఆర్తీ పెళ్లి చేసుకుంది. అయితే వారి కాపురం రెండు సంవత్సరాలకు మించి కొనసాగలేదు. 2009లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

కెరీర్‌పరంగా ఎదగాలన్న పట్టుదలే ఆమె ప్రాణం తీసింది!

ఒక దశలో బాగా బరువు పెరిగిపోవడం వల్ల అవకాశాలు కూడా తగ్గాయి. బరువు తగ్గి కెరీర్‌ పరంగా ఇంకా ఎదగాలని, తన మునుపటి స్టార్‌డమ్‌ను తిరిగి తెచ్చుకోవాలన్న పట్టుదల ఆమెలో పెరిగింది. ఒక సినిమాలోని పాత్ర కోసం బరువు తగ్గాలని మేకర్స్‌ సూచించారు. అప్పటికే 89 కేజీల బరువు వున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గేందుకు లైపోసక్షన్‌ చేయించుకుంది. అయితే ఈ సర్జరి తర్వాత ఆమెకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆపరేషన్‌ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్‌ 2015 జూన్‌ 6న కన్ను మూసింది. అయితే అంతకుముందు 2005లో క్లీనింగ్‌ కెమికల్‌ తాగడం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో హీరో తరుణ్‌తో తనకు సంబంధం ఉందన్న వార్త బాగా ప్రచారంలోకి రావడంతో ఆత్మహత్యా యత్నం చేసానని చెప్పింది. ఆ తర్వాత 2006లో అనుమానాస్సద పరిస్థితిలో హాస్పిటల్‌లో జాయిన్‌ అయింది. మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల గాయాలైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతి చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చి, చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ చూసి, అదే చిన్న వయసులోనే ఆర్తీ అగర్వాల్‌ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవడం ప్రేక్షకులను, ఆమె అభిమానులను కలచివేసింది.