Read more!

English | Telugu

300కి పైగా సినిమాల్లో నటించినా... ఇద్దరు భర్తలతో నానా ఇబ్బందులు పడిన హీరోయిన్‌!

సినిమా రంగంలో పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం. ఆరోజుల్లో ఇలా ఉండేవారు కాదు, మా రోజుల్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు అని చెప్పడానికి సినిమా రంగంలో అవకాశం లేదు. ఎందుకంటే సినిమా పుట్టినప్పటి నుంచి నటీనటులు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోవడం జరుగుతూనే ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. పాత తరం హీరోయిన్లలో రాజసులోచనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆరోజుల్లో మహిళలు నాటక రంగంలో, సినిమా రంగంలో ప్రవేశించేందుకు పెద్దవారు ఒప్పుకునేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో రాజసులోచన నాటక రంగంలో, నృత్య ప్రదర్శనలోనే కాకుండా కార్‌ డ్రైవింగ్‌, బోట్‌ రైడిరగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మార్చి 5 రాజసులోచన వర్థంతి.  ఈ సందర్భంగా ఆమె జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు, తన సినీ జీవితాన్ని ఎలా కొనసాగించారు అనే విషయాలు తెలుసుకుందాం. 

1934 ఆగస్ట్‌ 15న విజయవాడలో జన్మించారు రాజసులోచన. ఈమె అసలు పేరు రాజీవలోచన. అయితే స్కూల్‌ రిజిస్టర్‌లో రాజసులోచన అని పొరపాటున రాయడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఆమెకు నాట్యంపై ఆసక్తి ఏర్పడడానికి కారణం ఆమె మేనమామ. సుగుణ విలాస సభ అనే సంగీత మండలిని నెలకొల్పి నాటక, నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారాయన. ఆ ప్రదర్శనలు చూసి వచ్చిన తర్వాత వారు ఎలా పాడారో, ఎలా నృత్యం చేశారో ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చూపించేది రాజసులోచన. ఏడేళ్ళ వయసులో సంగీతం నేర్చుకోవడానికి పంపించారు తల్లిదండ్రులు. అయితే సంగీతం కంటే నృత్యంపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు గమనించి అప్పటి నుంచే నృత్యం నేర్పించారు. యుక్తవయసు రావడంతో మూడో ఫారంలోనే చదువు మాన్పించేశారు. తన 13వ ఏట తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు రాజసులోచన. తనకు తెలిసిన విద్యను నలుగురికీ నేర్పాలన్న ఉద్దేశంతో తమ చుట్టుపక్కల అమ్మాయిలకు శిక్షణ ఇచ్చేవారు.

అలా ఓ యువతికి నృత్యం నేర్పించేందుకు వాళ్ళ ఇంటికి తరచూ వెళ్లేది. అక్కడ పరమశివం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్ళు మిలటరీలో పనిచేసిన అతను ప్రగతి స్టూడియోలో స్టోర్‌ కీపర్‌గా పనిచేసేవాడు. అతను చెప్పే మాటలకు పడిపోయింది రాజసులోచన. పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో పరమశివాన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా కూతురి మాట కాదనలేక 1951 సెప్టెంబర్‌ 11న మద్రాస్‌లోని సెయింట్‌ మేరీస్‌ హాల్‌లో కరుణానిధి సమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదికి వారికి ఒక బాబు పుట్టాడు. అతనికి శ్యామ్‌ అని పేరు పెట్టారు. పెళ్ళయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది రాజసులోచన. తొలుత నటిగా నిలదొక్కుకునేందుకు తెలుగు, తమిళ్‌ సినిమాల్లో వ్యాంప్‌ వేషాలు వేసినా ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన సొంత ఊరు సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. దాంతో ఆ తర్వాత హీరోయిన్‌గా బిజీ అయింది రాజసులోచన. అది ఆమెకు సంతోషం కలిగించినా ఆమె వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. భర్త పరమశివం తరచూ ఆమెను వేధిస్తుండడంతో అది భరించలేక భరించలేక అతనికి విడాకులు ఇచ్చేసింది. 

భర్త నుంచి విడిపోయిన తర్వాత కెరీర్‌ పరంగా కొన్ని ఆటుపోట్లకు గురయ్యారు రాజసులోచన. తన బాధలు చెప్పుకునేందుకు ఒక మనిషి ఉంటే బాగుండేది అనుకుంటున్న సమయంలో దర్శకుడు సి.ఎస్‌.రావులోని మంచితనం ఆమెను ఆకర్షించింది. తన బాధలు అతనితో చెప్పుకొని సేద తీరేది. ఆమె నటించిన చాలా సినిమాలకు సి.ఎస్‌.రావు దర్శకుడు. షూటింగ్‌ సమయంలో రాజసులోచన అతనితో చనువుగా ఉండడం చూసి పరిశ్రమలో వీరి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి తెరదించేందుకు రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సి.ఎస్‌.రావు. అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజసులోచన కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. 1963లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1966 జూలై 27న వీరికి కవల పిల్లలు పుట్టారు. ఆరోజుల్లో కవల పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదు. అందుకే ఈ వార్త అప్పల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శోభన్‌బాబు హీరోగా నటించిన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో శారద ద్విపాత్రాభినయం చేశారు. ఆమె చిన్నప్పటి పాత్రలను రాజసులోచన కూతుళ్ళు పోషించారు. 

రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పెళ్ళయిన తొలి రోజుల్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న సి.ఎస్‌.రావు, రాజసులోచన దంపతులు పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వారిలో సఖ్యత లోపించింది. అభిప్రాయ భేదాలు పెరిగాయి. దీంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆమె జీవితంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు ఆమెకు కలిసి రాలేదు. తొలిరోజుల్లో మొదటి భర్త పరమశివంతో, చివరి రోజుల్లో రెండో భర్త సి.ఎస్‌.రావుతో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి 2013 మార్చి 5 తెల్లవారుజామున అనారోగ్య కారణాల వల్ల తన నివాసంలో తుది శ్వాస విడిచారు రాజసులోచన.