English | Telugu

నాకూ, శ్రీ‌దేవికీ ఇదే లాస్ట్ సీన్ అని చెప్పారా?.. డైరెక్ట‌ర్‌ని అడిగిన‌ ఎన్టీఆర్‌!

 

ఏవీయం స్టూడియోలో 'వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు' సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఆరోజు ఎన్టీ రామారావు, శ్రీ‌దేవి జంట‌పై బెడ్‌రూమ్‌ సీన్ తీస్తున్నారు ద‌ర్శ‌కుడు క‌ట్టా సుబ్బారావు. ఓ గ్లాసులో శ్రీ‌దేవి హార్లిక్స్ ప‌ట్టుకొని బెడ్‌రూమ్ ద‌గ్గ‌ర నిల్చుంది. డైరెక్ట‌ర్ "యాక్ష‌న్" అన్నారు. శ్రీ‌దేవి చ‌క‌చ‌కా హార్లిక్స్ ప‌ట్టుకొచ్చి ఎన్టీఆర్‌కు ఇచ్చింది. "ఏమిటిది?" అని ఆశ్చ‌ర్యంగా అడిగారు ఎన్టీఆర్‌. "హార్లిక్స్" అంది ముద్దుగా శ్రీ‌దేవి. "మ‌ధ్య‌లో అదెందుకు?" అంటూ శ్రీ‌దేవిని ద‌గ్గ‌ర‌కు లాక్కొని మంచం మీద కూర్చోబెట్టారు ఎన్టీఆర్‌. ఆమె భుజాల‌మీద చేతులువేసి కౌగ‌లించుకోడానికి ట్రై చేశారు. 

"ముందు ఈ హార్లిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటారు." అని మ‌ళ్లీ చెప్పింది శ్రీ‌దేవి. న‌వ్వుతూ "నాకొక స‌హాయం చేస్తావా?" అన‌డిగారు ఎన్టీఆర్‌. "చెప్పండి. దానిదేముంది" అంది చిలిపిగా శ్రీ‌దేవి. "గొల్ల‌భామ పాల‌డ‌బ్బాలు అమ్ముతారు.. అవి తీసుకొచ్చి, ఆ పాలు సీసాలోపోసి, దానికొక పీక‌పెట్టి, ఆ సీసా నా నోట్లోపెట్టు." అని నోరు చ‌ప్ప‌రించారు ఎన్టీఆర్‌. "అబ్బ‌.. పోండి.. నాకిక్క‌డ చాలా ప‌నులున్నాయి." అంటూ ఎన్టీఆర్ కౌగిలి నుంచి బ‌ల‌వంతంగా త‌ప్పించుకొని గ‌బ‌గ‌బా అక్క‌డ‌నుంచి వెళ్లిపోయింది. 

"ఛీ.. ప‌థ్యం ఆహారం.. ప‌థ్యం పాలు." అంటూ ఎన్టీఆర్ విసురుగా ఆ గ్లాసును నేల‌కేసి కొట్టారు. గ్లాస్ ట‌ప్‌మంటూ లెక్క‌పెట్ట‌లేన‌న్ని ముక్క‌లైంది. "క‌ట్" అన్నారు క‌ట్టా సుబ్బారావు.

"సార్ స్టిల్" అంటూ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. "శ్రీ‌దేవిని పిల‌వండి" అంటూ ఆర్డ‌ర్ వేశారు డైరెక్ట‌ర్‌. శ్రీ‌దేవి వ‌చ్చింది. ఎన్టీఆర్‌, శ్రీ‌దేవి బెడ్‌మీద కూర్చొని రొమాంటిక్ పోజులిస్తున్నారు. ఫ్లాష్‌లు వెలుగుతున్నాయి. కెమెరాలు క్లిక్ మంటున్నాయి. 

"వ‌న్ మోర్ సార్‌.. వ‌న్ మోర్ సార్‌.." అంటూ ఫొటోగ్రాఫ‌ర్లు ఇంకా పోజులిమ్మ‌ని అడుగుతున్నారు. ఎన్టీఆర్‌, శ్రీ‌దేవి ర‌క‌ర‌కాల పోజులిస్తున్నారు. వాళ్ల‌లా పోజులిస్తుంటే ఫొటోలు తీస్తూనే ఉన్నారు. ఎంత‌సేప‌టికీ ఫొటోగ్రాఫ‌ర్లు ఎవ‌రూ 'ఇక చాలు' అని చెప్ప‌డం లేదు. అక్క‌డ్నుంచి క‌ద‌ల‌డం లేదు. 

చూసి చూసి, క‌ట్టా సుబ్బారావుతో "ఏం బ్ర‌ద‌ర్ నాకూ, శ్రీ‌దేవికీ ఇదే లాస్ట్ సీన్ అని చెప్పారా ఏమిటి? ఇన్ని స్టిల్స్ తీసేస్తున్నారు. మాకింకా పాట‌లున్నాయి.. మ‌ర్చిపోయారా?" అన్నారు ఎన్టీఆర్ న‌వ్వుతూ. దాంతో అంద‌రూ ఘొల్లున న‌వ్వారు. అప్పుడు గానీ ఫొటోగ్రాఫ‌ర్స్ ఫొటోలు తీయ‌డం ఆపలేదు.