English | Telugu
33 సంవత్సరాల కెరీర్‌లో చేసిన సినిమాలు 13.. అందులో 8 అవార్డు సినిమాలు!
Updated : Jun 2, 2024
దర్శకుడిగా ఆయన శైలి ఎంతో విభిన్నం. తను సినిమాగా రూపొందించాలనుకున్న కథ తాలూకూ అంశాలను ఎంతో లోతుగా పరిశీలించి అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే మెగా ఫోన్ పట్టుకునే దర్శకుడాయన. క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఆ డైరెక్టర్ తన 33 సంవత్సరాల కెరీర్‌లో చేసిన సినిమాలు కేవలం 13 మాత్రమే. దీన్నిబట్టి ఒక సినిమా తెరకెక్కించడానికి ఎంత కృషి చేస్తారో అర్థమవుతుంది. ఆయన మరెవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్.
గుణశేఖర్ చేసిన 13 సినిమాల్లో 8 అవార్డు సాధించిన సినిమాలు వుండడం గొప్ప విశేషం. ఇలాంటి రికార్డు మరో దర్శకుడి లేదనే చెప్పాలి. తొలిచిత్రం ‘లాఠీ’తోనే ఉత్తమ నూతన దర్శకుడుగా నంది అవార్డును అందుకున్నారు గుణశేఖర్. ఆ తర్వాత ‘సొగసు చూడతరమా’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందించింది. మూడో సినిమాగా రామాయణ గాథను చిన్న పిల్లలతో తెరకెక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచారు గుణశేఖర్. ఈ సినిమాలో రాముడిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ‘రామాయణం’ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఈ తరహా సినిమా చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘చూడాలని వుంది’ వంటి కమర్షియల్ సినిమా చేసే అవకాశం రావడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ సినిమా కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లో డిటిఎస్ సౌండ్ సిస్టమ్ ప్రారంభమైంది. 2000లో విడుదలైన ‘మనోహరం’ చిత్రానికిగాను ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును గెలుచుకున్నారు గుణశేఖర్. 2001లో చిరంజీవితో రెండో సినిమాగా రూపొందించిన ‘మృగరాజు’ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2003లో మహేష్‌తో చేసిన ‘ఒక్కడు’ చిత్రంతో మరోసారి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు గుణశేఖర్. ఈ సినిమాకి అవార్డులు వెల్లువెత్తాయి. ప్రధాన విభాగాల్లో 8 నంది అవార్డులు రావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇవికాక, ఫిలింఫేర్, సినీమా అవార్డులు, ఎపి సినీగోయర్స్, సంతోషం అవార్డులు ఇలా ఎన్నో ప్రశంసలు అందుకున్న సినిమా ‘ఒక్కడు’. ఈ సినిమాతో మహేష్‌కి స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాను ఐదు భాషల్లో రీమేక్ చేశారు. 2004లో మహేష్‌తోనే గుణశేఖర్ చేసిన ‘అర్జున్’ ఫర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలోని నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు మహేష్. 2006లో మహేష్‌తోనే ‘సైనికుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు గుణశేఖర్. ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్‌తో వరసగా మూడు సినిమాలు చేసిన ఏకైక దర్శకుడు గుణశేఖర్. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో చేసిన ‘వరుడు’ చిత్రానికి చాలా హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు గుణశేఖర్. ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే విషయాన్ని చాలా కాలం సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘వరుడు’ చిత్రం గుణశేఖర్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. అయితే స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రానికి నంది అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత రవితేజతో రూపొందించిన ‘నిప్పు’ కూడా డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా పలు విమర్శలను ఎదుర్కొన్నారు గుణశేఖర్.
రెగ్యులర్ ఫార్మాట్‌లో చేసే సినిమాలు తనకు విజయాలు అందించడం లేదని భావించిన గుణశేఖర్ ఈసారి చరిత్రపై దృష్టి పెట్టారు. కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో సినిమా తియ్యాలన్న ఆలోచన వచ్చింది. చరిత్రకు సంబంధించిన ఎన్నో అంశాలను పరిశీలించి, పరిశోధించి మంచి కథను రెడీ చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రుద్రమదేవి కథాంశంతో ఒక భారీ చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అప్పటికే వరస పరాజయాలతో సతమతమవుతున్న గుణశేఖర్‌తో సినిమా చేసేందుకు నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. అందుకే తనే సొంతంగా సినిమా చేసేందుకు సిద్ధపడ్డారు. అదే ‘రుద్రమదేవి’ చిత్రం. తెలుగులో 3డి స్టీరియోస్కోపిక్ ఫార్మాట్‌లో రూపొందిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. రుద్రమదేవిగా అనుష్కతో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చేయించారు గుణశేఖర్. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను మలిచిన తీరు అందర్నీ ఆకర్షించింది. ఆ పాత్రను అల్లు అర్జున్ అంతే అద్భుతంగా పోషించారు. అంతేకాదు, ఉత్తమ సహాయనటుడిగా అల్లు అర్జున్ నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించడంతోపాటు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళకుండా హిరణ్యకశ్యప కథను రానాతో తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. రుద్రమదేవి విడుదలైన 8 సంవత్సరాల తర్వాత 2023లో స్వీయ దర్శకత్వంలో ‘శాకుంతలం’ చిత్రాన్ని నిర్మించారు గుణశేఖర్. ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందుకుంది. విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొని ఎన్నో ఘనవిజయాలను చూసిన గుణశేఖర్.. 'యుఫోరియా' అనే మరో కొత్త తరహా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. జూన్ 2 గుణశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.